ఉద్యోగ కల్పనపై ఎల్లో మీడియా విష ప్రచారం

వైయ‌స్ఆర్‌ సీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌

అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే సీఎం వైయ‌స్ జగన్‌ 1.34 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు 

ఇంటికో ఉద్యోగమన్న చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో ఇచ్చిన ఉద్యోగాలు 34 వేలే 

రూ.2 వేలు నిరుద్యోగ భృతి అని చెప్పి అదీ ఇవ్వలేదు: మాణిక్య వరప్రసాద్‌ ధ్వజం 

గుంటూరు: రాష్ట్రంలో ఉద్యోగ కల్పనపై ఎల్లో మీడియా విష ప్రచారం సాగిస్తోందని వైయ‌స్ఆర్‌ సీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ ధ్వజమెత్తారు. రోజూ పనిగట్టుకొని అసత్యాలను ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో సోమవారం డొక్కా మాణిక్యవరప్రసాద్‌ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబును ఏదో విధంగా నిలబెట్టేలా ఎల్లో మీడియా ప్రయత్నిస్తోందని విమర్శించారు. రాష్ట్ర విభజన నాటికి ఉమ్మడి రాష్ట్రంలో 2.57 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయన్నారు. ఇందులో తెలంగాణలో 1.07 లక్షలు, ఏపీలో 1.5 లక్షల ఖాళీలు ఉన్నాయని ఉద్యోగుల పంపకాలపై కేంద్రం నియమించిన కమలనాథన్‌ కమిటీ తేల్చిందని గుర్తు చేశారు.

చంద్రబాబు పాలనలో ఇంకో 50 వేల మందికి పైగా పదవీ విరమణ చేశారన్నారు. ఇలా రాష్ట్రంలో మొత్తం ఉద్యోగ ఖాళీలు 2 లక్షలకుపైగా ఉన్నాయన్నారు. కానీ ఇంటికో ఉద్యోగం అని చెప్పి అధికారంలోకి వచ్చిన బాబు ఐదేళ్లలో ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 34 వేలు మాత్రమేనని గుర్తు చేశారు. ఇందులో కూడా సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇచ్చినవే ఎక్కువన్నారు. అలాగే రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి అది కూడా బాబు ఇవ్వలేదని మండిపడ్డారు.  

వైయ‌స్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే 1.34 లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారని  గుర్తు చేశారు. మరో 51 వేల మందికిపైగా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశారన్నారు. అలాగే వైద్య శాఖలో 40 వేల ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టారని వివరించారు. ఇందులో 10 వేల మందిని ఇప్పటికే తీసుకున్నారన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు 20 లక్షల మంది నిరుద్యోగులు దరఖాస్తు చేశారని చెప్పారు. ఇంటికో ఉద్యోగమన్న చంద్రబాబు తన పాలనలో వీరందరికీ ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. జీతాలు, పింఛన్ల ఖర్చు 2018 –19లో రూ.52,513 కోట్లు ఉంటే 2020–21లో రూ.67,340 కోట్లుగా ఉందన్నారు.  

Back to Top