రాజధానికి వైయస్‌ జగన్‌ వరం..చంద్రబాబు పెద్ద శాపం 

రాజధాని పేరుతో చంద్రబాబు వేల కోట్లు దోచుకున్నారు

రాజధాని ప్రాంతంలో నాకు భూమి ఉన్నట్లు కనిపెడితే వెంటనే రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తా

నన్ను విరణ అడగకుండా పేపర్లో వార్తలు రాశారు

చంద్రబాబు దోపిడీ, అన్యాయాలకు పవన్‌ సపోర్ట్‌

3 శాఖల మంత్రిగా ఉన్నప్పుడు లోకేష్‌ ఒక్కసారి కూడా మంగళగిరిలో తిరగలేదు

కాగడాలు పట్టుకుని తిరిగే లోకేష్‌ తన ఇల్లు ఎక్కడో చెప్పాలి

అర్ధరాత్రి కరకట్టకు వెళ్లి ప్యాకేజీ తెచ్చుకోలేదా పవన్‌?

విశాఖ, రాయలసీమకు నేను వ్యతిరేకి అని చంద్రబాబు ప్రకటించాలి

ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

తాడేపల్లి: రాజధానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఒక వరమని, చంద్రబాబు పెద్ద శాపమని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఐదేళ్లలో చంద్రబాబు రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ఏమీ చేయలేదని, ఇక్కడ ఒక్క పర్మినెంట్‌ భవనం కూడా నిర్మించలేదన్నారు. తన హయాంలో జరిగిన అక్రమాలు బయటపడకూడదని చంద్రబాబు ఒక కులం, రెండు పేపర్లు, నాలుగు టీవీలను అడ్డుపెట్టుకొని గగ్గొలు పెడుతున్నారని విమర్శించారు. ఆయనకు పవన్‌ కళ్యాణ్‌ కొత్త బినామీ అని, ప్యాకేజీలు తీసుకొని ఆ రోజు పవన్‌ ఏమీ మాట్లాడలేదన్నారు. తనకు మంగళగిరి మండలంలో ఐదెకరాల భూమి ఉందని టీడీపీ నేతలు, పత్రికలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎమ్మెల్యే ఖండించారు. శుక్రవారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలుగు దేశం ప్రభుత్వం రాజధాని పేరుతో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని సాక్ష్యాధారలతో సహా బయటపెట్టాం. గత ఐదేళ్లుగా మంగళగిరిలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చంద్రబాబు రైతు వ్యతిరేకంగా చేసిన పనులు, రాజధాని పేరుతో లక్షల కోట్ల రూపాయల అవినీతిని వైయస్‌ఆర్‌సీపీ ఆ రోజు బయటపెట్టింది. గతంలో రాజధాని పేరుతో జరిగిన అవినీతిని ఈ ప్రభుత్వం బయటపెట్టాల్సిన అవసరం ఉంది. నిన్న ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై వీడియో ప్రదర్శించాం. నిన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా తనపై ఆరోపణలు చేశారు. నా ఎన్నికల అఫిడవిట్లో మంగళగిరి రూరల్‌ మండలంలో నీరుకొండ గ్రామంలో నాకు ఐదు ఎకరాల భూమి నా భార్య పేరుపై ఉందని బోండా ఉమా చెప్పారు. నా అఫిడవిట్‌ పబ్లిక్‌ కాపీ. మీడియాకు కూడా అందించాను. ఎవరైనా నా పేరుపైన కానీ, నా భార్య పేరు మీద కానీ నీరుకొండ గ్రామంలో ఐదు ఎకరాల భూమి ఉందని చూపిస్తే..వెంటనే వారి పేరుపై రిజిస్ట్రేషన్‌ చేయించి ఇస్తాను. ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు చెబుతాను. రెండోవది..స్పీకర్‌ ఫార్మెట్‌లో మంగళగిరి ఎమ్మెల్యేగా రాజీనామాను సమర్పిస్తాను. శాశ్వతంగా రాజకీయాలను వదిలేసి వ్యవసాయం చేసుకుంటాను. బోండా ఉమా తప్పుడు సమాచారం ఇచ్చారని నాకు చెబితే చాలు..క్షమాపణ కూడా అక్కరలేదు. చంద్రబాబు మీ లాంటి వాళ్లను వాడుకుంటున్నారు. నా పేరుతో ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు పెద్ద పెద్ద హెడ్డింగ్‌లతో తప్పుడు కథనాలు రాశారు. మీరు ఇలాంటి కథనాలు ప్రచురించే సమయంలో వివరణ అడగాల్సిన కనీస బాధ్యత రామోజీరావు, రాధాకృష్ణలకు లేదా? చంద్రబాబును అమరావతిలో చేసిన అవినీతి నుంచి బయటపడేసేందుకు ఇలాంటి అవాస్తవాలు రాస్తున్నారు. రాజధానిలో ఇంత జరగడానికి చంద్రబాబు ఐదేళ్లలో చేసిన అక్రమాలే కారణం. ఎక్కడ లక్షల కోట్ల అవినీతిని బయటపెడతారో అన్న భయంతో నీచ రాజకీయాలు చేస్తున్నారు. రాజధానికి శాపం చంద్రబాబు..రాజధానికి ఓ వరం వైయస్‌ జగన్‌. చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఐదేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు గుండె మీద చేతులు వేసుకొని నిజాలు మాట్లాడాలి. నిన్ను నమ్మి రాజధాని రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారంటున్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని ఎర్రబాలెం, కృష్ణాయపాలంలో మీరు తిరుగుతున్నారు. ఆ రోజుల్లో మీ మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావును అర్ధరాత్రి రైతుల ఇళ్లకు పంపించి, వాళ్లను బయటపెట్టి, బతిమిలాడి, బుజ్జగించి ల్యాండ్‌ ఫూలింగ్‌కు భూములు తీసుకుంది వాస్తవం కాదా?. చెరుకూరి శ్రీధర్‌ ద్వారా రాజధానిలో  భూముల దందా చేయలేదా? గడిచిన ఐదేళ్లలో రాజధాని పేరుతో రూ.5 వేల కోట్లు ఖర్చు చేసి ఒక్కటైన పర్మినెంట్‌ బిల్డింగ్‌ కట్టావా? నీకు సహకరించిన రైతులకు ఫుల్లీ డెవలప్‌డ్‌ ప్లాట్లు ఒక్కటైనా చంద్రబాబు ఇచ్చారా?. తారు రోడ్డు వేయడానికి రూ.2 కోట్లకు మించదని ఇంజీనీర్లు చెబుతుంటూ..నీవేమో కిలోమీటర్‌కు రూ.40 కోట్లు ఖర్చు చేశారు. ఏ ఒక్క పని చేయకుండా నీవు..ఇవాళ వైయస్‌ జగన్‌ను విమర్శిస్తావా? కులం అనే సామాజిక ముద్రను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నావు. రాజధాని రైతులను దోచుకోవడం తప్ప ఏ  ఒక్క పని చేయలేదు. అందుకే మీ అబ్బాయిని మంగళగిరిని చిత్తుగా ఓడించారు. అప్పటి డీఎస్పీ రామాంజనేయులును మంగళగిరిలో నీ ఇష్టం వచ్చినట్లు వాడుకుంటూ ఎన్నికల్లో నా ఓటమికి తీవ్ర ప్రయత్నం చేసింది వాస్తవం కాదా?. చంద్రబాబు చేసిన అవినీతి, అన్యాయానికి, రైతు వ్యతిరేక దోరణి కారణంగా మంగళగిరి ప్రజలు నీకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితే మా జీవితాల్లో వెలుగు వస్తుందని నీ కుమారుడిని ఓడించింది వాస్తవం కాదా?. కొట్టి కేసులు పెట్టించారు. నా పై కూడా ఏడు కేసులు పెట్టించావు. కొంత మంది రైతులు మాత్రమే చంద్రబాబును నమ్మి భూములు ఇచ్చారు. వాళ్లకు ప్లాట్లు ఇచ్చావా? ఒక్క భవనమైనా కట్టించావా? దళిత సోదరులను బయపెట్టి వారి భూములను బాబు తన బినామీలకు కట్టబెట్టారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌తో చేసిన మీ బినామీలు, మీ పార్టీ నేతలను కాపాడుకునేందుకు ఈ రోజు ఉద్యమం అంటున్నావు. చంద్రబాబు ఇక్కడ రాజధాని ప్రకటించకముందు తుళ్లూరులో ఎకరా రూ.20 లక్షలకు మించి విలువ చేయలేదు. రాజధాని అన్న తరువాత రూ.2, 3 కోట్లకు వెళ్లింది. అయోమయ పరిస్థితి కారణంగా ఈ రోజు ఆ విలువ పడిపోయిందని కొంతలో కొంత ఒప్పుకుంటున్నా..అంటే ఇక్కడ బాధ అంతా కూడా బాబు బినామీల భూముల విలువ పెరిగి, మళ్లీ తగ్గిపోతుందనే ఆయన బాధ.  కర్నూలు, అనంతపురం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అక్కడి రైతులకు ఎకరా రూ.25 లక్షలు ఉంటుందని తెలియదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందారు. ఈ రెండు జిల్లాల మాదిరిగా అన్ని జిల్లాల ప్రజలు సమాంతరంగా అభివృద్ధి చెందాలని సీఎం వైయస్‌ జగన్‌ కృషి చేస్తున్నారు. 
పవన్‌ కళ్యాణ్‌ చంద్రబాబు కొత్త బినామీ. పవన్‌ ..మీరు ఎర్రబాలెం నుంచి తాడికొండకు వెళ్లారు. సూటిగా ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబును అప్పట్లో ప్రశ్నించావు..అది మరిచిపోయావా? నీవు చెప్పిన వెంటనే చంద్రబాబు భూ సేకరణకు శ్రీకారం చుట్టారు. అర్ధరాత్రి చంద్రబాబు ఇంటికి వెళ్లి ప్యాకేజీలు తెచ్చుకుంది వాస్తవం కాదా? . కాదు అనుకుంటే ఈ రోజు బేతపూడి, మంగళగిరిలో ఆ రోజు ఎందుకు ఆమరణ నిరాహార దీక్ష చేయలేదు. చంద్రబాబు వద్ద ప్యాకేజీ తీసుకున్నావు కాబట్టే..ఆయన కుమారుడు లోకేష్‌ను గెలిపించేందుకు నీ పార్టీ అభ్యర్థిని నిలబెట్టలేదు. సీపీఐ సోదరుడిని ఇక్కడ నిలబెట్టావు. ఆయన్ను గెలిపించేందుకు ఒక్కరోజైనా ప్రచారం చేశావా? తాడికొండలో కూడా బీఎస్పీ అభ్యర్థిని నిలబెట్టారు. నీ వెంట నడిచిన నీ అభిమానులను కూడా పవన్‌ మోసం చేశారు. గత ఐదేళ్లలో నేనేం చేశానని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చంద్రబాబు వద్ద ప్యాకేజీ తీసుకున్నావు కాబట్టే తెర వెనుక ఆయన్ను కాపాడేందుకు ఈ ప్రాంతంలో తిరుగుతున్నారు.
మాతృ సమానురాలు నారా భువనేశ్వరికి కూడా చంద్రబాబు రాజకీయ రంగు పులుముతున్నారు. అమ్మా..భువనేశ్వరి గారు..మీరు కరకట్ట మీద అన్యాయంగా, అక్రమంగా ఉంటున్నారు. ఆ ప్రాంతంలో మీరు తిరుగుతున్నప్పుడు మూడు పంటలు పండే భూములను చూసి మీ మనసు కరగలేదా తల్లీ?. మీ భర్త రైతులను పోలీసు స్టేషన్లలో పెట్టి కొట్టి, హింసించిన రోజుల్లో మీరు రోడ్డుపై ఎందుకు రాలేదని అడుగుతున్నాను. మీ భర్త మిమ్మల్ని నలుగు గదుల మధ్య బంధించారని అనుకుంటున్నాను. మీరు ఇవాళ వచ్చి ఉద్యమానికి రెండు ప్లాటినం గాజులు  ఇచ్చారు. మా వాళ్లు అనుకుంటున్నారు. అవి సత్తు గాజులు అనుకుంటున్నారు. ప్లాటీనం బంగారం కంటే విలువైనది. ఇలాంటివి మీ జీవితంలో చూసి ఉండరని చెప్పండి. మా ఆయన అంత ఆస్తులు సంపాదించారని చెప్పండమ్మా?. ఆ రోజు మీ నాన్నగారు ఎన్టీఆర్‌ను రాజకీయంగా చంపేసిన సమయంలో కూడా మీరు రోడ్డు మీదకు రాలేదు. కళ్లనీళ్లు తుడుచుకుంటూ ఇంట్లో ఉన్నారు.  అయ్యా..ఎందుకు మానాన్నను చిత్రవధకు గురి చేశావని, ఎందుకు కూర్చీ లాక్కున్నావని ఆ రోజు నీవు అడగలేదు. బహుశా అడిగే ఉంటావు..నిన్ను మాట్లాడించే స్వేచ్ఛ చంద్రబాబు నీకు ఇవ్వలేదేమో? కానీ ఇవాళ బయటకు వచ్చావు. మీ భర్తను అడగండి. రూ. 5 వేల కోట్లు ఖర్చు చేశావు కదా..ఏమి చేశావు..రైతులకు ఏమిచ్చారని మీ భర్తను అడగండి.
మొన్న లోకేష్‌ మంగళగిరిలో కాగడాలు పట్టుకొని తిరిగారు. ఐదేళ్ల కాలంలో మూడు శాఖలకు మంత్రిగా ఉన్న లోకేష్‌ ఒక్క రోజు కూడా మంగళగిరిలో తిరగలేదే? మనసులోనైనా మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పండి. కాగడాలు పట్టుకుని తిరిగే సమయంలో మంగళగిరి నియోజకవర్గ హద్దులు వెతకండి సార్‌. నీరుకొండ గ్రామంలో మీ తాత ఎన్టీఆర్‌ విగ్రహం పెడతానని మీ నాన్న హామీ ఇచ్చారు..నాన్నా..కాడగ పట్టుకుని తిరుగుతున్నా తాతా విగ్రహం ఎక్కడా అని అడుగు. అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు చేస్తానన్నావ్‌ కదా అదెక్కడ అని అడగండి. చివరగా నాన్నా మన ఇళ్లు ఎక్కడ అని అడగండి. చంద్రబాబు, లోకేష్‌కు సిగ్గుండాలి. మీరు ముఖ్యమంత్రిగా పని చేసే రోజుల్లోనే ఇది రాజధాని అని చెబితే మా నాయకుడు ఇక్కడ  ఇల్లు కట్టుకున్నారు. ఐదేళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు రాజధానిలో ఇళ్లు కట్టుకోలేదు. నాది మంగళగిరి కాదు..నా సొంత గ్రామం పొందూరు నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. అయినా ఇక్కడి ప్రజలు నన్ను ఆశీర్వదించారు కాబట్టి నేను తాడేపల్లిలో ఉంటున్నాను. కుప్పంలో పుట్టినా సరే రాజధానిలో ఇళ్లు కట్టుకోవాల్సిన బాధ్యత లేదా? సరే..నీవు చాలా నిరుపేదవు. తినడానికి కూడా తిండి లేదనుకుందా. తెల్ల రేషన్‌కార్డుకు దరఖాస్తు చేసుకో..కనీసం బాడుగకైనా ఇల్లు తీసుకోవాల్సిన అవసరం లేదా? అయ్యా, కొడుకులు ఇద్దరు కూడా అధికారంలో ఉంటూ లక్షలాది రూపాయలు ప్రతి నెల హెచ్‌ఆర్‌ఏ రూపంలో కొట్టేశారు. లింగమనేని రమేష్‌ను బయపెట్టి..ఆయన ఇంట్లో ఉంటూ..క్రిడ్‌ఫ్రోకో కింద సహకరిస్తున్నారు. ఉచితంగా ఉంటున్నారు అనుకుంటే..హెచ్‌ఆర్‌ఏ తీసుకోకుండా ఉండాల్సింది. చంద్రబాబు ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తే..వాటికి రూ.700 కోట్లు వడ్డీలు చెల్లిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఇటీవలే సభలో చెప్పారు. చంద్రబాబు వదిలిపెట్టిన పనులు పూర్తి చేయాలంటే సుమారు లక్ష పాతిక కోట్లు అవసరం. దానికి ఎంత వడ్డీ కట్టాలి. ఎవరు కట్టాలి. 13 జిల్లాల ప్రజలు కట్టాలి. ఆదాయమేమో రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్లు, టీడీపీ నేతలు తీసుకోవాలి. తాజ్‌ మహాల్‌కు రాల్లేత్తింది కూలీలు. హైదరాబాద్‌ నగరానికి కూలీలుగా శ్రీకాకుళం, అనంతపురం కూలీలు కాదా? కర్నూలు కూలీలు నడి ఎండకాలంలో గుంటూరుకు వలస వస్తున్నారు. వీళ్లు ఎప్పుడు ఇలాగే ఉండాలా? దశాబ్ధాలుగా కృష్ణా, గుంటూరు జిల్లాలు చాలా అభివృద్ధి చెందాయి. 13 జిల్లాల ప్రజలు సమాంతరంగా అభివృద్ధి చెందాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆలోచన చేస్తున్నారు. చంద్రబాబు చేసిన అప్పులకు సమాధానం చెప్పాలి. తన హయాంలో ఖర్చు చేసిన నిధులకు యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లు ఇవ్వాలని అడిగితే సమాధానం చెప్పడం లేదు. అభివృద్ధి 13 జిల్లాలకు అందకూడదని, నీ లూటీ ప్రజలకు తెలియకూడదని ఒక కులం, రెండు పేపర్లు, నాలుగు టీవీలు కాపాడాలని గగ్గోలు పెడుతున్నావు. రాజధానికి వైయస్‌ జగన్‌ వరం. చంద్రబాబు పెద్ద శాపం. సీఎం వైయస్‌ జగన్‌ ఫుల్లీ డెవలప్‌మెంట్‌ అపార్టుమెంట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు ఎగ్గొట్టిన రాజధాని రైతుల కౌలును వైయస్‌ జగన్‌ చెల్లించారు. పేదలకు నెల నెల జీవనభృతి చెల్లిస్తున్నారు. ఇది రైతు, పేదవారికి మీద, రాజధానిపై వైయస్‌ జగన్‌కు ఉన్న ప్రేమ. చంద్రబాబుకు ఒక్కటే చెబుతున్నాను. అయ్యా..రాజధాని పేరుతో ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య విబేధాలు సృష్టించవద్దు. రాజధానిపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన విధానాన్ని ప్రకటించలేదు. ప్రకటించిన రోజున నీవు ఏం చేశావో..ఏం కోరుకుంటున్నావో మాట్లాడు..ఇష్టం వచ్చినట్లు మీ నాయకులతో మాట్లాడించడం అన్యాయం, అధర్మం. 
 

  
 

Back to Top