రెండేళ్లలోనే అన్ని రంగాల్లో కూటమి ప్రభుత్వం ఫెయిల్

శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ

 విశాఖపట్నం :  వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరచూ విమర్శలు చేయడం ఆయనలో ఉన్న భయానికి నిదర్శనమని శాసనమండలి విపక్ష నేత  బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. మంగళవారం విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కూటమి ప్రభుత్వ పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క వర్గానికీ మేలు జరగలేదని బొత్స ఆరోపించారు. ప్రభుత్వం ఎంత త్వరగా అధికారాన్ని కోల్పోతే రాష్ట్రానికి అంత మేలు జరుగుతుందని అన్నారు. కేవలం రెండేళ్ల పాలనలోనే అన్ని రంగాల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు.

డీఎస్సీ నియామకాల్లో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపించిన ఆయన, ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. స్పోర్ట్స్ కోటాను ఒక శాతానికి పెంచడం ద్వారా ఎవరి కోటాను తగ్గించారో ప్రభుత్వం ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ అక్రమాలపై త్వరలోనే గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. మత్స్యకార భరోసా పథకంలో 2,400 మంది అర్హులకు అన్యాయం జరిగిందని, అర్హుల జాబితాలో పేర్లు ఉన్నప్పటికీ వారికి ఆర్థిక సాయం అందలేదని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ సకాలంలో చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

విశాఖ ఎంపీ భరత్‌పై కూడా విమర్శలు చేసిన బొత్స, ఆయన విధానం దోపిడీ ధోరణిలో సాగుతోందని అన్నారు. గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్ట్ వల్ల కలిగే ప్రభావాలపై ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. 
భోగాపురం విమానాశ్రయానికి రహదారి, నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాల కోసం వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే సమగ్ర ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు. ప్రస్తుతం పరిశ్రమలకు రూ.99 పైసలకే భూములు కేటాయిస్తున్న ప్రభుత్వం, స్థానిక యువతకు ఎన్ని ఉద్యోగాలు కల్పించిందో లెక్కలు చెప్పాలని ప్రశ్నించారు. 
ప్రజలకు ఇచ్చిన హామీల అమలులోనూ, సంక్షేమం, విద్య, ఉపాధి, నియామకాలు వంటి అన్ని రంగాల్లోనూ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బొత్స సత్యనారాయణ విమర్శించారు.
 

Back to Top