డబ్బు కోసం గడ్డికరిచే మనుషులు జేసీ బ్రదర్స్‌

బీఎస్‌3 వాహనాలను బీఎస్‌4గా నమ్మించి ప్రజల ప్రాణాలతో చెలగాటం

నకిలీ డాక్యుమెంట్లతో నాగలాండ్‌లోని కోహిమలో రిజిస్ట్రేషన్‌

అశోక్‌ లేలాండ్‌ వద్ద 154 లారీ ఛాసిస్‌లు స్క్రాప్‌ కింద కొనుగోలు

దొంగ సర్టిఫికేట్లతో రిజిస్ట్రేషన్‌.. వాటిల్లో 4 ఛాసిస్‌లు బస్సులుగా మార్పు

దీంట్లో ఎన్‌ఓసీలు, ఇన్సూరెన్స్‌ డాక్యుమెంట్లు కూడా ఫేకే

చంద్రబాబు అండ ఉంటే ఎవరు తప్పులు చేసినా అరెస్టు చేయకూడదా..?

జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్టుపై ఆధారాలతో సహా చర్చకు సిద్ధం

చంద్రబాబుకు రవాణా శాఖ మంత్రి పేర్ని నాని సవాల్‌

హైదరాబాద్‌: డబ్బుల కోసం కక్కుర్తిపడి.. ప్రజల ప్రాణాలతో జేసీ బ్రదర్స్‌ చెలగాటం ఆడారని, సుప్రీం కోర్టు నిషేధించిన బీఎస్‌3 వెహికిల్స్‌ను బీఎస్‌4 వెహికిల్స్‌గా నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్‌ చేయించారని రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని వివరించారు. అశోక్‌ లేలాండ్‌ కంపెనీ వద్ద మిగిలిపోయిన 154 బీఎస్‌3 లారీలను పనికిరాని ఇనుము కింద కొనుగోలు చేసి నాగలాండ్‌లోని కోహిమలో తప్పుడు డాక్యుమెంట్లతో రిజిస్ట్రేషన్‌ చేయించి వెంటనే ఎన్‌ఓసీ తీసుకొని ఆంధ్రప్రదేశ్‌కు, వివిధ రాష్ట్రాలకు తరలించారన్నారు. వీటిలో 4 లారీలను బస్సులుగా మార్చి ప్రజల ప్రాణాలతో చెలగాలమాడారని మండిపడ్డారు. పూర్తి ఆధారాలతో జేసీ ప్రభాకర్‌రెడ్డి, జేసీ అస్మిత్‌రెడ్డిలను అరెస్టు చేయడం జరిగిందన్నారు. 

మోడీకంటే నేనే సీనియర్‌ నాయకుడినని ప్రగల్భాలు పలికే చంద్రబాబు.. తెలుగుదేశం పార్టీ నాయకులు వైయస్‌ జగన్‌ ప్రభుత్వంపై పోరాటం చేస్తుంటే.. భయపెట్టడం కోసం అక్రమ కేసులతో అరెస్టులు చేస్తున్నారని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు, ఆయన వారసుడు, ఆయనతో ఉన్నవారందరిలో ఎవరొచ్చినా మీడియా సమక్షంలో ఆధారాలతో సహా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని మంత్రి పేర్ని నాని సవాల్‌ విసిరారు. టీడీపీ మాజీ శాసనసభ్యుడు జేసీ ప్రభాకర్‌.. ప్రజల ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కక్కుర్తి సొమ్ముకోసం దిగజారి ప్రవర్తించాడన్నారు. 

హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో రాష్ట్ర సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని విలేకరుల సమావేశం నిర్వహించారు. జేసీ ప్రభాకర్‌ చేసిన అక్రమాలను ఆధారాలతో సహా వివరించారు. మీడియా సమక్షంలో ఆధారాలతో సహా అక్రమాలపై సమగ్రంగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని, చర్చకు చంద్రబాబును ఆహ్వానించారు. 

మంత్రి పేర్ని నాని ఏం మాట్లాడారంటే.. 

కేంద్ర రవాణా శాఖ ఇచ్చిన జీఓ ఆధారంగా.. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు బీఎస్‌3 ప్రామాణికాలతో తయారైన ఏ వాహనం అయినా సరే.. 2017 మార్చి 31 తరువాత తయారు చేయకూడదు. షోరూమ్‌లలో అమ్మకూడదు. ఏ రాష్ట్రానికైనా సంబంధించిన రవాణా శాఖ కూడా వాటిని రిజిస్ట్రేషన్‌ చేయకూడదు అనేది సుప్రీం కోర్టు తీర్పు. 

కోర్టు తీర్పుకు లోబడి అన్ని కంపెనీలు వాహనాలను వెనక్కితీసుకుంటే.. అశోక్‌ లేలాండ్‌ కంపెనీ దగ్గర మిగిలిపోయిన 154 బీఎస్‌3 లారీ ఇంజన్లతో సహా ఛాసిస్‌లను జటాధరా ఇండస్ట్రీస్‌లో డైరెక్టర్‌లుగా ఉన్న జేసీ ప్రభాకర్‌రెడ్డి శ్రీమతి జేసీ ఉమారెడ్డి, కుమారుడు జేసీ అస్మిత్‌రెడ్డి, అనుచరుడు గోపాల్‌రెడ్డి అండ్‌ కంపెనీల ద్వారా 66 బీఎస్‌3 వెహికిల్స్‌ 2018లో ఫేక్‌ డాక్యుమెంట్స్‌తో నాగలాండ్‌ రాష్ట్రంలోని కోహిమ ఆర్టీఓ ఆఫీస్‌లో రిజిస్ట్రర్‌ చేశారని సమాచారం వచ్చింది. 

అశోక్‌ లేలాండ్‌ కంపెనీకి 10–02–2020న రవాణా శాఖ నుంచి ఈ 66 లారీల ఛాసిస్‌ నంబర్‌లను పంపించడం జరిగింది. వీటిని మీరు విక్రయించారా..? ఏ షోరూమ్‌ ద్వారా విక్రయించారో వివరించాలని కోరాం. 23–02–2020న అశోక్‌ లేలాండ్‌ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రవాణా శాఖకు జవాబు ఇచ్చారు. నిషేధించబడిన బీఎస్‌3 66 వాహనాల్లో 40 వెహికల్స్‌ గోపాల్‌రెడ్డి అండ్‌ కంపెనీకి, జటాధరా కంపెనీకి 26 వెహికల్స్‌ను పనికిరాని తుక్కు ఇనుము కింద విక్రయించామని వివరణ ఇచ్చారు. 

వెంటనే అనంతపురం వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో రవాణా శాఖ నుంచి కంప్లయింట్‌ ఇచ్చాం. ట్రాన్స్‌పోర్టు డిపార్టుమెంట్, అనంతపురం పోలీసులు నాగలాండ్‌ రాష్ట్రంలోని కోహిమకు విచారణకు వెళ్లారు. 66 వెహికల్స్‌ అక్కడే రిజిస్ట్రర్‌ కాబడి.. వెంటనే ఎన్‌ఓసీ తీసుకొని వచ్చాయని తెలిసింది. 

అనంతపురం పోలీసులు అశోక్‌ లేలాండ్‌ కంపెనీకి కూడా విచారణకు వెళ్లారు. 66 వెహికల్స్‌ కాదు.. జటాధర ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు, గోపాల్‌రెడ్డి అండ్‌ కంపెనీకి సుప్రీం కోర్టు నిషేధించిన 154 బీఎస్‌3 ఛాసిస్‌లను తుక్కు ఇనుము కింద విక్రయించినట్లు అశోక్‌ లేలాండ్‌ కంపెనీవారు చెప్పారు. దీంట్లో జటాధరా కంపెనీకి 50 ఛాసిస్‌లు, మిగతా 104 ఛాసిస్‌లు గోపాల్‌రెడ్డి కంపెనీకి పనికిరాని ఇనుము కింద విక్రయించినట్లు విచారణలో తేలింది. 

154 చాసిస్‌లలో 98 చాసిస్‌లు ఫేక్‌ డాక్యుమెంట్స్‌తో 2018లో నాగలాండ్‌ రాష్ట్రంలోని కోహిమాలో రిజిస్ట్రర్‌ అయితే.. 32 చాసిస్‌లు ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్ట్రర్‌ అయ్యాయి. 29 అనంతపురంలో, 3 కర్నూలులో రిజిస్ట్రర్‌ కాబడ్డాయి. మిగిలిన 24  వివిధ రాష్ట్రాల్లో రిజిస్ట్రర్‌ అయ్యాయి. దాంట్లో ఒక లారీ తమిళనాడులోని రెడ్‌హిల్స్‌లోని ఆర్టీఓ ఆఫీస్‌లో, మరొకటి ఛత్తీస్‌ఘడ్‌లోని రాయపూర్‌లో, కర్ణాటకలో 19 రిజిస్ట్రర్‌ అయ్యాయి. ఇంకో 3 వాహనాలు ఎక్కడ రిజిస్ట్రర్‌ అయ్యాయో ఇప్పటికి తెలియలేదు. 

నాగలాండ్‌లోని కోహిమాలో రిజిస్ట్రర్‌ అయిన 98 వాహనాలు వెంటనే ఎన్‌ఓసీ తీసుకొని ఆంధ్రప్రదేశ్‌కు 97, కర్ణాటకకు ఒకటి ట్రాన్స్‌ఫర్‌ అయ్యాయి. ఈ 97 వాహనాల్లో 54 అనంతపురంలో, మరో 15 వాహనాలు వివిధ జిల్లాలో ఉన్నాయి. అనంతపురంలో రిజిస్ట్రర్‌ అయిన 28 వాహనాల్లో 15 లారీలు తెలంగాణకు, 13 లారీలు కర్ణాటకకు వెళ్లాయి. కాగితాలు చేతులు మారితే వెహికిల్స్‌ రెగ్యులరైజ్‌ అవుతాయి.. రికార్డులు పుట్టుకొస్తాయని ఈ రకమైన ఉద్దేశపూర్వక దొంగతనానికి వీరు పాల్పడ్డారు. 

ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్ట్రర్‌ అయిన 32 వాహనాల్లో కూడా 29 అనంతపురంలో, 3 కర్నూలులో రిజిస్ట్రర్‌ కాబడ్డాయి. అనంతపురంలో రిజిస్ట్రర్‌ అయిన లారీల్లో 4 బస్సులుగా మార్చబడి దివాకర్‌ ట్రావెల్స్‌ కింద తిరుగుతున్నాయి. లారీల రిజిస్ట్రేషన్‌ తప్పు అయితే.. దాంట్లో నాలుగింటిని బస్సులుగా మార్చి దివాకర్‌ ట్రావెల్స్‌ కింద తిప్పుతున్నారు. డబ్బు కోసం కక్కుర్తి తప్పితే.. ప్రజల ప్రాణాలంటే జేసీ బ్రదర్స్‌కు లెక్కలేదు. 

మొత్తం వాహనాల లెక్క చూసుకుంటే.. 154 వెహికిల్స్‌లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రికార్డు ప్రకారం నమోదైనవి 101, కర్ణాటకలో 33, తెలంగాణలో 15, తమిళనాడులో 1, ఛత్తీస్‌ఘడ్‌లో 1, మిగిలిన 3 ఇంకా ట్రేస్‌ అవ్వలేదు. 

కర్ణాకటకు వెళ్లిన 13 వాహనాల్లో ఇప్పటికీ 6 లారీలకు పోలీసుల ఎన్‌ఓసీ, ట్రాన్స్‌పోర్టు డిపార్టుమెంట్‌ ఎన్‌ఓసీ నకిలీవి సృష్టించారు. దీనిపై కూడా కేసు ఫైల్‌ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ట్రాన్స్‌పోర్టు డిపార్టుమెంట్‌ ఈ బీఎస్‌3 నిషేధిత 101 వాహనాల్లో 97 వాహనాల రిజిస్ట్రేషన్‌ రద్దు చేయబడింది. మరొక 6 కోర్టులో ఉన్నందు వల్ల రద్దు కోసం కోర్టు అనుమతిని కోరాం. దీంట్లో 62 వెహికిల్స్‌ను సీజ్‌ చేయడం జరిగింది. వీటిలో59 లారీలు, 3 బస్సులు కూడా ఉన్నాయి. మిగతా వాటి కోసం గాలిస్తున్నాం. 

101 వాహనాల్లో 90 వెహికిల్స్‌కు ఫేక్‌ ఇన్సూరెన్స్‌ క్రియేట్‌ చేసుకున్నారు. అంటే ప్రమాదవశాత్తు యాక్సిడెంట్‌ జరిగితే.. ప్రజల ప్రాణాల పరిస్థితి ఏంటీ..? దొంగ కాగితాలతో రిజిస్ట్రేషన్‌ చేయించడం.. వాటిల్లో 4 బస్సులుగా మార్చడం. దీంట్లో కూడా ఫేక్‌ ఇన్సూరెన్స్‌తో తిప్పుతున్నారు. వీటన్నింటికీ సంబంధించి పూర్తి ఆధారాలు అనంతపురం పోలీసులు, ట్రాన్స్‌పోర్టుడిపార్టుమెంట్‌ దగ్గర ఉన్నాయి. 

రూపాయి కోసం గడ్డికరిచే మనుషులు జేసీ బ్రదర్స్‌. దీనికి వైయస్‌ఆర్‌ సీపీపై పోరాటం చేస్తుంటే అక్రమ కేసులు పెట్టారని మాట్లాడడం సిగ్గుచేటు. చంద్రబాబు అండ ఉంటే ఎవరు తప్పులు చేసినా అరెస్టు చేయకూడదా..? చంద్రబాబు ప్రభుత్వంలో చట్టం వారందరికీ చుట్టంగా మారింది. డబ్బు కోసం ఎటువంటి దుర్మార్గానైనా చంద్రబాబు ప్రోత్సహించాడు. వైయస్‌ జగన్‌ను అసభ్యంగా తిట్టిన జేసీ బ్రదర్స్‌కు చంద్రబాబు ఇచ్చిన టిప్పు ఇదే. 

లోకేష్‌నాయుడు ఆలీ బాబా అయితే ఇలాంటి వారంతో దొంగలను వెంట వేసుకొని రాష్ట్రాన్ని, ప్రజలను దోచుకుతిని.. ఈ రోజు శ్రీరంగ నీతులు చెప్పడం దిగజారుడుతనం. రావిచెట్టుకు, వేప చెట్టుకు వయస్సు వచ్చినట్లుగా.. మనకు కూడా వయస్సు వస్తే సరిపోదు.. మాట్లాడే మాటకు కనీస జ్ఞానం ఉండాలి. 

హైదరాబాద్‌లోనైనా.. జూమ్‌లోనైనా మీడియా సమక్షంలో జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డి అరెస్టు, కేసుల మీద ఆధారాలతో సహా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబును చర్చకు ఆహ్వానిస్తున్నాం. 

 

Back to Top