రాష్ట్ర సమస్యలపై రాజీ పడకుండా మన గళం వినిపించాలి 

ఎంపీలకు వైయ‌స్ జ‌గ‌న్‌ దిశానిర్దేశం

ఏపీ భవన్‌లో సభ్యులతో భేటీ 

న్యూఢిల్లీ:  రాష్ట్ర సమస్యలపై పార్లమెంటులో సామరస్య పూర్వక ధోరణిలో మన వాణి వినిపించాలని ఏపీ ముఖ్యమంత్రి వైయ‌స్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌ ఈరోజు ఏపీ భవన్‌లో పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంటు ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రాష్ట్ర సమస్యలపై రాజీ పడకుండా మన గళం వినిపించాలని, అవసరమైన హక్కులను సాధించేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలు, ప్రస్తుత పరిస్థితులపై ఎంపీలతో సీఎం వైయస్‌ జగన్‌ సుదీర్ఘంగా చర్చించారు. ప్రత్యేక హోదా, విభజన హామీలతో పాటు తాగునీటి సమస్యపై చర్చించారు. పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన విధానంపై ఎంపీలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా సాధన కోసం చేయాల్సిన ప్రయత్నాలను ఎంపీలకు వివరించారు. సమావేశంలో వైయస్‌ఆర్‌ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్‌సభ పక్షనేత పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, పార్టీ ఎంపీలు పాల్గొన్నారు. మధ్యాహ్నం ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్‌ సమావేశానికి సీఎం వైయస్‌ జగన్‌ పాల్గొని ప్రసంగించనున్నారు.

Back to Top