మరో 20 ఏళ్లు వైయస్‌ జగనే సీఎం

మంత్రి శంకర్‌నారాయణ

బీసీలను కుల వృత్తులకే పరిమితం చేయాలని బాబు దురాలోచన

బీసీలకు చంద్రబాబు ఏమి చేయలేదు

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అభివృద్ధే వైయస్‌ జగన్‌ లక్ష్యం

అమరావతి: దేశంలోనే ఎక్కడా లేని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మరో 20 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని మంత్రి శంకర్‌నారాయణ పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అభివృద్ధే వైయస్‌ జగన్‌ లక్ష్యమని, బీసీలను కుల వృత్తులకు పరిమితం చేయాలనే దురాలోచన చంద్రబాబుకు ఉందని విమర్శించారు. బీసీల సమస్యలను పరిష్కరించే చిత్తశుద్ధి టీడీపీకి లేదన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ.. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి 3468 కిలోమీటర్ల పాదయాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీలను కలిశారు. వారి బాధలు చూసిన వైయస్‌ జగన్‌ ఇప్పటికే సభలో 6 బిల్లులు ప్రవేశపెట్టారు. ఈ బిల్లులు చారిత్రాత్మకం. వైయస్‌ జగన్‌కు ఉన్న ప్రేమ ఆయన చిత్తశుద్ధిని తెలుపుతుంది. 1993లో బీసీ కమిషన్‌ ఏర్పాటు చేశారు. తరువాత ఆ బిల్లును సక్రమంగా అమలు చేయలేదు. బీసీల కోసం ప్రత్యేకంగా కొత్త కమిషన్‌ ఏర్పాటు చేయడం శుభపరిణామం. ప్రభుత్వం బీసీల కోసం, సాధికారతకు కృతనిశ్చయంతో ఉంది. లక్ష్యసాధనకు పని చేసేందుకు కొత్త కమిషన్‌ ఏర్పాటు చేశాం. నిరంతరాయంగా పని చేసేందుకు కమిషన్‌ కృషి చేస్తుంది. ఈ రోజు కొన్ని గ్రూపులకు సంబంధించిన అంశాన్ని కూడా సంక్లిష్టంగా ఉంది. కుల ధ్రువీకరణ పత్రాల జారీలో ఉన్న అంశాలను, సమస్యలను పరిష్కరించేందుకు రీ గ్రూపింగ్‌ జరిపిస్తాం. నూతన విధానంలో ఈ సమస్యలను నివారిస్తాం. కొత్త శాసనం ద్వారా జరిపే పరిపాలనతో బీసీలకు మేలు జరుగుతుంది. బీసీ కులాల్లో అనేక సంచార జాతులు ఉన్నాయి. గతంలో టీడీపీ ప్రతి కులానికి ఒక పేజీ కేటాయిస్తూ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఐదేళ్లలో చంద్రబాబు బీసీలకు చేసింది శూన్యం.

బీసీలను కేవలం ఓట్ల కోసం వాడుకున్నారు. కుల వృత్తులకు పరిమితం చేయాలని దిగజారుడు ఆలోచన చేశారు. మా నేత వైయస్‌ జగన్‌ కొత్తగా ఆలోచించి, చారిత్మాత్మక నిర్ణయం తీసుకున్నారు. పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు.  గత ప్రభుత్వానికి బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు. కేవలం ఓటు బ్యాంకులా వాడుకుంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వైయస్‌ జగన్‌ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని, ఉన్నతమైన స్థానం కల్పించారన్నారు. నిన్న బిల్లు ప్రవేశపెట్టే సమయంలో టీడీపీ సభ్యులు సభలో చేసిన గందరగోళం ప్రజలంతా చూశారు. వైయస్‌ జగన్‌కు మంచి పేరు వస్తుందని ఈర్ష్యతో టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారని విమర్శించారు. వైయస్‌ జగన్‌ ప్రవేశపెట్టిన పథకాలతో మరో 20 ఏళ్లు అధికారంలో ఉంటామని చెప్పారు. దివంగత నేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. టీడీపీ నేతలు ఈ రోజు సిగ్గు విడిచి బిల్లులపై చర్చ జరుగకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. బీసీ కమిషన్‌ ఉద్దేశాలపై చర్చ జరుగకుండా ప్రతిపక్షం చేస్తున్న గందరగోళం బాధాకరమన్నారు.
 

Back to Top