టీడీపీ, జనసేన సైకో పార్టీలు

మంత్రి ఆర్కే రోజా

తాడేప‌ల్లి: టీడీపీ, జనసేన సైకో పార్టీలని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. దేశంలోనే అతిపెద్ద పొలిటికల్‌ సైకో చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వీధి రౌడీలా ప్రవర్తిసున్నారని మండిపడ్డారు. 
గురువారం మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ.. 'చంద్రబాబు నాయుడు.. శవాల నాయుడు. కుప్పంలో ఆయన కూసాలు కదులుతున్నాయి. కుప్పం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈడ్చి తన్నితే హైదరాబాద్‌లో పడ్డాడు. పవన్‌ను సొంత జిల్లా, నియోజకవర్గంలోనే ప్రజలు ఓడించారు. చంద్రబాబు తప్పులు చేస్తే పవన్‌ నోటికి ప్లాస్టర్‌ వేసుకుంటాడు. కందుకూరులో ఎనిమిది, గుంటూరులో ముగ్గురు చనిపోతే పవన్‌కు కనపడలేదా?. పవన్‌ కల్యాణ్‌కు ప్రజలే రాజకీయ సమాధి కడతారు' అని మంత్రి రోజా హెచ్చరించారు. 

ప్రెస్‌మీట్‌లో మంత్రి శ్రీమతి రోజా ఏం మాట్లాడారంటే..:

బాబు పొలిటికల్‌ సైకో:
    ప్రజా నాయకుడు, ప్రజల చేత శభాష్‌ అనిపించుకున్న గొప్ప నాయకుడు సీఎం శ్రీ వైయస్‌ జగన్‌. అలాంటి మనుసున్న నాయకుడిపై చంద్రబాబు పిచ్చి విమర్శలు చేస్తున్నారు. నిజం చెప్పాలంటే దేశంలోనే పెద్ద పొలిటికల్‌ సైకో, పొలిటికల్‌ ఉన్మాది ఎవరైనా ఉన్నారంటే.. అది ఖచ్చితంగా చంద్రబాబు. ఇదే మాట అందరూ చెబుతారు. రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి చంద్రబాబుది అదే చరిత్ర. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, పదవితో పాటు, పార్టీని లాక్కున్న చంద్రబాబు రాజకీయ జీవితమంతా అనైతికం. 

పరాకాష్టకు వారిద్దరి పిచ్చి:
    నాడు సీఎంగా ఉన్నప్పుడు గోదావరి పుష్కరాల సమయంలో 29 మందిని, ఇటీవల కందుకూరు, గుంటూరులో మరో 11 మందిని తన పబ్లిసిటీ పిచ్చికి చంద్రబాబు బలి తీసుకున్నాడు. అయినా వైఖరి మార్చుకోని చంద్రబాబు సైకోతనాన్ని, ఉన్మాదితీరును ప్రజలంతా గమనిస్తున్నారు. ప్రజల భద్రత, రక్షణ కోసం ప్రభుత్వం జీఓ నెం:1 తెస్తే, దానిపైనా చంద్రబాబుతో పాటు, ఆయన దత్తపుత్రుడు అర్ధం లేని విమర్శలు చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇద్దరూ పొలిటికల్‌ సైకోలు. ఇద్దరి పిచ్చి పరాకాష్టకు చేరింది.
    తన సభకు వచ్చిన వారు చనిపోతే, తొక్కిసలాటలో చాలా మంది గాయపడినా కనీసం పరామర్శించని చంద్రబాబు హైదరాబాద్‌ వెళ్లిపోయాడు. ఆయనకసలు సిగ్గు అనేది ఉందా?

ఆ పని చేస్తే మీరు తిరగ్గలరా?:
    సీఎం శ్రీ వైయస్‌ జగన్‌కు కక్ష సాధింపు అనేది తెలియదు. అందుకే తనకు ఓటేయకపోయినా సరే, అర్హత ఉంటే ప్రతి పథకం అర్హులైన ప్రతి ఒక్కరికి అందాలని పదే పదే చెబుతుంటారు. నిజంగా ఆయన కక్ష సాధించాలనుకుంటే.. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌.. రాష్ట్రంలో తిరగగలిగే వారా? ఎక్కడా ఆ పార్టీల వారిని అడ్డుకోవడం లేదే?.

అవన్నీ కక్ష సాధింపు కావా?:
    నిజానికి చంద్రబాబే కక్ష సాధింపు రాజకీయాలు చేశాడు. ఆనాడు విపక్షనేతగా ఉన్న జగన్‌గారు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం విశాఖలో క్యాండిల్‌ ర్యాలీ తలపెట్టి వెళ్తే, ఎయిర్‌పోర్టులోనే అడ్డుకున్నారు. అది కక్ష సాధింపు కాక మరేమిటి? విపక్షనేతగా ఉన్న జగన్‌గారు విశాఖలో విమానం దిగగానే ఎయిర్‌పోర్టులోనే నిలువరించిన పోలీసులు, తమ పరిధికి మించి ప్రవర్తించారు. ఆయనను ముందుకు వెళ్లనీయలేదు. అంతే కాకుండా ప్రత్యేక హోదా కోసం ఆంధ్ర వర్సిటీ విద్యార్థులు పోరాడితే, వారిపైనా కేసులు నమోదు చేయించిన చంద్రబాబు ఆ స్థాయిలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు.
    పరిశ్రమల నుంచి విషవాయువులను కట్టడి చేయాలంటూ మహిళలు నిరసన వ్యక్తం చేస్తే, వారిని జైలుకు పంపించిన ఉన్మాది చంద్రబాబు. అసెంబ్లీలో నేను ఆనాడు సీఎంగా ఉన్న చంద్రబాబును నిలదీస్తే, నన్ను ఏడాదిపాటు సస్పెండ్‌ చేశారు. మహిళా పార్లమెంట్‌కు ఆహ్వానించి దారుణంగా అవమానించారు. అవన్నీ కక్ష సాధింపు చర్యలు కావా?.

ఆ అర్హత బాబుకు లేదు:
    ఈరోజు చంద్రబాబు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నాడు. అసలు ఆయనకు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత ఏ మాత్రం లేదు. ఎందుకంటే ఆనాడు మా పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనడమే కాకుండా, వారిలో నలుగురికి మంత్రి పదవి కూడా ఇచ్చారు. చంద్రబాబుది అంత నీచమైన రాజకీయ చరిత్ర. 

బాబు కుప్పం కోట కూలింది:
    14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు తన నియోజకవర్గం కుప్పంకు వెలగబెట్టిందేమీ లేదు. అదే మా ప్రభుత్వం వచ్చాక కుప్పంను మున్సిపాలిటీతో పాటు, రెవెన్యూ డివిజన్‌గానూ చేయడంతో పాటు, నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశాం. అందుకే కుప్పం మున్సిపాలిటీతో సహా, నియోజకవర్గంలో జరిగిన అన్ని స్థానిక ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీని చిత్తుగా ఓడించి, వైయస్సార్‌సీపీకి పట్టం కట్టారు.
    చంద్రబాబుకు కుప్పం కోట కూలింది. అందుకే ఎలాగైనా తిరిగి నిలబెట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు, ఇటీవల తరుచూ పర్యటిస్తున్నారు. ప్రజల్లో తనకు ఇంకా బలం ఉందని చూపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే చంద్రబాబు ఎన్ని చేసినా, ప్రజలు ఆదరించే పరిస్థితి లేదు. అందుకే గతి తప్పి మాట్లాడుతున్న చంద్రబాబు, ప్రభుత్వంపైనా, సీఎంగారిపైనా పిచ్చి విమర్శలు చేస్తున్నారు.

అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?:
    . ఇప్పటి వరకు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో చంద్రబాబు ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదు. అదే సీఎం శ్రీ వైయస్‌ జగన్, అక్కడ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు చేశారు. అందుకే కుప్పం అభివృద్దిపై మేము చర్చకు వస్తాము. నీవు అందుకు సిద్ధంగా ఉన్నావా? నిజంగా నీకు కానీ, నీ కొడుక్కు కానీ ఆ ధైర్యం ఉందా?.

జీఓపై పచ్చ మీడియా వక్రీకరణ:
    రహదారులు, రోడ్ల పక్కన, మార్జిన్లలో బహిరంగ సభలు, సమావేశాల నిర్వహణ వల్ల ప్రాణహాని జరుగుతుండడంతో, ప్రజల భద్రత, రక్షణ కోసం వాటిని నిషేధిస్తూ, ప్రభుత్వం జీఓ నెం:1 జారీ చేసింది. అయితే చంద్రబాబుతో పాటు, ఆయనకు తొత్తుగా ఉన్న పచ్చమీడియా జీఓను వక్రీకరిస్తూ ప్రచారం చేస్తున్నాయి. జీఓలో వాస్తవాలు దాచిపెట్టి, అసత్యాలు చెబుతున్నారు. ఆ విధంగా ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. 

చంద్రబాబు–శవాలనాయుడు:
    జీఓను లెక్క చేయకుండా, అనుమతి లేకుండా సభలకు సిద్ధమవుతున్న చంద్రబాబు.. శవాలనాయుడుగా మారుతానంటున్నాడు. అలా జనాల శవాల మీద సభలు పెడతానంటే, ప్రభుత్వం చూస్తూ ఊర్కోదు. మా ప్రభుత్వానికి ప్రజల భద్రత, రక్షణ చాలా ముఖ్యం. 
    అయినా ఇలాగే సీఎంగారిపై అవాకులు చెవాకులు పేలితే, ఇష్టం ఉన్నట్లు విమర్శలు, వ్యాఖ్యలు చేస్తే.. సహించబోము. చంద్రబాబు పళ్లు రాలగొట్టి చేతిలో పెడతాం.

మానవత్వం లేని పవన్‌కళ్యాణ్‌:
    సినిమా రంగం నుంచి చాలా మంది తారలు రాజకీయాల్లోకి వచ్చి రాణించారు. స్వతహాగా మానవత్వ విలువలు ఎక్కువగా ఉండి చాలా సున్నితంగా ఉండే నటులు రాజకీయాల్లో విశేష జనాదరణ పొందుతూ ఉంటే.. ఈరోజు పవన్‌కళ్యాణ్‌ మాత్రం మానవత్వం లేని పశువుగా మారాడు. ఆయన సినిమా నటుడు అని చెప్పేందుకు నేను సిగ్గు పడుతున్నాను.
    ఇప్పటంలో అక్రమంగా నిర్మాణమైన గోడల్ని ప్రభుత్వం కూల్చితే లేచిన పవన్‌కళ్యాణ్‌ నోరు.. కందుకూరు, గుంటూరుల్లో 11 మంది ప్రాణాలు పోయినప్పుడు లేవలేదు. అంటే, పవన్‌కళ్యాణ్‌కు మహిళలంటే చులకనా?. ఆయన దృష్టిలో గోడలకున్న విలువ కూడా మనుషుల ప్రాణాలకు లేదా?. నిత్యం చంద్రబాబుతో అంట కాగుతూ.. ఆయనకు ఎలాగైనా తిరిగి అధికారం రావాలన్న లక్ష్యంతో పని చేస్తున్న పవన్‌కళ్యాణ్‌ రాజకీయ సమాధికి ప్రజలు ఎదురుచూస్తున్నారు.

2024 ఎన్నికల్లో వార్‌ వన్‌సైడే:
    రాష్ట్రంలో ముందెన్నడూ ఎరుగని రీతిగా.. ఏ ముఖ్యమంత్రీ చేయని అభివృద్ధి, సంక్షేమం అమలు చేస్తున్న సీఎం శ్రీ వైయస్‌ జగన్‌కు విశేష ప్రజాదరణ లభిస్తోంది. ఆయన ఎక్కడకు వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆ స్థాయిలో జన నీరాజనాలను మనం చూస్తున్నాం. అందుకే 2024 ఎన్నికల్లో వార్‌ వన్‌సైడ్‌. 175కు 175 మా పార్టీ గెల్చుకుంటుందని చంద్రబాబుకు అర్ధమైంది. అందుకే రాష్ట్రంలో అలజడి సృష్టించి, శాంతి భద్రతలకు భంగం వాటిల్లేలా ప్రవర్తిస్తున్నాడని మంత్రి శ్రీమతి ఆర్‌కె రోజా అన్నారు.

Back to Top