దేశాన్ని ఆక‌ర్షించేలా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న‌

పంచాయతీ రాజ్‌ చట్టంలో మార్పులకు కేబినెట్‌ ఆమోదం

ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రవర్తిస్తే అనర్హత వేటు, జైలుశిక్ష

ట్రైబల్‌ ఏరియాల్లో ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్‌ పదవులు గిరిజనులకే..

స్థానిక సంస్థ‌లు, మున్సిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌చార గ‌డువు త‌గ్గింపు

అగ్రికల్చర్‌ కౌన్సిల్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం

గ్రీన్‌ ఎనర్జీ కార్పోరేషన్‌ లిమిటెడ్‌ ఏర్పాటుకు నిర్ణయించాం

పండ్ల తోట‌ల‌ న‌ష్ట‌ప‌రిహారం పెంపున‌కు ఆమోదం 

కేబినెట్‌ భేటీ అంశాలను వివరించిన సమాచార శాఖ మంత్రి పేర్ని నాని

సచివాలయం: పేదల ప్రజల సంక్షేమం కోసం వైయస్‌ జగన్‌ ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటుందని సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని చెప్పారు. పేదవాడికి ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన, ప్రతి పేదవాడికి ఇంటి స్థలం ఇవ్వాలనే ఇలాంటి అనేక రకాల విప్లవాత్మక నిర్ణయాల్లో భాగంగానే పంచాయతీ రాజ్‌ చట్టంలోని ఎన్నికల ప్రక్రియలో కూడా భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు మన రాష్ట్రంవైపు చూసేలా  ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అధ్యక్షత జరిగిన కేబినెట్‌ భేటీ ముగిసిన అనంతరం మంత్రి పేర్ని నాని విలేకరుల సమావేశం నిర్వహించారు. కేబినెట్‌ భేటీలో చర్చించిన అంశాలను మీడియాకు వివరించారు. 

‘పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో ఎవరైనా ఎన్నికల నియమావళికి విరుద్ధంగా అక్రమాలకు పాల్పడితే గరిష్టంగా మూడు నుంచి 6 మాసాల శిక్ష మాత్రమే ఉండేది.  రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాధికారానికి లోబడి స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ స్థాయి నుంచి సంస్కరణలు తీసుకురావాలనే ఉద్దేశంతో ఎన్నికల నియమావళికి విరుద్ధంగా అవినీతికి, అక్రమాలకు పాల్పడి ఆధారాలతో పట్టుబడితే ఆ అభ్యర్థులపై అనర్హత వేటు మాత్రమే కాకుండా శిక్ష గరిష్టంగా మూడు సంవత్సరాలు ఉంటుంది. 

ఎన్నికల్లో ధన ప్రభావాన్ని, అక్రమాలను తగ్గించేందుకు నోటిఫికేషన్‌ ఇచ్చిన నాటి నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు 15 రోజులు, సర్పంచ్‌ ఎన్నికలకు 13 రోజుల్లో ప్రక్రియ పూర్తయ్యే విధంగా చట్టంలో మార్పుకు కేబినెట్‌ ఆమోదించింది. పంచాయతీ ఎన్నికల ప్రచారం 5 రోజులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిలకు 7 రోజుల ప్రచార సమయం ఉండేలా నిర్ణయం తీసుకోవడం జరిగింది. 

గిరిజన ప్రాంతాలుగా నోటిఫై చేయబడిన ప్రాంతాల్లో వార్డు మెంబర్లు, ఎంపీటీసీలుగా ఎవరైనా ఉండవచ్చు. ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్‌ పదవులను గిరిజనులకే రిజర్వ్‌ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. 

స్థానిక పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా పారిశుద్ధ్యం, పచ్చదనం బాధ్యతలను సర్పంచ్‌లకే అప్పగిస్తూ.. అదే విధంగా సర్పంచ్‌ స్థానికంగా నివాసం ఉండేలా నియమం పెట్టాం. ఊరు వదిలి ఉంటూ రిమోట్‌ పరిపాలన చేయడం ధర్మం కాదని ప్రభుత్వం నిర్ణయించింది. నిత్యం పంచాయతీ ఆఫీస్‌లో అందుబాటులో ఉండాలని తప్పనిసరి చేశాం. 

ప్రకృతి వైపరీత్యాలు, తీవ్ర నీటి ఎద్దడి సంభవించినప్పుడు పంచాయతీ తీర్మానానికి అవసరం లేకుండా సర్పంచ్‌ ముందస్తుగా అధికారులకు ఆదేశాలు జారీ చేసే అధికారం ఇవ్వడం జరిగింది. 

పంచాయతీ ఎన్నికల నియమావళినే మున్సిపల్‌ ఎన్నికలకు కూడా వర్తిస్తాయి. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రవర్తిస్తే.. అనర్హత వేటు వేయబడుతుంది. ఎన్నిక ప్రక్రియ పూర్తయినా.. నేరం రుజువు అయితే అతడి ఎన్నికను రద్దు చేయడం జరుగుతుంది. అలాగే మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ నుంచి పోలింగ్‌ వరకు 15 రోజులకు తగ్గిస్తూ తీర్మానం చేయడం జరిగింది. 

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ అనే నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ను ఆర్థిక శాఖ ఏర్పాటు చేసుకోవడానికి మంత్రి మండలి ఆమోదించింది. ప్రభుత్వంలోని ఏ శాఖ దగ్గరైనా డబ్బులు ఉన్నప్పుడు ఆ డబ్బును ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌లో జమ చేసుకొని బ్యాంకుల మాదిరిగా వడ్డీ కూడా పొందవచ్చు. దీనికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 

అలాగే ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ అగ్రికల్చర్‌ కౌన్సిల్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రభుత్వం, ప్రభుత్వహేతర వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన కళాశాలల్లో, హార్టికల్చర్‌ యూనివర్సిటీల్లో, వాటి పరిధిలోని కాలేజీల్లో ఉత్తమ పద్ధతుల్లో విద్యా అందించడం, లేదా విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, విద్యా బోధన సక్రమంగా ఉందా లేదా.. అనే దానికి మానిటరింగ్‌ చేయడానికి, నాణ్యమైన వ్యవసాయ విద్యను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ అగ్రికల్చర్‌ కౌన్సిల్‌ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాం. 

రైతులకు ఉచితంగా విద్యుత్‌ అందించేందుకు, రూ.8000 కోట్ల పైచిలుకు ప్రతి సంవత్సరం సబ్సిడీ అందించాల్సిన అవసరం ఉంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌లకు కరెంట్‌ బిల్లులు సుమారు రూ.1500 కోట్లు ప్రభుత్వం భరించాల్సి వస్తుంది. ఇదంతా.. ఏళ్ల తరబడి చూస్తుంటే ప్రతి సంవత్సరం వ్యవసాయ పంపుసెట్లు 50 వేల నుంచి లక్ష పంపుసెట్లు కొత్తగా ఉచిత విద్యుత్‌ కింద చేరుతూ వస్తున్నాయి. రైతులు పెరుగుతున్నారు.. కొత్తగా రైతులు మోటార్లు బిగించుకుంటున్నారు. ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీ రోజు రోజుకు పెరుగుతుంది. కానీ, ప్రభుత్వాలు రూ. 3–4 వేల కోట్లు మించి పవర్‌ కంపెనీలకు చెల్లించడం లేదు. మిగతాదంతా.. విద్యుత్‌ రంగ కంపెనీలపై భారం మోపడం వల్ల విద్యుత్‌ కంపెనీలు రూ.32 వేల కోట్ల అప్పుల్లో ఉన్నాయి. గత ప్రభుత్వాలు సక్రమంగా చెల్లించకపోవడంతో ప్రభుత్వాల బాధ్యతను డిస్కం, జెన్‌కో మీద నెట్టివేయడం ద్వారా పవర్‌ కంపెనీలు రూ.32 వేల కోట్ల అప్పుల్లో ఉన్నాయి. అందుకే సీఎం వైయస్‌ జగన్‌ ప్రస్తుతం వ్యవసాయ అవసరాలకు ఉన్న 45 వేల మిలియన్‌ యూనిట్లు డిమాండ్‌ ఉన్న పవర్‌ను మీట్‌ అయ్యేందుకు, కంపెనీలు అప్పుల్లో మునిగిపోకుండా ఉండేందుకు 10 వేల మెగావాట్ల పవర్‌ను సొంతంగా ప్రభుత్వమే ఏర్పాటు చేసుకునేందుకు జెన్‌కో ఆస్తిగా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్‌ గ్రీన్‌ ఎనర్జీ కార్పోరేషన్‌ లిమిటెడ్‌ అనే ఒక కంపెనీని ఏర్పాటు చేయించి జెన్‌కోకు సంపూర్ణ యాజమాన్య హక్కులను ఉండేట్లుగా నిర్ణయించాం. 

సౌర విద్యుత్‌ ద్వారా వచ్చే కరెంటు అంతా పగటి పూట మాత్రమే వస్తుంది. సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వం వ్యవసాయానికి పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తామని చెప్పింది కాబట్టి దాన్ని ఈ రోజుకూ అమలు చేస్తూనే ఉన్నాం. ఇవాళ సౌర విద్యుత్‌ ద్వారా రైతుల డిమాండ్‌ను మీట్‌ అవ్వడానికి కరెంట్‌ కంపెనీలు, డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీలు, జెన్‌కో మునిగిపోకుండా ఉండేందుకు.. భవిష్యత్‌ తరాలకు పెద్ద ఆదాయాన్ని ఇచ్చే ఆస్తిని ఏర్పాటు చేయడం కోసం 10 వేల మెగావాట్ల సామర్థ్యం గల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేందుకు గ్రీన్‌ ఎనర్జీ కార్పోరేషన్‌ లిమిటెడ్‌ ఏర్పాటుకు నిర్ణయించాం. ప్రాజెక్టు ఏర్పాటుకు ఒక్క మెగావాట్‌కు కేంద్రం రూ.20 లక్షల సబ్సిడీ ఇస్తుంది. దాన్ని కూడా వాడుకోవాలనే ఆలోచన చేశాం. 10 వేల మెగావాట్ల ప్రాజెక్టుకు మొత్తం కలిసి రూ. 35 నుంచి 40 వేల కోట్లు అవుతుంది. 

భూసేకరణలో ఇప్పటి వరకు పండ్లు, పూల తోటలకు ఇచ్చే నష్టపరిహారాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం. మామిడి చెట్టుకు గతంలో ఉన్న రూ. 2600 పెంచుతూ రూ.7283 గానూ, కొబ్బరికి రూ.2149 నుంచి రూ.6090, నిమ్మకు రూ.1444 నుంచి రూ.3210  గానూ ప్రతి పండ్ల చెట్లకు, పూల చెట్లకు నష్టపరిహారాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం. దీంట్లో మూడు రకాలు ఉన్నాయి.. తోట నాణ్యంగా పెంచుతూ ఉంటే వందశాతం, పోషణ సరిగ్గా లేకుండా ఉంటే 80 శాతం, తోటను పట్టించుకోకుండా ఉంటే దానికి 60 శాతం ఇవ్వాలని కమిటీ సూచన మేరకు అందిస్తాం’ అని మంత్రి పేర్ని నాని చెప్పారు. 
 

Back to Top