అలిపిరి–జూపార్క్ రోడ్ వీధి వ్యాపారులకు భూమన అభినయ్ రెడ్డి సంఘీభావం 

 తోపుడు బండ్ల తొలగింపుపై ఆగ్రహం.. వైయ‌స్ఆర్‌సీపీ నేతల పర్యటనకు పోలీసుల అడ్డంకులు 

 తిరుపతి: అలిపిరి–జూపార్క్ రోడ్ ప్రాంతంలో వీధి వ్యాపారులను బలవంతంగా తొలగిస్తున్నారని ఆరోపిస్తూ వారికి మద్దతుగా వైయ‌స్ఆర్‌సీపీ నాయకుడు భూమన అభినయ్ రెడ్డి సంఘీభావం తెలిపారు. కూటమి నేతల సూచనల మేరకే స్ట్రీట్ వెండర్ల తోపుడు బండ్లను తొలగిస్తున్నారని ఆయన విమర్శించారు. వీధి వ్యాపారుల సమస్యలను తెలుసుకునేందుకు భూమన అభినయ్ రెడ్డి నేతృత్వంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు అలిపిరి–జూపార్క్ రోడ్ ప్రాంతంలో క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా వ్యాపారులతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు.

అయితే ఈ పర్యటనను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు ఆరోపించారు. పోలీసు చట్టంలోని 30 యాక్ట్ పేరుతో నోటీసులు జారీ చేసి కార్యక్రమాన్ని నిలువరించే కుట్ర చేశారని విమర్శించారు.
ఈ నేపథ్యంలో వైయ‌స్ఆర్‌సీపీ తిరుపతి టౌన్ అధ్యక్షుడు మల్లం రవిచంద్రకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు పార్టీ నాయకులు తెలిపారు. ప్రజల జీవనోపాధికి భంగం కలిగించే చర్యలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని, వీధి వ్యాపారులకు న్యాయం చేయాలని భూమన అభినయ్ రెడ్డి డిమాండ్ చేశారు. వీధి వ్యాపారుల హక్కులను కాపాడేందుకు వైయ‌స్ఆర్‌సీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
 

Back to Top