ప్రజలంతా గర్వపడేలా సీఎం వైయస్‌ జగన్‌ పాలన

పలు కీలక అంశాలకు కేబినెట్‌ ఆమోదం

వైయస్‌ఆర్‌ చేయూత పథకానికి కేబినెట్‌ ఆమోదం

చిరు వ్యాపారులకు అండగా ‘జగనన్న తోడు’ పథకం

10 వేల మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు తీర్మానం

నర్సింగ్‌ కాలేజీల్లో టీచింగ్, నాన్‌టీచింగ్‌ పోస్టుల ఏర్పాటుకు ఆమోదం

బోగాపురం ఎయిర్‌పోర్టు 2700 నుంచి 2200 ఎకరాలకు కుదింపు

కానుకల పేరుతో గత ప్ర‌భుత్వం చేసిన‌ అవినీతిని గుర్తించిన కేబినెట్‌ సబ్‌ కమిటీ

ఫైబర్‌ నెట్‌లో రూ.200 కోట్ల అవకతవకలు జరిగినట్లుగా గుర్తింపు

కేబినెట్‌ సబ్‌ కమిటీ సిఫార్స్‌ మేరకు సీబీఐ విచారణకు ఆమోదం

కేబినెట్‌ నిర్ణయాలను వెల్లడించిన సమాచార శాఖ మంత్రి పేర్ని నాని

సచివాలయం: ప్రజల ఆస్తిని కాపాడేందుకు మంచి వ్యక్తికి అధికారం ఇచ్చినందుకు ప్రజలందరూ గర్వపడేలా సీఎం వైయస్‌ జగన్‌ పాలన సాగుతోందని సమాచార శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. ప్రజలంటే బాధ్యత కలిగి.. ప్రజలు కట్టే ప్రతి పన్ను పైసా పైసా ఆదా చేసి ఎంచి ఖర్చు పెట్టాలని ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ నాయకత్వంలో ప్రభుత్వం ముందుకునడుస్తోందన్నారు. అధికారం దొరికిందే తడవుగా మనవడు, మని మనవడు, ఇంకా పది తరాలు వెనక్కి చూసుకోకుండా సంపాదించాలని, నా కార్యకర్తలకు దోచిపెట్టాలని దుర్మార్గపు ఆలోచనతో గత ప్రభుత్వంలో చంద్రబాబు చేసిన అవినీతిని ఒక్కోటిగా చూపిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం చంద్రన్న కానుకలు, ఫైబర్‌ గ్రిడ్‌లలో చేసిన అవినీతిపై చంద్రబాబు కోరుకున్నట్లుగానే సీబీఐ విచారణకు కేబినెట్‌ ఆమోదం తెలిపిందన్నారు. కేబినెట్‌ సమావేశంలో చర్చించి, ఆమోదించిన అంశాలను మంత్రి పేర్ని నాని వివరించారు. 

‘వైయస్‌ఆర్‌ చేయూత’కు ఆమోదం
మంత్రిమండలి సమావేశంలో నవరత్నాల్లో భాగమైన వైయస్‌ఆర్‌ చేయూత.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో 45 నుంచి 60 సంవత్సరాల్లోపు ఉన్న అక్కచెల్లెమ్మలకు ఆర్థికసాయాన్ని అందించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. చిన్న చిన్న వ్యాపారాలు, అవసరాల కోసం ఆర్థికంగా ఆ కుటుంబాలు పురోభివృద్ధి సాధించేందుకు ఏడాదికి సుమారు రూ.18 నుంచి రూ.21 వేల కోట్లు వారికి ప్రభుత్వం అందించదలుచుకుంది. ఈ నిర్ణయాన్ని సీఎం వైయస్‌ జగన్‌ నాయకత్వంలోని మంత్రిమండలి ఆమోదించింది. వైయస్‌ఆర్‌ చేయూత పథకం ద్వారా సుమారు 24 నుంచి 25 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఆర్థికసాయం అందించనున్నాం. సంవత్సరానికి రూ.18,750 అందించడం జరుగుతుంది. 

చిరువ్యాపారుల కోసం ‘జగనన్న తోడు’
‘జగనన్న తోడు’ అనే కొత్త పథకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఆర్థికంగా వెనుకబడి చిరువ్యాపారాలు, తోపుడుబండ్లు, బడ్డీకొట్లు, సంప్రదాయ హస్తకళల మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న చిన్న కుటుంబాలకు ఆర్థికసాయం అందనుంది. జగనన్న తోడు పథకం ద్వారా వీరికి సంవత్సరానికి రూ.10 వేలు బ్యాంకుల ద్వారా లోన్‌ ఇప్పించే బాధ్యత తీసుకోవడమే కాకుండా.. వడ్డీ భారాన్ని ప్రభుత్వం భరించనుంది. వ్యాపారాన్ని ఎంతోకొంత పెంచుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ పథకాన్ని సీఎం ప్రవేశపెట్టారు. ఈ పథకాన్ని అక్టోబర్‌లో ప్రారంభించేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 

వైయస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ, వైయస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌
వైయస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ అనేది మైదాన ప్రాంతంలో.. వైయస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ అనేది 77 గిరిజన మండలాల్లో అమలుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమం ద్వారా పౌష్టికాహారాన్ని అందించనున్నాం. గత ప్రభుత్వ హయాంలో గర్భిణీలు రక్తహీనతతో ఉన్నవారికే ఈ పథకం అమలులో ఉండేది. అలా కాకుండా సీఎం వైయస్‌ జగన్‌ ఆలోచన మేరకు.. పేదవారైతే చాలు ప్రతి ఒక్కరికీ వైయస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ, వైయస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ ప్లస్‌ ద్వారా గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలకు ఈ పథకం ద్వారా విటమిన్లు కలిగిన ఆహారం ఇవ్వడంతో పాటు సంపూర్ణ ఆరోగ్యానిచ్చే పౌష్టికాహారం అందించేందుకు రూ.1863 కోట్లు అయ్యే ఖర్చుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 

కోర్టు ఆదేశాల మేరకు ఇళ్ల పట్టాల జీఓలో మార్పు
ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలాలను ఇవ్వాలని సీఎం వైయస్‌ జగన్‌ తలపెట్టిన కార్యక్రమంలో గౌరవ హైకోర్టు ఆదేశాలను అనుసరించి జీఓలో మార్పులు చేయడం జరిగింది. ఇళ్లు కట్టిన ఐదు సంవత్సరాలు ఆ ఇంట్లో నివసించిన తరువాతే ఆ ఇళ్లు అమ్ముకునేందుకు అవకాశం కల్పిస్తూ.. మార్పు చేసిన 99 జీఓ నంబర్‌ను మంత్రిమండలి ఆమోదించింది. 

గ్రేహౌండ్స్‌ విభాగానికి తర్ఫీదు కోసం విశాఖలో 385 ఎకరాలు
నక్సల్స్‌ ఏరివేత, నిలువరింపజేసేందుకు అడవుల్లో ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యోగం చేస్తున్న గ్రేహౌండ్స్‌ విభాగానికి సంబంధించి వారికి తర్ఫీదు ఇవ్వడానికి  విశాఖలో 385 ఎకరాల్లో ట్రైనింగ్‌ సెంటర్‌ నిర్మించేందుకు భూమిని కేటాయించడం జరిగింది. 385 ఎకరాల ప్రభుత్వ భూమిపై ఆధారపడి జీవిస్తున్న పేదలందరికీ ఎటువంటి కాగితం ఆధారం లేకపోయినా కూడా వారందరినీ గుర్తించి రూ.10.88 కోట్ల పరిహారం చెల్లించేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 

కురుపాంలో ట్రైబల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ
విజయనగరం జిల్లా కురుపాం ప్రాంతంలో జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో ట్రైబల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీని స్థాపించేందుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీనికి సుమారు రూ.153 కోట్లు ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది. ఇది కాకినాడ జేఎన్టీయూ యాజమాన్యంలో నాల్గవ కాలేజీగా చేరబోతుంది. దీంట్లో 77 గిరిజన మండలాల్లోని నివసించే వారికి 50 శాతం, మిగిలిన 50 శాతం అందరికీ రిజర్వేషన్‌ అమలు చేయడం జరుగుతుంది. 

తిరుపతిలో తెలుగు, సంస్కృత అకాడమీ
ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యాశాఖ ద్వారా తెలుగు, సంస్కృత అకాడమీ సొసైటీ ఏర్పాటు చేయడానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. తిరుపతిలో స్థాపిస్తేనే బాగుంటుందని సీఎం వైయస్‌ జగన్‌ సూచన చేశారు. 

నాలుగు విడతల్లో తల్లుల చేతికే ఫీజురీయింబర్స్‌మెంట్‌
ఉన్నత చదువులతోనే పేదరికంలోంచి ప్రతి కుటుంబం బయటపడుతుందని గమనించిన వైయస్‌ జగన్‌ ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. జగనన్న విద్యా దీవెన ద్వారా సంపూర్ణ ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని అమలు చేశారు. 2018–19లో చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన రూ.1,291 కోట్ల బకాయిలను ఈ మధ్యనే చెల్లించారు. 2019–20 విద్యా సంవత్సరానికి గాను రూ.3786 కోట్లు.. మొత్తం రూ.5000 కోట్లు జగనన్న విద్యా దీవెన పథకానికి డబ్బులు చెల్లించడం జరిగింది. ఇది గతంలో సంవత్సరానికి ఒకసారి ఫీజురీయింబర్స్‌మెంట్‌ ఉండేదాన్ని నాలుగు విడతలుగా విద్యార్థుల తల్లుల అకౌంట్లలో జమ చేసేందుకు తీర్మానం చేయడం జరిగింది.

టీచింగ్‌.. నాన్‌టీచింగ్‌ పోస్టుల మంజూరుకు తీర్మానం
మచిలీపట్నం, గుంటూరు, శ్రీకాకుళం మూడు చోట్ల నర్సింగ్‌ కాలేజీలు ఉన్నాయి. ఇవి 2014కు ముందే స్థాపించినప్పటికీ దురదృష్టవశాత్తు గత ప్రభుత్వంలో ఒక్క పోస్టుకు కూడా మంజూరు లేక విద్యార్థులు విపరీతమైన ఇబ్బందులు పడుతున్నారు. ఈ మూడు నర్సింగ్‌ కాలేజీల్లో 282 టీచింగ్, నాన్‌టీచింగ్‌ పోస్టులను మంజూరు చేస్తూ.. ఏలూరు, ఒంగోలు, తిరుపతిలో ఉన్న నర్సింగ్‌ కాలేజీల్లో కూడా ఒక్క పోస్టు కూడా మంజూరు చేయకుండానే కాలేజీలు నడుస్తున్నాయి. ఈ మూడు కాలేజీలకు 144 టీచింగ్, నాన్‌టీచింగ్‌ పోస్టుల మంజూరుకు తీర్మానం చేయడం జరిగింది. 

10 వేల మెగా వాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్ల స్థాపన
వ్యవసాయానికి 9 గంటలు పగటిపూటే ఉచిత విద్యుత్‌ అందించేందుకు సీఎం హామీ ఇచ్చారు. కొన్ని జిల్లాల్లో 9 గంటల ఉచిత విద్యుత్‌ అమలు జరుగుతుంది. రాబోయే కొద్ది నెలల్లోనే రాష్ట్రమంతా వ్యవసాయానికి పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్‌ అమలు చేయనున్నాం. దీనికి సంబంధించి ప్రతి సంవత్సరం సుమారు రూ.8 వేల కోట్ల పైచిలుకు ప్రభుత్వంపై భారం పడుతోంది. ఈ భారాన్ని తగ్గించేందుకు సీఎం వైయస్‌ జగన్‌ ముందుచూపుతో సోలార్‌ పవర్‌ కార్పొరేషన్‌ ద్వారా ప్రభుత్వం తరుఫున 10 వేల మెగా వాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్ల స్థాపన కోసం కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 

నాలుగు దశల్లో రామాయపట్నం పోర్టు
రామయపట్నం పోర్టు నిర్మాణానికి రైట్స్‌ సంస్థ ద్వారా తయారు చేసిన డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌)ను రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. రైట్స్‌ సంస్థ ఇచ్చిన రిపోర్టు ప్రకారం పోర్టు నిర్మాణానికి రూ.3,736 కోట్లు ఖర్చు అవుతుందని, నాలుగు దశల్లో పోర్టు నిర్మాణానికి 802 ఎకరాలు అవసరం పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం స్వంతంగా రూ.200 కోట్లతో భూమి సేకరణ చేయడానికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 

గండికోట నిర్వాసితులకు పరిహారం
కడప జిల్లా గండికోట రిజర్వాయర్‌లో పూర్తి నీటి సామర్థ్యంతో (26.85 టీఎంసీల) నిల్వ చేయడానికి ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ చెల్లించాల్సి ఉంది. 7 గ్రామాలకు సంబంధించి పరిహారం చెల్లించేందుకు రూ.522.85 కోట్ల నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడం జరిగింది. అదే విధంగా వెలిగొండ ప్రాజెక్టులో ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ, భూసేకరణకు రూ.1411.56 కోట్లు మంజూరు చేయడం జరిగింది. 

‘ఏపీ స్టేట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌’ కొత్త డిపార్టుమెంట్‌కు ఆమోదం
రాష్ట్రంలో పన్నులు ఎగ్గొట్టే పరిస్థితులు ఎక్కడెక్కడున్నాయి. సేల్, సర్వీస్‌ ట్యాక్స్‌లను జీఎస్‌టీ కింద వచ్చే ట్యాక్స్‌ల ఫిల్ఫరైజేషన్‌ను అరికట్టేందుకు ఏపీ స్టేట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అనే కొత్త డిపార్టుమెంట్‌ను ఏర్పాటు చేయడం.. దాంట్లో 55 మంది అధికారులను నియమించుకునేందుకు అనుమతులు మంజూరు చేస్తే రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 

సన్నిధి గొల్లలకే వారసత్వ హక్కు కల్పిస్తూ తీర్మానం
తిరుమల తిరుపతి దేవస్థానంలో అనాదిగా వస్తున్న ఉదయం తలుపులు తెరిచే సన్నిధి గొల్లలకు ఉన్న హక్కును గత ప్రభుత్వం నిలిపివేసింది. టీటీడీలో ఆలయ తలుపులు తెరిచేందుకు సన్నిధి గొల్లల వంశస్థులకు వారసత్వ హక్కులు కల్పిస్తూ మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. 

ఇంటిగ్రేటెడ్‌ రెన్యువ‌ల్‌‌ ఎనర్జీ ప్రాజెక్టుకు ఆమోదం
ఇంటిగ్రేటెడ్‌ రెన్యువ‌ల్‌‌ ఎనర్జీ ప్రాజెక్టు (ఐఆర్‌ఈపీ) సమీకృతమైన సోలార్, విండ్, హైడెల్‌ మూడు కలిపి ఐఆర్‌ఈపీ కింద మెగా ఇండస్ట్రీయల్‌ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తూ.. దీంట్లో 550 మెగావాట్ల విండ్, 1000 మెగా వాట్ల సోలార్‌ పవర్, గరిష్టంగా 1680 మెగావాట్ల స్టాండెలోన్‌ పంపుడ్‌ స్టోరేజీ ద్వారా వచ్చే హైడెల్‌ పవర్‌.. ఈ మూడు కలిపి పవర్‌ జనరేషన్‌ కోసం గ్రీన్‌కో అనే సంస్థ దీన్ని ఏర్పాటు చేయబోతుంది. ఇందుకు గోరకల్లు రిజర్వాయర్‌ నుంచి 1 టీఎంసీ కేటాయిస్తూ.. నీటిని వాడుకునే అధికారం లేకుండా సర్క్యులేట్‌ చేయడం వరకే అనుమతి ఇస్తూ ఆమోదం తెలిపడం జరిగింది. 

అదే కంపెనీతో రూ.5 లక్షలకు ఎకరా భూమి కొనుగోలు
2019 ఫిబ్రవరిలో ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం గ్రీన్‌కో అనే సంస్థకు 4700 భూమిని ఎకరాకు రూ.2.50 లక్షలకు కేటాయించింది. బాధ్యత కలిగిన సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వం అదే ప్రాజెక్టును.. అదే కంపెనీతో ఎకరా రూ.5 లక్షలతో కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ఆ కంపెనీ ఆమోదం తెలిపింది. రివర్స్‌టెండరింగ్‌ ద్వారా రూ.2200 కోట్లు ఆదా చేసిన ఈ ప్రభుత్వం.. ఐఆర్‌ఈపీలో గత ప్రభుత్వం కంటే రెట్టింపు ఆదాయాన్ని చేకూర్చింది. అలాగే గ్రీన్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ చార్జ్‌ అనే కొత్త లెవీని ఏర్పాటు చేసి సంవత్సరానికి హీనపక్షంలో  రూ.32 కోట్లు ఆదనపు ఆదాయాన్ని ఈ ప్రాజెక్టు ద్వారా సమకూర్చేందుకు ప్రభుత్వం నిర్ణయం చేసింది. 

బోగాపురం ఎయిర్‌పోర్టులో 500 ఎకరాలు తిరిగి ప్రభుత్వానికి
బోగాపురం ఎయిర్‌పోర్టును గడిచిన ప్రభుత్వం కేటాయించిన కంపెనీ నిర్మాణం చేయబోతోంది. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం 2700 ఎకరాల భూమిని కేటాయించింది. ఇవాళ సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వం ఆ కంపెనీతో మాట్లాడి మరో 500 ఎకరాలను తగ్గించి 2200 ఎకరాల్లో మాత్రమే ఎయిర్‌పోర్టు నిర్మాణం చేపట్టాలని, నిర్మాణం పూర్తయిన తరువాత 500 ఎకరాలకు కమర్షియల్‌ వాల్యూ వస్తుంది కాబట్టి ఆ భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి కింద ఉంటుందని నీతివంతమైన ఆలోచన చేశారు. ప్రజా ప్రభుత్వంలో 500 ఎకరాల కమర్షియల్‌ ల్యాండ్‌ సమకూరడం జరిగింది. 

రూ.150 కోట్ల అవినీతి జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది
గత ప్రభుత్వంలో దోపిడీలు విపరీతంగా జరిగాయి. రాజధానిలో అక్రమాలు జరగాయంటే దమ్ముంటే అరెస్టులు చేయమని చంద్రబాబు అన్నాడు. రాజధాని భూముల అక్రమాలపై సిట్‌తో విచారణ చేయిస్తే కక్షసాధింపులు అంటున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అక్రమాలు చేసిన వారంతా అరెస్టులు అవుతున్నారు. ఇంకా విచారణ జరుగుతుంది. ఇదే క్రమంలో చంద్రన్న సంక్రాంతి కానుక, రంజాన్‌ తోఫా, క్రిస్మస్‌ కానుకలో జరిగిన అవకతవకలపై కేబినెట్‌ సబ్‌ కమిటీ విచారణ జరిపింది. వీటి టెండర్ల లోపాలు, కొనుగోళ్లలో రూ.150 కోట్ల అక్రమాలు జరిగినట్లుగా మంత్రివర్గ ఉపసంఘం ప్రాథమిక విచారణలో తేలింది. 

ఫైబర్‌ నెట్‌ అవకతవకలు సీబీఐ ఎంక్వైరీకి..
అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో చేపట్టిన ఫైబర్‌ నెట్‌ ప్రాజెక్టును చంద్రబాబుకు దగ్గరి మనిషి, ఈవీఎం కేసుల్లో ముద్దాయిగా ఉన్న వేమూరి హరికృష్ణకు బాధ్యతలు అప్పగించారు. ఫైబర్‌ నెట్‌ ప్రాజెక్టు నిర్మాణానికి టెరా సాఫ్ట్‌ కంపెనీ అర్హతలు లేకపోయినా అప్పగించడంలో అక్రమాలు చోటు చేసుకున్నాయి. పనుల మానిటరింగ్‌ చేయడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎల్‌1గా కోట్‌ చేస్తే తోసిపుచ్చి టెరా సాఫ్ట్‌ కంపెనీకి అప్పగించారు. సెట్‌ఆఫ్‌ బాక్సుల సప్లయ్‌ బాధ్యతలు టెండర్‌ రూల్స్‌కు విరుద్ధంగా నాలుగు కంపెనీలకు ఇచ్చి.. ఉద్దేశ్యపూర్వకంగా అందులో టెరా సాఫ్ట్‌ కంపెనీ బాక్సులు మాత్రమే తీసుకొని.. టెరా సాఫ్ట్‌ బాగుపడేట్లుగా తద్వారా దాంట్లో గత మంత్రులు, ముఖ్యమంత్రి, వేమూరి హరికృష్ణ లబ్ధిపొందారని నిర్ధారణ అయ్యింది. రూ.200 కోట్ల అవినీతి జరిగిందని కేబినెట్‌ సబ్‌ కమిటీ విచారణలో తేలింది. దీన్ని సీబీఐ విచారణకు ఇస్తూ.. రాష్ట్ర మంత్రి మండలి తీర్మానం చేయడం జరిగింది. 

 

Back to Top