వైయస్ఆర్ జిల్లా: తొలి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి దేశం కోసం చేసిన పోరాటం మరువలేమని వైయస్ఆర్‌సీపీ నేత, కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి కొనియాడారు. పులివెందుల పట్టణంలో తొలి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 219వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి, పులివెందుల మున్సిపల్ ఇంచార్జ్ దుష్యంత్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆయన త్యాగాలను స్మరించుకున్నారు. స్వాతంత్ర సమరంలో ఆయుధం ఎత్తి బ్రిటిష్ పాలనకు మొదటగా సవాల్ విసిరిన వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని పలువురు నేతలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. “దేశం కోసం పోరాడిన తొలి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. బ్రిటిష్ వారిపై ఆయన చేసిన పోరాట స్ఫూర్తితోనే ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు తరువాతి ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు. దేశం కోసం ఆయన చేసిన త్యాగం ఎప్పటికీ మరువలేము” అని అన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి దేశ చరిత్రలో నిలిచిపోయే మహనీయుడు అని ఆయన గుర్తు చేశారు.