విశాఖపట్నం : విశాఖలో భూకబ్జాలకి పాల్పడే వారు ఎంతటి వారైనా చర్యలు తప్పవని వైయస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి హెచ్చరించారు. సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సైతం భూ అక్రమాల ఆరోపణలపై చాలా సీరియస్‌గా ఉన్నారన్నారు. భూ అక్రమాలకు పాల్పడే వారు ఎంతటి పెద్ద వారైనా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారని, సొంత పార్టీ నేతలే కాదు.. ఏ పార్టీ నేతలు ఉన్నా.. ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎవరైనా వదిలేది లేదు విశాఖలో తన పేరు చెప్పి భూ సెటిల్‌మెంట్ చేసే వారు ఎవరైనా వదిలేది లేదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. భూ ఆక్రమణల విషయంలో చాలా కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు. తన పేరు ఉపయోగించి మోసాలు చేసే వారిపై కేసులు పెట్టి అరెస్టు చేస్తామన్నారు. ప్రభుత్వ, దేవాదాయ, ఏ ఇతర భూముల జోలికి వచ్చినా వదిలేది లేదన్నారు. ప్రశాంత విశాఖ నగరం తమ లక్ష్యమని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.