తాడేపల్లి: వన్ ఈజ్ టు వన్ రేషియోలోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు పిల్చి, అన్నింటా సక్సెస్ అయిన అనేక మంది డీఎస్సీ–2025 అభ్యర్థులకు ఉద్యోగాలు రాకపోవడం అత్యంత హేయమని, ఇంత కంటే దారుణం మరొకటి ఉండదని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆక్షేపించారు. ఈ పరీక్ష నిర్వహణ, ఎంపికలో అంతులేని అక్రమాలు చోటు చేసుకున్న విషయం డీఎస్సీ అభ్యర్థులు చెబుతున్న విషయాలను బట్టి తెలుస్తోందని, అందుకే డీఎస్సీ–2025పై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇష్టారాజ్యంగా జీఓలు జారీ చేసి, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారని, దీని వల్ల ఎందరో అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని శ్రీ వైయస్ జగన్ వెల్లడించారు. వారి తరపున పార్టీ నుంచి న్యాయ పోరాటం చేస్తామన్న ఆయన అందుకోసం లీగల్ ప్యానెల్ ఒకటి ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అధికారంలోకి రాగానే, కమిషన్ వేసి విచారణ జరిపిస్తామని, అన్యాయానికి గురైన అభ్యర్థులకు అవసరమైతే అదనపు పోస్టులు ఇస్తామని పార్టీ కేంద్ర కార్యాలయంలో తనను కలిసి, తమ బాధ చెప్పుకున్న పలువురు డీఎస్సీ–2025 అభ్యర్థులకు భరోసా ఇస్తూ శ్రీ వైయస్ జగన్ వివరించారు. ఈ సందర్భంగా శ్రీ వైయస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే..: నాడు ఒకేసారి 1.30 లక్షల ఉద్యోగాలు: వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే, 2019లో గాంధీ జయంతి నాటికి 1.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చినా, ఎక్కడా, ఏ వివాదం రాలేదు. అంత పారదర్శకంగా పరీక్ష నిర్వహించి, అభ్యర్థులను ఎంపిక చేసి ఉద్యోగాలు ఇచ్చాం. అదే చంద్రబాబుగారు కేవలం 16 వేల ఉద్యోగాల్లో ఇన్ని అక్రమాలు, అవకతవకలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అందుకే మీ తరపున న్యాయపోరాటం చేస్తాం. మీకు ఖర్చు లేకుండా, మేమే భరించి, కోర్టులో పోరాడతాం. ఇదీ డీఎస్సీ–2025లో అక్రమాల క్రమం: స్పోర్ట్స్ కోటా పేరిట మొదట ఒక జీఓ ఇచ్చారు. ఎలాంటి పరీక్ష అవసరం లేదని, కేవలం సర్టిఫికెట్ల ఆధారంగా ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత వారు ఇష్టం వచ్చినట్లు భర్తీ చేసి, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. ఆ తర్వాత మరో జీఓ జారీ చేసి, ఆ కోటాలో కూడా అభ్యర్థులు ఇక నుంచి పరీక్ష రాయాలని, ఇతర అర్హతలు కూడా కలిగి ఉండాలని నిర్దేశించారు. అంటే తమ పని పూర్తి చేయగానే, మళ్లీ నియమావళి మారుస్తూ మరో జీఓ ఇచ్చారు. డీఎస్సీ నిర్వహణలో ఎక్కడా పారదర్శకత లేదు. ఇష్టారాజ్యంగా వ్యవహరించి, ఉద్యోగాలు అమ్ముకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విచారణ జరిపిస్తాం. న్యాయం చేస్తాం: రేపు వైయస్సార్‌సీపీ ప్రభుత్వం రాగానే, డీఎస్సీ–2025లో అక్రమాలపై విచారణ జరిపిస్తాం. కొంచెం ఓపిక పట్టండి. ఇప్పుడు సీబీఐ విచారణకు గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. మూడేళ్ల తర్వాత మన ప్రభుత్వం రాగానే, మీ స్పెసిఫిక్ కేసుల మీద ఒక కమిషన్ వేసి విచారణ జరిపిస్తాం. అలా మీకు న్యాయం జరిగేలా చూస్తాం. పోరాడితేనే న్యాయం జరుగుతుంది. న్యాయం ఆలస్యం కావొచ్చు. కానీ జరగకుండా ఉండదు. తప్పుల మీద తప్పులు: 1:1 పద్ధతిలో పిలిచి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పూర్తి చేసి, రిజెక్ట్ చేయడం ఒక తప్పు. రెండో అనైతికం ఏమిటంటే.. ఏ పరీక్ష రాయకుండా స్పోర్ట్స్ కేటగిరీ అని చెప్పి, వారికి ఉద్యోగాలు ఇవ్వడం కోసం మీకు అన్యాయం చేశారు. ఆ పని చేయగానే, గేట్లు మూసి, మరో జీఓ ఇచ్చారు. ఇంత కంటే దగా, మోసం మరోటి ఉంటుందా? జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అభ్యర్థికి ఉద్యోగం ఇవ్వలేదు. ఎందుకంటే, అతడు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు రాలేదని చెప్పారు. కానీ అదే అభ్యర్థి తనకు ఉద్యోగం ఇవ్వలేదని కోర్టుకు వెళ్లాడు. పరీక్షకు ముందే పేపర్లు లీక్ చేయడం, ఆ తర్వాత ఇష్టానుసారం జీఓలు జారీ చేయడం, మళ్లీ 1:1 పద్ధతిలో సర్టిఫికెట్లు వెరిఫై చేసినా, అన్నీ కరెక్టుగా ఉన్నా ఉద్యోగాలు ఇవ్వకపోవడం, ఆ తర్వాత ఇంకా మెరిట్ వాళ్లను కాకుండా కింద ఉన్న వారికి ఇవ్వడం, వాటిపై గ్రీవెన్స్ సెల్‌లో ఇస్తే, వాటిపై స్పష్టమైన సమాధానాలు చెప్పకపోవడం ఇవన్నీ జరిగాయి. మీరంతా క్వాలిఫైడ్. కాబట్టే మీకు కాల్ లెటర్స్ కూడా వచ్చాయి. మిమ్మల్ని 1:1 పద్ధతిలో ఇంటర్వ్యూకు పిల్చి కూడా అన్యాయం చేశారు. రెండు జీఓలు జారీ చేసి, ఇష్టానుసారం ఉద్యోగాలు ఇచ్చారు. స్పోర్ట్స్ కోటా అని చెప్పి, ఏ అర్హత లేకపోయినా, టెట్ క్వాలిఫై కాకపోయినా, ఉద్యోగాలు ఇచ్చారు. అలా వారు అనుకున్న వారికి ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత, మళ్లీ జీఓ ఇచ్చి, స్పోర్ట్స్ కోటాలో భర్తీకి కూడా అన్ని అర్హతల ఉండాలని, టెట్ క్వాలిఫై కావాలంటూ మరో జీఓ జారీ చేశారు. అండగా నిలుస్తాం. పార్టీ నుంచి లీగల్ ప్యానెల్: మావైపు నుంచి మీకు పూర్తి అండగా ఉంటాం. మాకు ఇద్దరు టీచర్ ఎమ్మెల్సీలు ఉన్నారు. విద్యార్థి విభాగం ఉంది. లీగల్ టీమ్ ఉంది. వారితో ఒక ప్యానెల్ ఏర్పాటు చేసి, మీ తరపున కోర్టులో వేసి పోరాడతాం. మూడేళ్ల తర్వాత మన ప్రభుత్వం రాగానే ఒక కమిషన్ వేసి, పూర్తి విచారణ జరిపించి, మీకు న్యాయం జరిగేలా చూస్తాం. అప్పటి వరకు ఈ మూడేళ్లు న్యాయపోరాటం కూడా మీ తరపున కొనసాగిస్తాం. చివరగా అందరికీ ఇదే నా హామీ: మీ అందరికీ ఒకటే హామీ. పోరాడితేనే నిలబడగలుగుతాం. దేవుడి దయ వల్ల మూడేళ్ల తర్వాత మనం అధికారంలోకి వస్తాం. మనం అధికారంలోకి రాగానే, కమిషన్ ఏర్పాటు చేసి, మీ కేసులన్నీ విచారించి, న్యాయం చేస్తాం. ఆ దిశలో అవసరం అయితే అదనపు పోస్టులు కూడా క్రియేట్ చేస్తాం. 1998 డీఎస్సీలో అన్యాయం అయిపోయిన వారికే న్యాయం చేశామని, కాబట్టి డీఎస్సీ–2025లో అన్యాయానికి గురైన అభ్యర్థులకు కూడా న్యాయం చేస్తామని శ్రీ వైయస్ జగన్ వివరించారు.