చంద్ర‌బాబు వ్యాఖ్యల వెనుక రహస్య ఎజెండా! 

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార ప్రతినిధి  గడికోట శ్రీకాంత్ రెడ్డి  

 వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలంటే చంద్రబాబుకు ఎందుకంత ద్వేషం? 
  
అమరావతి యాత్ర పేరుతో చంద్రబాబు ప్రాంతాల మధ్య విధ్వేషాలు రెచ్చగొడుతున్నాడు 

  రైతుల ముసుగులో గ్రీన్ కండువాలు ఎందుకు.. పచ్చ కండువాలతో యాత్ర చేయండి 

 5ఏళ్ళు అధికారంలో ఉండి అమరావతిలో ఒక్క హోటల్ కట్టావా బాబూ..? 

 బాబు కట్టిన అమరావతిలో టీ తాగాలన్నా, భోజనం చేయాలన్నా ఒక్క హోటల్ లేదు 

 రాష్ట్రంలో అశాంతి, అలజడులు సృష్టిద్దామనుకుంటే.. చూస్తూ ఊరుకోం 

 అన్ని విషయాలపై చర్చిద్దాం... దమ్ముంటే అసెంబ్లీకి రా బాబూ..! 

 తాడేప‌ల్లి: రాయలసీమకు చుక్క నీరు ఇవ్వం" అంటూ చేసిన వ్యాఖ్యల వెనుక చంద్ర‌బాబు రహస్య ఎజెండా! ఉంద‌ని  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార ప్రతినిధి  గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు.   ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్న చంద్రబాబు నాయుడు బండారం గురించి రాష్ట్ర ప్రజలకు వివరించాలనుకునే ప్రెస్ మీట్ పెట్టాను. అమరావతి రైతుల ముసుగులో చంద్రబాబు రహస్య ఎజెండాను పెట్టుకుని ప్రజలను రెచ్చగొడుతున్నాడు.  రాయలసీమ వాసిగా, ఆ ప్రాంత ప్రజా ప్రతినిధిగా, అమరావతి పాదయాత్రలో వారు మాట్లాడిన మాటలు నాకు చాలా బాధ కలిగించాయని అన్నారు. మంగ‌ళ‌వారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఎమ్మెల్యే శ్రీ‌కాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

 మూడు రాజధానులు చేస్తే.. రాయలసీమకు చుక్క నీరివ్వమంటూ... చేసిన వ్యాఖ్యల వెనుకున్న రహస్య ఎజెండాను బయటపెట్టాలి. దీని వెనుక చంద్రబాబు ఉన్నాడని అర్థం అవుతుంది. . అంతే కాక మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే.. తాము మద్యాంధ్రప్రదేశ్ పేరిట ఉద్యమించాల్సి ఉంటుందన్న వారి మాటల వెనుక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఉన్నారని అర్థమవుతోంది.
- శ్రీశైలం నీళ్ళు ఎక్కడ నుంచి వస్తున్నాయో మీకు అసలు తెలుసా.. మేము త్యాగం చేసి, కిందకు, మీకు నీళ్ళు ఇస్తుంటే.. రాయలసీమకు చుక్క నీరు ఇవ్వం అని విద్వేషాలు రెచ్చగొడతారా.. ?. ఇదేనా చంద్రబాబూ.. మీ 44 ఏళ్ళ రాజకీయ అనుభవం నేర్పింది..?

  రాయలసీమకు న్యాయ రాజధాని వస్తే చంద్రబాబుకు వచ్చిన నష్టమేమిటో తనకు అర్థం కావడం లేదు. చంద్రబాబుకు అధికారమే పరమావధి. అధికారంలో లేకపోతే.. రాష్ట్రం నాశనం కావాలని కోరుకునే వ్యక్తి చంద్రబాబు. అసలు ఈ రాష్ట్రంపైనే బాబుకు ద్వేషమని అర్థమవుతుంది. అందుకే విభజన సమయంలో రెండు కళ్ళ సిద్ధాంతంతో ఈ రాష్ట్ర విభజనకు ఆయన మూలకారకుడయ్యాడు. ఈరోజు రాష్ట్రం అభివృద్ధి చెందకుండా అడ్డుపడుతున్నాడు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని బాగు చేయడు. అధికారంలో లేనప్పుడు అశాంతి, అలజడులు సృష్టించాలని కుట్రలు పన్నుతున్నాడు. వెనుకబడిన ప్రాంతాలంటే చంద్రబాబుకు ఎందుకంత ద్వేషం. 

 అధికారం కోసం ఎంతకైనా దిగజారే చంద్రబాబు ముఖ్యమంత్రిగా తన తొలి టరమ్‌లో పాలన చూస్తే.. రాష్ట్రంలో ఎక్కడచూసినా, నక్సలిజం, కరువు కాటకాలు, క్షీణించిన శాంతిభద్రతలతో రాష్ట్రం తల్లడిల్లింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి గారు అధికారం చేపట్టాక, వాటన్నింటినీ చక్కదిద్ది రాష్ట్రానికి సరికొత్త దశ,దిశ నిర్ధేశిస్తూ, సంక్షేమ రాజ్యాన్ని నెలకొల్పారు. నాడు వ్యవసాయం దండగన్న చంద్రబాబు మాటల సాక్షిగా రాష్ట్రంలో సేద్యాన్ని పండుగలా మార్చి చూపించారు. రాష్ట్ర విభజన తర్వాత తనకే అనుభవం ఉందని, మళ్ళీ ప్రజలను మభ్యపెట్టి అధికారం చేపట్టిన చంద్రబాబు, ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కై, దాని నుంచి ప్రజల దృష్టిని మళ్ళించేందుకే అమరావతి పాట అందుకున్నారు. భారీ నిర్మాణాలకు ఈ ప్రాంతం అనుకూలం కాదన్న నిపుణుల మాటలను సైతం లెక్క చేయకుండా రాజధాని పేరిట ఇక్కడి రైతులను మోసం చేశారు. చివరికి ప్రజలు ఈసడించుకుని 2019లో అధికారం ఊడగొట్టినా చంద్రబాబుకు బుద్ధి రాలేదు.

 తనకు మాత్రమే విజన్ ఉందని చెప్పుకునే చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పని చేసి, రాష్ట్రాన్ని కరువు ఆంధ్రప్రదేశ్ గా మార్చాడు. తనకు తాను రక్షించుకోలేని, శాంతిభద్రతలు నెలకొల్పిన గొప్ప అడ్మినిస్ట్రేటర్ ఆయన. చెప్పుకోవడానికి ఏమాత్రం సిగ్గుపడకుండా, అబద్ధాలను, అభూతకల్పనలను మళ్ళీ మళ్ళీ చెబితే ప్రజలు నమ్ముతారన్న ఆశ బాబుది. 

 మాట్లాడితే, హైదరాబాద్ ను నిర్మించానంటాడు.. ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు, శరం లేకుండా అవే మాటలా.. ?. చంద్రబాబు అబద్ధాలకు అడ్డూ, అదుపూ ఉండదు. ఆయనే సాఫ్ట్ వేర్ ను అభివృద్ధి చేశానని అంటాడు. అప్పుడు చంద్రబాబే కాదు.. బాలకృష్ణ ఉన్నా సాఫ్ట్ వేర్ రంగం అభివృద్ధి చెంది ఉండేది.  హైదరాబాద్ లో అవుటర్ రింగు రోడ్డుగానీ, ఎయిర్ పోర్టు గానీ, తానే శంఖుస్థాపన చేసి,  ప్రారంభించిన వ్యక్తి వైయ‌స్ రాజశేఖర్ రెడ్డిగారు. అది కూడా తన ఘనతేనని సిగ్గు లేకుండా చంద్రబాబు అబద్ధాలు చెబుతాడు.  నేదురమల్లి జనార్థనరెడ్డి గారు శంఖుస్థాపన చేసిన హైటెక్ సిటీ నాదే.. అని చంద్రబాబు చెప్పుకుంటున్నాడు. వైయ‌స్ఆర్ గారు అధికారంలోకి వచ్చాక, రాష్ట్రాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసి,  జలయజ్ఞం పేరుతో 86 ప్రాజెక్టులు ప్రారంభించారు. 

  అమరావతిని ప్రపంచంలో కెల్లా గొప్ప రాజధానిగా తయారు చేస్తానని, సినిమా సెట్టింగులు మాదిరిగా గ్రాఫిక్స్ చూపించి,  డల్లాస్, సింగపూర్, మలేషియా చేస్తానని చెప్పి.. ప్రజలను మభ్య పెట్టావు. శ్రీ బాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో న్యాయ రాజధాని  హక్కుగా రావాల్సి ఉన్నా దానికీ బాబు అడ్డుపడుతున్నాడు. రాయలసీమ అంటే ఎందుకు విషం కక్కుతున్నావు బాబూ..?

  మీ హయాంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు- పరిశ్రమలుగానీ, జగన్ గారి హయాంలో వచ్చిన పరిశ్రమలు, పెట్టుబడులుగానీ, ఎవరి హయాంలో ఏమేమి వచ్చాయో చర్చిద్దాం అసెంబ్లీకి రా చంద్రబాబూ...?. అసెంబ్లీకి రమ్మంటే పారిపోతావు. 
  తాజాగా వచ్చిన నివేదిక ప్రకారం దేశం మొత్తం మీద వచ్చే పెట్టుబడుల్లో.. ఆంధ్రప్రదేశ్, ఒడిశాల్లోనే 45 శాతం పెట్టుబడులు సాధించాయని డీపీఐఐటీ నివేదిక పేర్కొంది. 

 ఈ రోజు గ్రామాల్లోనే రాజధానిని సృష్టించిన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిగారు. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం, ఆర్బీకే సెంటర్, విలేజ్ క్లినిక్..లు తెచ్చిన ఆదర్శ ముఖ్యమంత్రి జగన్ గారు. ఈ విధంగా ప్రజల గడప వద్దకే పరిపాలన అందిస్తూ,  గొప్పగా  పాలన చేస్తుంటే, చూసి ఓర్వలేక చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నాడు. 

  మేము ఏ ప్రాంతానికీ, ఏ కులానికీ వ్యతిరేకం కాదు. మీరు అధికారంలో ఉండి, అమరావతిలో అద్భుతాలు సృష్టిస్తానని చెప్పి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి, అమరావతిలో వేల కోట్లు ఖర్చు పెట్టి కూడా,  కనీసం అక్కడ టీ తాగేందుకు, భోజనం చేసేందుకు ఒక హోటల్ కూడా లేని పరిస్థితి.  శాసనసభ సమావేశాలకు వెళితేనే.. అక్కడ భోజనం దొరకని పరిస్థితి. 

  చంద్రబాబు నోటితోనే అన్నారు. ఈ ప్రాంతంలో ఇల్లు రెంట్ కు తీసుకోవాలన్నా.. ఏ కులమని అడుగుతారు అని. ఆ విషయాన్ని జగన్ మోహన్ రెడ్డిగారు ఎక్కడా చెప్పలేదే. అంటే దాని అర్థమేమిటి..?.. విశాఖలో మిక్స్ డ్ కల్చర్ ఉంది, టూరిజం ఉంది. పరిపాలనా రాజధానికి అన్నివిధాలా అనువైన ప్రాంతం. 

  విశాఖపట్నం, రాయలసీమకు దూరం అవుతుందని మేము ఎప్పుడూ భావించలేదు. రాజధానిగా అన్ని వనరులు ఉన్న ప్రాంతం కాబట్టి, పరిపాలనా రాజధానిగా విశాఖ అయితేనే ఈ రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుందని భావించాం. 
- అదే అమరావతిలో లక్ష కోట్లు పైగా ఖర్చు పెట్టాలి, అయినా, తిరిగి పెట్టుబడులు వస్తాయని గ్యారెంటీ లేదు. అధికారంలో ఉండి, ఐదేళ్ళలో అమరావతిలో ఒక్క హోటల్ కూడా తేలేని  చంద్రబాబు, అద్భుతాలు చేస్తాడంటే ఎవరు నమ్ముతారు...?.

 ఇప్పటికైనా, రాష్ట్రం కోసం అని ప్రజలను మభ్య పెట్టకుండా, కేవలం అమరావతిలోని 29గ్రామాల కోసం చేస్తున్న పాదయాత్ర అని బోర్డు పెట్టుకోండి.. రాష్ట్రం కోసం కాదు.. మీ కోసం చేస్తున్న యాత్ర అని బహిరంగంగా చెప్పండి అంటూ శ్రీ‌కాంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

తాజా వీడియోలు

Back to Top