రక్తం పారించే చరిత్ర టీడీపీది..నీరు పారించిన చరిత్ర మాది

రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి

ఎలిమినేట్ చేస్తానన్న బాబు రక్త చరిత్ర ఏమిటో ప్రజలకు అర్థమైంది

 సీమలో ఫ్యాక్షన్ లేకపోతే రాజకీయ భవిష్యత్తు ఉండదని బాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు

జగన్ గారి పరిపాలనలో సీమ ఊపిరి పీల్చుకుంది

 చంద్రబాబు సామాజిక, ఆర్థిక ఉన్మాది

 అధికారం కోసం ఇంతగా దిగజారాలా పవన్ కల్యాణ్..!

 మీరంతా కట్టకట్టుకుని వస్తామంటున్నారంటేనే.. జగన్ గారు అద్భుతమైన పరిపాలన చేస్తున్నారనే కదా..!

 సీఎం విమాన ప్రయాణంపైనా అవాకులు, చెవాకులా..!

 ఆంధ్రజ్యోతి వాగుడు.. యనమల మోగుడు

 రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించింది చంద్రబాబే

 చంద్రబాబుది "వాగుడే.. వాగుడు" కార్యక్రమం
 

తాడేపల్లి: దశాబ్ధాల పాటు రక్తం పారిన ప్రాంతంలో నీరు పారించామని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో మూడు రిజర్వాయర్లకు శంకుస్థాపన చేశామన్నారు. జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు రాప్తాడులో ఎలాగైనా గెలవాలని పౌరుషంగా పోరాడండని ప్రజలను రెచ్చగొట్టారని తప్పుపట్టారు. ప్రకాశ్‌రెడ్డిని అంతమొందించాలని మెసేజ్‌ ఇచ్చేలా చంద్రబాబు మాట్లాడుతున్నారని మండిపడ్డారు, రక్తపాతం పారించే చరిత్ర టీడీపీది అయితే..నీరు పారించిన చరిత్ర వైయస్‌ఆర్‌సీపీదని వివరించారు. శనివారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. 

సీమలో ఫ్యాక్షన్ ను బతికించకపోతే తనకు బతుకు లేదన్నట్టుగా బాబు ప్రవర్తన
    చంద్రబాబు నాయుడు "వాగుడే.. వాగుడు" కార్యక్రమానికి రాయలసీమకు వచ్చి.. గతంలో మూడు దఫాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసినా, అనంతపురం జిల్లాకు ఆయన చేయలేకపోయినవి, విఫలమైనవి కనీసం ప్రస్తావించకుండా, సీమ ప్రజలను రెచ్చగొట్టే విధంగా నాలుగు డైలాగులు చెప్పి ప్రశాంతంగా ఉన్న సీమలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఫ్యాక్షనిస్టులా, ఉన్మాదిలా ప్రవర్తించాడు. 
- మరోవైపు  గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం ద్వారా.. గత మూడేళ్ళలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ గారు చేసిన మంచిని ప్రజల్లోకి మేం తీసుకువెళుతుంటే.. దాన్ని కౌంటర్ చేయలేక, రాయలసీమ జిల్లాలో రక్తపాతం పారించకపోతే, ఫ్యాక్షన్ ను బతికించకపోతే నాలుగు సీట్లు కూడా రావు అన్నట్టుగా.. ఒక సామాజిక ఉన్మాదిగా, ఆర్థిక ఉన్మాదిగా ప్రవర్తిస్తూ చంద్రబాబు ప్రజలను రెచ్చగొట్టి వెళ్ళాడు. రాయలసీమ ప్రాంతంలో  ప్రజలు చంద్రబాబు మాటలు విని రెచ్చిపోవాలి, ప్రజలను రెండు వర్గాలుగా విభజిస్తే.. ఆ విధంగానైనా నాలుగు ఓట్లు సంపాదించవచ్చు..  అన్న దుర్బుద్ధితో శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా చంద్రబాబు మాట్లాడటం దిగజారుడు రాజకీయం కాక మరేమిటి.?

- చంద్రబాబు రాప్తాడులో పెట్టిన మీటింగ్ మా మండల స్థాయి మీటింగ్ అంత స్థాయి లేదు. టీడీపీ వెంట జనం ఎవరూ లేరు.  జన్మభూమి కమిటీల పేరుతో అవినీతి చేసినవారు, నీరు-చెట్టు పేరుతో డబ్బులు తిన్నవాళ్ళే మీతో మిగిలారు. రోడ్ షోలు అంటూ చంద్రబాబు పిచ్చివాగుడు వాగుతున్నాడు. చేతనైతే మీరు కూడా 2014-19 మధ్య  ప్రజలకు మీరు ఏం చేశారో... గడప గడపకు వెళ్ళి చెప్పండి. డీబీటీ ద్వారా ప్రజలకు ఏం ఇచ్చారో, సామాజిక న్యాయం ఏం చేశారో చెప్పండి. 

- చేప పిల్ల నీళ్ళల్లో ఉంటేనే బతుకుంది అన్నట్టు.. అధికారంలో లేకపోతే బతకలేం అన్నట్టుగా  చంద్రబాబు అండ్ కో తయారయ్యారు.

ఎవరి హయాంలో ఎన్ని కేసులో విచారణ జరిపించుకోండి
    నేనేదో టీడీపీ నేతలపై కేసులు పెట్టిస్తున్నానని చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేశాడు.  2014-19 మధ్య రాప్తాడు నియోజకవర్గంలో ఎన్ని ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదయ్యాయి,  మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్ని కేసులు నమోదు అయ్యాయో.. పూర్తి వివరాలు మీడియాకు ఇస్తున్నాం. మీరు ఏబీ వెంకటేశ్వరరావు ద్వారా విచారణ జరిపిస్తారో.. లేక రాష్ట్ర డీజీపీ గారితో విచారణ జరిపించుకుంటారో మీ ఇష్టం.. 

- మీ ప్రభుత్వ హయాంలో దాడులకు గురై ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న మా పార్టీ కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు, నాపై దాడి చేసి, చంపాలని చూసినప్పుడు.. పైగా మీ ప్రభుత్వ ఒత్తిడి వల్ల,  పోలీసులు నా మీద ఎస్సీఎస్టీ కేసు పెట్టింది వాస్తవం కాదా...?

- 2019 ఎన్నికలకు ముందు, రాప్తాడులో గెలవడం కష్టమని, మా కుటుంబ సభ్యుల్లో ఒకరిని ఎలిమినేట్ చేయాలని, అంతమొందించాలని పరిటాల సునీతతో కుట్ర చేసింది నిజం కాదా..?

బాబు ఫ్యాక్షన్ మనస్తత్వం అర్థమైంది
    మీ హయాంలో వందలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హత్యలకు గురైతే.. స్థానికంగా ఉన్న ఫ్యాక్షన్ వల్లే అవన్నీ జరిగాయని మీరు, మీ ఎల్లో మీడియా వండి వారిస్తే.. ఈరోజు వాటి వెనుక మీ హస్తం ఉందని, నిన్న అనంతపురంలో చంద్రబాబు మాట్లాడిన మాటల ద్వారానే ప్రజలకు ఇప్పుడు అర్థమౌతోంది.

- రాప్తాడు నియోజకవర్గం వెళ్ళి, మీ ఎమ్మెల్యేకు కూడా ఎక్స్ పైరీ డేట్ ఉంటుందని చంద్రబాబు నిన్న మాట్లాడాడంటే.. నిరాశ,నిస్పృహులతో మాట్లాడావా.. లేక.. నీ చుట్టూ ఉన్న వారు తప్పుడు సమాచారం ఇస్తే ఫ్యాక్షన్ ఉన్మాదిగా మాట్లాడావా..? తన సొంత తమ్ముడ్నే ఉన్మాదిగా చిత్రీకరించిన వ్యక్తి చంద్రబాబు. 

- రాప్తాడులో ఎలాగైనా గెలవాలి.. ముందు ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డిని అంతమొందించాలని, 40 ఏళ్ళ రాజకీయ అనుభవం, 72 ఏళ్ళ వయసులో, ఒక మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు మాట్లాడిన మాటలు, ఆయన రక్త చరిత్రను చెప్పకనే చెబుతున్నాయి. 

మీరు రక్తం పారిస్తే.. మేం నీళ్ళు పారించాం
    టీడీపీ 30 ఏళ్ళలో చేయలేని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను జగన్ గారు చేస్తున్నారు. పేరూరు డ్యాంకు నీళ్ళు ఇవ్వడానికి రూ. 800 కోట్లతో మీరు నిధులు పారించాలని చూస్తే.. ఒక్క జీవోతో, ఒక్క రూపాయి ఖర్చు లేకుండా, గత మూడేళ్ళపాటు పేరూరులో నీళ్ళు పారించిన చరిత్ర మాది. ప్రతి ఒక్క చెరువుకు నీరు ఇచ్చాం.  భూగర్భజలాలు పెరిగాయి. వేల బోర్లలో నీళ్ళు వస్తున్నాయి. 

- టీడీపీకి ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఇంత నిష్పక్షపాత ప్రభుత్వాన్ని, సీమలో ఇంతగా శాంతిభద్రతలు కాపాడే ప్రభుత్వాన్ని ఇంతవరకూ చూడలేదని మాట్లాడుతున్నారు. రాప్తాడులో  ప్రకాశ్ రెడ్డి గెలిస్తే.. ఊళ్ళల్లో ఉండలేరని మీరు 2019 ఎన్నికల ముందు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎంతగా దుష్ప్రచారం చేసినా.. 26 వేల ఓట్లతో మీ పార్టీ అక్కడ ఓటమి చెందింది. 

- ఈరోజు ఎవరైనా, ఎక్కడికైనా స్వేచ్ఛగా తిరగగలితే వాతావరణం కల్పించాం, తల్లీకొడుకులు ఇద్దరికీ గన్ మెన్ లు ఏర్పాటు చేశాం. 

- రాప్తాడులో మేం గెలిచిన వారానికే పార్టీ తరఫున ప్రజలందరికీ ఒక మెసేజ్ పంపించాం.. "ఎన్నికల ముందే పార్టీలు.. ఎన్నికలు అయ్యాక మనమంతా ఒక కుటుంబం, పార్టీలు వేరైనా అందరూ ఒక్కటే, వీలైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళను కూడా కలుపుకుని వెళ్ళండి, అభివృద్ధి-సంక్షేమమే మన ఎజెండా, తప్పు ఎవరు చేసినా, చట్టం తన పని తాను చేసుకుపోతుంది" అని చెప్పాం. 

- తెలుగుదేశం హయాంలో 30 ఏళ్ళ పాటు రక్తంతో తడిచిన ఈ ప్రాంతంలో మేం నీళ్ళు పారించాం. జగన్ గారి  పాలనలో సీమ ఊపిరి పీల్చుకుంది. రాయలసీమ ప్రాంతాన్ని నీళ్ళతో తడిపే నాయకుడు వచ్చాడు అని. ముఖ్యమంత్రి జగన్ గారి ఆశీస్సులతో పేరూరు డ్యాం కు నీళ్ళు తెచ్చాం. దానికి అడ్డంకి ఎవరూ రాకూడదని, కర్ణాటక ముఖ్యమంత్రిని కలిసి ఆయన సహాయాన్ని కూడా కోరాం. మీరు అవినీతి చేయబోయిన ప్రాజెక్టుల్లో 300 కోట్ల సొమ్మును రికవరీ చేస్తూ.. మూడు రిజర్వాయర్లు తెచ్చాం. వాటికి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శంఖుస్థాపనలు చేశాం.

- పరిటాల సిద్ధార్థ అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నాడని, శంషాబాద్ ఎయిర్ పోర్టులో తనిఖీలు చేస్తే..  సైనికులు వద్ద ఉండాల్సిన ఆయుధాలు అతని దగ్గర ఉన్నాయని పట్టబడింది వాస్తవం కాదా..?. చంద్రబాబు ఎప్పుడూ.. బుల్లెట్ లా దూసుకువెళ్ళాలి తమ్ముళ్ళూ.. అంటుంటే, గన్ లు, బుల్లెట్ లు కొనమని మీరే ప్రోత్సహిస్తున్నారని అర్థమైంది.

ఖబడ్దార్ చంద్రబాబూ..
    రక్త చరిత్ర కలిగిన ఉన్మాదులను పక్కన పెట్టుకుని, ఫ్యాక్షన్ సినిమాల్లో చూపించినట్టు, ప్రైవేటు సైన్యాన్ని వందల మందిని పెట్టుకున్న వారిని పక్కన పెట్టుకుని చంద్రబాబు నాయుడు ప్రజలను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు.  అంటే చంద్రబాబే నేరుగా ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహిస్తున్నారని నమ్మాల్సి వస్తుంది.

- ప్రజలకు ఏనాడూ మంచి చేయలేని మీరు, ఓటమి భయంతో, అవసరమైతే నన్ను ఎలిమినేట్ చేయాలని,  మీ ఎమ్మెల్యే త్వరలో పోతాడని, నా నియోజకవర్గం వచ్చి  చంద్రబాబు బెదిరిస్తున్నాడా.. ?

- ఎమ్మెల్యేగా నేను ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడులో అర్థరాత్రి అయినా తిరిగగలుగుతాను. టీడీపీ హయాంలో వందల మందిని మీరు చంపినా.. ఎటువంటి ప్రతీకార దాడులు లేకుండా, మూడేళ్ళుగా నియోజకవర్గాన్ని కాపాడుతూ వచ్చాను. అందుకే ఈరోజు అక్కడ శాంతిభద్రతలు ఉన్నాయి. మరోవైపు అభివృద్ధిృ- సంక్షేమం జరుగుతుంది. ఎలిమినేషన్ ద్వారా రాప్తాడును నాశనం చేయాలని చూసే మీ కుట్ర బయటపడింది. ఖబడ్దార్ చంద్రబాబూ..  అని హెచ్చరించాల్సి వస్తుంది. 

- టీడీపీ అధికారంలో ఉన్నప్పుడూ, మేం అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరే అరాచకాలు, హత్యలు చేస్తున్నారు. గత మూడు నెలల్లో క్రైమ్ రేటు గమనిస్తే.. 302, 307 సెక్షన్ల కింద ఏడు కేసులు నమోదైతే.. ఆ నేరాలు చేసినవారంతా కూడా తెలుగుదేశం నేతలే.. వీటికి సంబంధించిన ఫోటోలు, సాక్ష్యాధారాలతో సహా ఎమ్మెల్యే మీడియా ముందు వివరించారు. దొంగతనాలు నుంచి దాడులు, హత్యల వరకూ మొత్తం తెలుగుదేశం వారే చేస్తున్నారు. ఆధిపత్యం కోసం హత్యలు, దోపిడీలు చేయడం తప్పు కాదు.. అన్నట్టుగా పరిటాల కుటుంబం ప్రజలను ట్యూన్ చేశారు. 

- ఎమ్మెల్యేను అయిన తనను చంపుతానని, ఎలిమినేట్ చేస్తానంటూ.. చంద్రబాబు మాట్లాడిన మాటలను ఎలా తీసుకోవాలో, నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజల విజ్ఞతకే వదిలేస్తున్నాను. 

రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయించింది మీరు కాదా..?
    ముఖ్యమంత్రిగా మీరు దిగిపోయిన తర్వాత.. మీ హయాంలో పనిచేసిన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. 2014-19 మధ్య కాలంలో తీసుకురావాల్సిన అప్పు అంతా తీసుకొచ్చాం, క్రెడిట్ లిమిట్ లేదు, మొత్తం ఖర్చు పెట్టేశాం, జగన్ గారు ముఖ్యమంత్రి అయినా చేయగలిగిందేమీ లేదు, కేవలం ఖజానాలో రూ. 100 కోట్లు మాత్రమే ఉందని చెప్పారు. రాష్ట్రాన్ని పూర్తిగా దివాళ తీయించి దిగిపోయారు.  మీ మిస్ మేనేజ్ మెంటు ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారన్న  విషయాన్ని కాగ్ కూడా నివేదిక ఇచ్చింది.  ఈ విషయాలన్నీ మీ గెజిట్ ఈనాడులోనే వచ్చాయి. ఇది చాలదా.. మీరు ఆర్థిక ఉన్మాది అని చెప్పటానికి.

- మీ హయాంలో అమరావతి ఒక్కటే ఉండాలని, మరే ప్రాంతం అభివృద్ధి చెందకూడదనేట్టుగా, 13 జిల్లాల అభివృద్ధిని ఫణంగా పెట్టి, ఇళ్ళ పట్టాలు ఇవ్వొద్దు, ఇళ్ళు అసలే కట్టవద్దు, అమరావతి లో పేదలకు ఇళ్ళ పట్టాలు ఇస్తే.. అక్కడ డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందని చెప్పింది మీరు కాదా.. ఇందుకు మిమ్మల్ని సామాజిక ఉన్మాది అనకుండా ఏమనాలి..?

- మీరు స్కాంలు చేయాలని భావించిన పేజ్ ఇండస్ట్రీస్ కు సంబంధించి, రూ. 150 కోట్ల విలువైన భూమిని రూ. 3 కోట్లకే 2016లో ఇస్తే.. 2019 వరకూ వాళ్ళు ముందుకు రాలేదు. ముఖ్యమంత్రిగా మీరు ఏం పీకారు చంద్రబాబు గారూ.. మీరు ముడుపులు అడిగారని ఆ ఫ్యాక్టరీలు రాలేదా.. లేక, షాపోజీ పల్లోంజి ఖాతాల్లో మీరు అక్రమంగా డబ్బులు వేయమన్నందుకు రాలేదా..? . పైగా మీ హయాంలో కాంపౌండ్ వాల్ కూడా కట్టని ఫ్యాక్టరీలను మేం చేయలేదని,  మాపై నిందలు వేస్తారా..? 

ఇంతగా దిగజారాలా పవన్ కల్యాణ్..!
    చంద్రబాబు దత్తపుత్రుడిని గత నెలలో రాయలసీమకు పంపించారు.. పరిహారం అందనివారిని, ఎక్కడైనా ఒక్క కౌలు రైతును అయినా చూపించాడా అంటే లేదు.  ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి ప్రభుత్వం రూ. 7 లక్షలు ఇచ్చింది.  

- జగన్ గారిపైన గెలవాలంటే, ఒంటరిగా పోటీ చేసే దమ్ములేదు అని పదే పదే పవన్ కల్యాణ్, చంద్రబాబు చెబుతున్నారు. వీళ్ళు గెలవాలంటే... 150 ఏళ్ళ చరిత్ర కలిగిన కాంగ్రెస్ ను కలుపుకోవాలి, వందల సంవత్సరాల చరిత్ర కలిగిన కమ్యూనిస్టులను కలుపుకోవాలి, 50 ఏళ్ళ కిందట స్థాపించిన బీజేపీని కలుపుకోవాలి, 44 ఏళ్ళ కింద పుట్టిన టీడీపీని కలుపుకోవాలి.. అని 15 ఏళ్ళుగా పోరాడుతానని చెబుతున్న పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నాడు. 

- బీజేపీతో సీపీఐ, సీపీఎం, తెలుగుదేశంతో కాంగ్రెస్, కమ్యూనిస్టులతో పవన్ కల్యాణ్.. ఇలా అందర్నీ కలిపి.. 10 ఏళ్ళ కింద ఆవిర్భవించిన జగన్ మోహన్ రెడ్డి గారి పార్టీతో పోరాడతాం అని చెబుతున్నారు,  అంటే జగన్ మోహన్ రెడ్డిగారు అద్భుతమైన పరిపాలన అందిస్తున్నారనే కదా..!, అటువంటి గొప్ప నాయకత్వం అందిస్తున్న జగన్ మోహన్ రెడ్డిగారిని ఒంటరిగా ఎదుర్కోలేమనే కదా..!,  వీళ్ళది అసలు  పోరాటమా.. లేక అధికారం కోసం ఆరాటమా..? అన్నది ప్రజలకు అర్థమవుతోంది. 

- "సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా బడుగు, బలహీన వర్గాలు, పేదల గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్న నాయకుడిని ఎదుర్కొనే దమ్మూ, ధైర్యం మాకు ఎవరికీ లేదు. మాకు ఒక జెండా అజెండాలు లేవు, సిద్ధాంతాలతో పనే లేదు. అధికారమే అజెండా..." అన్నట్టుగా రాజకీయాల్లో నైతిక విలువలను వీరంతా కలిసి ఎంతగా దిగజారుస్తున్నారో ప్రజలకు అర్థమవుతుంది. 

సీఎం విమాన ప్రయాణంపైనా అవాకులు, చెవాకులా..?
    ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారి దావోస్ పర్యటనపైనా ఎల్లో మీడియాలో అడ్డగోలుగా కథనాలు వండి వారుస్తున్నారు. జ్యూరిక్ లో రాత్రి పది గంటల తర్వాత విమానాలు ల్యాండ్ అయ్యే అవకాశాలు లేనందున, విపరీతమైన విమానాల రద్దీ నేపథ్యంలో విమానం లండన్ లో ల్యాండింగ్ అయ్యింది. జ్యూరిక్ లో ల్యాండింగ్ కోసం ఆఖరికి భారత ఎంబసీ ప్రయత్నించినా, ల్యాండింగ్ కు అనుమతి రానందువల్లే లండన్ లో ల్యాండింగ్ కావాల్సి వచ్చింది.
- నిజాలు తెలియకుండా "ఆంధ్రజ్యోతి వాగుడు.. యనమల మోగుడు"కు అర్థమేంటి..?

Back to Top