జీవోల ప్రకారమే ఉద్యోగులకు జీతాలు

ఉద్యోగ సంఘాలతో చర్చలకు సిద్ధంగా ఉన్నాం

మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

తాడేపల్లి: ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసమే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కమిటీ వేశారని, చర్చల కోసం కమిటీ మూడు రోజులు వేచి చూసినా ఉద్యోగ సంఘాలు రాలేదని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఉద్యోగులు ప్రభుత్వంలో అంతర్భాగమేనని పదే పదే చెబుతున్నామన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలోని మీడియా పాయింట్‌ వద్ద మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. ఒకటో తేదీన జీతాలు ఇవ్వాలంటూనే అడ్డంకులు సృష్టిస్తున్నారని, ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోల ప్రకారమే ఉద్యోగులకు జీతాలు అందుతాయని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉద్యోగులు అర్థం చేసుకోవాలని కోరారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందని,  ఉద్యోగ సంఘాలతో చర్చలకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రభుత్వం ఏమీ డెడ్‌లైన్‌ పెట్టలేదని చెప్పారు. ఉద్యోగులంతా ఆనందంగా ఉండాలనే సీఎం వైయస్‌ జగన్‌ కోరుకుంటున్నారన్నారు. సహకరించని వారిపై ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతుందన్నారు.  
 

Back to Top