విశాఖపట్నం: బ్రెజిల్ నుంచి డ్రగ్స్ అంటూ నాడు హంగామా చేశారని శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యానారాయణ తప్పుపట్టారు. కంటైనర్లను సీజ్ చేసి, అరెస్టులు చేశారు. ఇప్పుడు దర్యాప్తులో డ్రగ్స్ లేవు అంటూ సిబిఐ నిర్ధారించిందని మండిపడ్డారు. విశాఖతీరానికి డ్రగ్స్ వచ్చాయంటూ తప్పుడు ఆరోపణలు చేసిన దర్యాప్తు సంస్థలపై చర్య తీసుకోవాలని కోరుతూ దేశ ప్రధాని, హోమంత్రిని కలుస్తున్నట్లు బొత్స సత్యనారాయణ ప్రకటించారు. విశాఖపట్నంలోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా డ్రగ్స్ పేరుతో చేసిన హైడ్రామా వెనుక ఉన్న వ్యక్తులు ఎవరో బయటకు రావాలని అన్నారు. రాజకీయ కక్షసాధింపుకు దర్యాప్తు సంస్థలను పావులుగా వాడుకున్నారని, ఆయా సంస్థలపైన విచారణ జరిగితేనే ఈ మొత్తం వ్యవహారంలో వాస్తవాలు వెలుగుచూస్తాయని అన్నారు. ప్రధాని, హోంమంత్రులు సమయం ఇవ్వకపోతే వారి కార్యాలయాలకు లేఖలు రాస్తానని ఆయన స్పష్టం చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... ఆనాడు వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంపై బురదచల్లారు బ్రెజిల్ నుంచి విశాఖకు డ్రగ్స్ తో కూడిన కంటైనర్లు వచ్చాయని మా ప్రభుత్వంపై ఒక మచ్చ తీసుకువచ్చేలా ఆనాడు పలు ఆరోపణలు చేశారు. ఆపరేషన్ గరుడ, ఇంటర్ పోల్, సిబిఐలను రంగంలోకి దింపి దర్యాప్తు అంటూ హడావుడి చేశారు. విశాఖ తీరంలో కంటైనర్లను సీజ్ చేయడం, ఒకరిద్దరిని అరెస్ట్ కూడా చేశారు. తీరా ఇప్పుడు సిబిఐ దాదాపు ఎనిమిది నెలల తరువాత ఆ కంటైనర్లలో ఎటువంటి డ్రగ్స్ లేవు అంటూ క్లీన్ చీట్ ఇచ్చింది. వ్యవస్థలను మేనేజ్ చేసింది ఎవరో బయటకు రావాలి ఎన్నికలకు ముందు ఒక్కసారిగా డ్రగ్స్ అంటూ ఎవరు ఈ డ్రామాకు శ్రీకారం చుట్టారు. దర్యాప్తుసంస్థలను పావులుగా వాడుకుని మా ప్రభుత్వంపైన ఎలా బుదరచల్లారు, దర్యాప్తు సంస్థలను తప్పడు విధానంలో ఉపయోగించుకున్నారు, వ్యవస్థలను ఎవరు మేనేజ్ చేశారో బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఎన్నికల్లో వైయస్ఆర్సిపిని దెబ్బతీయాలనే కుట్రకోణం కూడా దీనిలో ఉందనే అనుమానాలు ఉన్నాయి. ఇది మా ప్రభుత్వంపైనే కాదు, దేశ ప్రతిష్టపైన కూడా మచ్చగా మిగిలిపోయే పరిస్థితి ఏ్పడింది. ఇలాంటి దారుణాలకు పాల్పడే వారిని వెలుగులోకి తీసుకురావాలని కేంద్రాన్ని కోరుతున్నాం. భూకుంబకోణాలపై సిట్ దర్యాప్తును బైట పెట్టాలి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కుంభకోణాలపై వేసిన సిట్ ను, తరువాత వైయస్ఆర్ సిపి ప్రభుత్వం కొనసాగించింది. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మా హయాంలో భూకుంబకోణాలు జరిగాయని కూటమి పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. మీకు ధైర్యం ఉంటే సిట్ దర్యాప్లును బైట పెట్టాలని డిమాండ్ చేస్తున్నాము. దీనిలో ఎవరు తప్పు చేస్తే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే రెవెన్యూ సదస్సులకు ముందే సిట్ దర్యాప్తు నివేదికను ఎందుకు బయట పెట్టలేదు? వ్యవస్థలను మేనేజ్ చేయడం సీఎం చంద్రబాబుకు అలవాటుగా మారింది. విశాఖ డెయిరీపై సభాసంఘంలో ఎమ్మెల్సీలకు చోటు కల్పించాలి విశాఖ డెయిరీపై విచారణకు సభాసంఘాన్ని నియమిస్తామని ప్రభుత్వం చెప్పిన సందర్భంలో ఉభయ సభలకు సంబంధించిన సభ్యులను భాగస్వాములను చేయాలని వైయస్ఆర్ సిపి కోరింది. దీనిపై శాసనసభ స్పీకర్, చైర్మన్ లతో కూడా శానసమండలి ప్రతిపక్షనేతగా నేను స్వయంగా మాట్లాడాను. తీరా సభాసంఘంను నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వుల్లో ఎమ్మెల్సీలకు చోటు లేకపోవడం బాధాకరం. ఇది సభా సంప్రదాయం కాదు. దీని వెనుక ఎవరి వత్తిడి ఉందో అర్థం కావడం లేదు. రాజకీయ కారణాలతోనే ఎమ్మెల్సీలకు చోటు కల్పించలేదని భావిస్తున్నాం. నాడునేడు పనులను పూర్తి చేయాలి వైయస్ఆర్ సిపి ప్రభుత్వం మనబడి నాడు-నేడు పేరుతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల రూపరేఖలను మార్చేందుకు చేసిన పనుల్లో కొన్ని అసంపూర్తిగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే వాటిని పూర్తి చేయాలని కోరుతున్నాం. వైయస్ జగన్ అమలు చేసిన ఈ పథకంలో ఆధునీక రూపుదాల్చిన పాఠశాలల్లో కూర్చుని సీఎం చంద్రబాబు మేగా పేరెంట్స్, టీచర్స్ మీట్ ను ఏర్పాటు చేయడం ద్వారా ఆనాడు మా ప్రభుత్వం పాఠశాలలను ఎంత గొప్పగా తీర్చిదిద్దిందో రాష్ట్ర ప్రజలకు మరోసారి గుర్తు చేశారు. ఇందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. వైయస్ జగన్ గారిపై కోపంతో నాడునేడు పెండింగ్ పనులను నిలిపివేయ కూడదని, ఈ రాష్ట్రంలోని విద్యార్ధుల భవిష్యత్తును రాజకీయాలతో ముడిపెడ్డకూడదని కోరుతున్నాం. ఈ ఏడాది తల్లికి వందనంకు మంగళం ఎన్నికలకు ముందు నీకు పదిహేను వేలు... నీకు పదిహేను వేలు అంటూ హామీలు గుప్పించి మరీ ప్రకటించిన తల్లికి వందనం పథకంకు ఈ ఏడాది చంద్రబాబు ప్రభుత్వం మంగళం పాడినట్లే భావిస్తున్నాం. కనీసం మెగామీట్ లో దానిపై సీఎం చంద్రబాబు స్పందించకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఈ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఇ విధానం, టోఫెల్ శిక్షణ, సబ్జెట్ టీచర్లు, బైజూస్ ట్యాబ్ లు ఇచ్చాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత క్రమంగా వాటన్నింటినీ కనుమరుగు చేస్తున్నారు. వైయస్ఆర్ సిపి పై కోపంతో విద్యార్ధులకు ఉపయోగపడే అన్నింటినీ తొలగించడం మంచిది కాదు. దీనిపై మెగా మీట్ లో పలుచోట్ల విద్యార్ధుల తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రశ్నించారు. ఇకనైనా వాటిపై కూటమి ప్రభుత్వం పునరాలోచన చేయాలి. మా హయాంలో ఒక్క ప్రభుత్వ పాఠశాల కూడా మూతపడలేదు ఈ రాష్ట్రంలో విద్యార్ధులు, ఉపాధ్యాయుల నిష్పత్తి ఒక హేతుబద్ద విధానంలో ఉండాలని ఆనాడు మా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందుకు అనుగుణంగా పాఠశాలలను విలీనం చేశామే తప్ప, ఒక్క పాఠశాలను కూడా మూసేయలేదు. 117 జీఓ ప్రకారం కనీసం 19 మంది విద్యార్దులు ఉన్న చోట ఒక టీచర్ ను, అంతకు మించి ఉన్న చోట్ల ఇద్దరు టీచర్లను నియమించాం. శాస్త్రీయంగా విద్యార్ధులు, ఉపాధ్యాయులు ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. ధాన్యం సేకరణలో ప్రభుత్వం విఫలం రాష్ట్రంలో ధాన్యం సేకరణలో ప్రభుత్వం విఫలమైంది. రైతులకు మేలు చేసేలా అధికార యంత్రాంగాన్ని సన్నదం చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తెలుగుదేశంకు అనుకూలమైన ప్రతిక ఈనాడులోనే ఈ విషయాన్ని చాలా స్పష్టంగా రాశారు. అధికారులు సక్రమంగా పనిచేస్తున్నారా లేదా అనే విషయాన్ని పర్యవేక్షించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి లేదా? ప్రభుత్వ వైఫల్యాలపై వైయస్ఆర్ సిపి ఆందోళనలు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు అయ్యింది, కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, వైఫల్యాలు, ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ప్రభుత్వంపై వత్తిడి తీసుకురావాలని పార్టీ ఒక కార్యాచరణను ప్రకటించింది. ఈ నెల 13న ధాన్యం సేకరణపై, 27వ తేదీన పెంచిన విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా, జనవరి 3వ తేదీన ఫీజురియాంబర్స్ మెంట్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టబోతున్నాం. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై వారిని నిలదీయడం, ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి ప్రజలకు న్యాయం చేసే వారు మా పోరాటం కొనసాగుతుంది. ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ఈ రోజు మూడు జిల్లాల అధ్యక్షులు, పార్టీ ముఖ్యనేతలతో కలిసి సమావేశం నిర్వహించుకున్నామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు..