రాష్ట్రానికి ప్రయోజనం కలిగే విధంగా చర్చలు

త్వ‌ర‌లోనే మంచి స‌మాచారం వ‌స్తుంది

కేంద్ర కార్య‌ద‌ర్శుల బృందంతో భేటీ అనంత‌రం ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

న్యూఢిల్లీ: కేంద్ర కార్యదర్శుల బృందంతో స‌మావేశం ఆద్యంతం సానుకూలంగా జ‌రిగింద‌ని, త్వ‌ర‌లోనే మంచి స‌మాచారం వ‌స్తుంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత విజ‌య‌సాయిరెడ్డి అన్నారు. కేంద్ర ప్ర‌భుత్వ కమిటీతో ఏపీ ప్రతినిధుల బృందం భేటీ ముగిసిన అనంత‌రం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డితో క‌లిసి ఎంపీ విజ‌యసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రికి ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ ఇచ్చిన వినతిపత్రంలోని అన్ని అంశాలను ఈ సమావేశంలో చర్చించామన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి 20 మంది ఉన్నతాధికారులు, ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు సమావేశంలో పాల్గొన్నారని, దీనికి కొనసాగింపుగా సంబంధిత అధికారులు నిరంతరం సంప్రదింపులు చేసి, ఈ అంశాలన్నింటినీ ముందు తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. పోలవరం సవరించిన  అంచనాలను యధావిధిగా ఆమోదించేందుకు ఒక అవగాహనకు వచ్చినట్లు తెలిపారు. పునరావాసం సహా అన్ని అంశాలపై రాష్ట్రానికి ప్రయోజనం కలిగే విధంగా చర్చలు జరిగాయని అన్నారు. ప్ర‌తి స‌మ‌స్య‌కు సామ‌ర‌స్య ప‌రిష్కారం ల‌భించింద‌న్నారు. ముఖ్యమంత్రికి, రాష్ట్రానికి ప్రధాని మోదీ ఇస్తున్న ప్రాధాన్యతకు ఈ సమావేశం నిదర్శనమన్నారు.  

Back to Top