వైయస్‌ఆర్‌ సీపీపై విశ్వాసంతో వలసలు

ఎంపీ విజయసాయిరెడ్డి
 

తాడేపల్లి: ఆంధ్రరాష్ట్రంలో ఒక్క వైయస్‌ఆర్‌ సీపీని తప్ప ఏ ఇతర రాజకీయ పార్టీలను ప్రజలు నమ్మడం లేదని, అందుకే మిగతా పార్టీల నుంచి వలసలు వస్తున్నాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. మిగతా పార్టీలు ప్రజల విశ్వాసం కోల్పోయాయని చెప్పారు. సన్యాసిపాత్రుడు చేరిక అనంతరం ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నవరత్నాలతో రాష్ట్రాన్ని, ప్రజలను సీఎం వైయస్‌ జగన్‌ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని చెప్పారు.

అమెరికా వెళ్లి ట్రంపుతో మాట్లాడినా పవన్‌ను ప్రజలు నమ్మరు
చంద్రబాబు డైరెక్షన్‌లోనే పవన్‌ కల్యాణ్‌ పనిచేస్తున్నాడని, పవన్‌ చంద్రబాబు దత్తపుత్రుడని ఎంపీ విజయసాయిరెడ్డి ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. విశాఖలో పవన్‌ చేసింది లాంగ్‌మార్చ్‌ కాదు.. రాంగ్‌ మార్చ్‌ అన్నారు. మార్చ్‌ అంటే పవన్‌ నడుస్తాడనుకున్నాం కానీ ఒక్క అడుగు కూడా వేయకుండా కారు ఎక్కి సినిమా ఫక్కీలో చేయి ఊపుకుంటూ వెళ్లాడన్నారు. ఆయన పార్టీ, విధానాలు కూడా అలాగే ఉన్నాయని చెప్పారు. గతంలో ప్రజారాజ్యం పార్టీకి 18 సీట్లు వస్తే.. పవన్‌కు ఒక్క సీటు మాత్రమే వచ్చిందన్నారు. చంద్రబాబు డైరెక్షన్‌ పవన్‌ పనిచేస్తున్నాడనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. తన జీవితంలోని కాల్‌షీట్‌ను బాబుకు ఇచ్చేశాడని ఎద్దేవా చేశారు. ఢిల్లీకి వెళ్లి జాతీయ నాయకులను కలిసినా.. ఆమెరికా వెళ్లి అధ్యక్షుడు ట్రంపుతో మాట్లాడినా పవన్‌ కల్యాణ్‌ను ఆంధ్రరాష్ట్ర ప్రజలు నమ్మరన్నారు.

Read Also: వైయస్‌ఆర్‌సీపీలోకి రావడం సంతోషంగా ఉంది

Back to Top