పులివెందులలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు 

 ప్రజల శ్రేయస్సు కోసం ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి 

వైయ‌స్ఆర్ జిల్లా : శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పులివెందుల పట్టణంలో భక్తిశ్రద్ధలతో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ వైయ‌స్ అవినాష్ రెడ్డి పట్టణంలోని భాకరాపురం, నగరిగుట్ట, అలాగే వేల్పుల గ్రామంలోని రామాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాలకు విచ్చేసిన ఎంపీకి ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించిన ఆయనకు అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొని భక్తులతో కలిసి భక్తి పరవశంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా ఆలయాల వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. పానకం, వడపప్పు వంటి ప్రసాదాలను భక్తులతో పంచుకున్నారు.

తరువాత మీడియాతో మాట్లాడిన ఎంపీ వైయ‌స్ అవినాష్ రెడ్డి, శ్రీరాముని కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, రైతులు అభివృద్ధి చెందాలని కోరుకున్నారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొని ప్రజలందరూ ఆనందంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ వేడుకల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
 

Back to Top