విశాఖ: యువత వాహనాల్లో అతివేగాన్ని నియంత్రించుకోవాలని, నిదానమే ప్రదానమని వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి సూచించారు. హర్షా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం విశాఖ ఆర్కే బీచ్‌లో తలపెట్టిన బైక్ ర్యాలీని ఎంపీ విజయసాయిరెడ్డి ప్రారంభించారు. ర్యాలీలో మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సినీ నటులు అలీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ..ఓ తల్లి హర్షా అనే తన కుమారుడిని రోడ్డు ప్రమాదంలో కోల్పొయి తీవ్ర వేదనతో ఉందని, తన బిడ్డలా మరొకరు కాకూడదనే ఉద్దేశంతో హర్షా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ, అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందన్నారు. ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులు ఉంటారని, బిడ్డలు బయటకు వెళ్లి క్షేమంగా తిరిగి రావాలని వారు ఎదురు చూస్తుంటారన్నారు. తల్లిదండ్రుల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. యూ టీజింగ్‌కు కూడా దూరంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం రోడ్డు ప్రమాదాల నివారణ, యూ టీజింగ్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుందన్నారు. అనంతరం ఎంపీలు, ఎమ్మెల్యేల చేతుల మీదుగా యువతకు హెల్మెంట్లు ప్రదానం చేశారు.