గుంటూరు: కూటమి ప్రభుత్వం అంజుమాన్ ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలకు నిరసనగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో భారీ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి సేకరించిన సంతకాలతో కూడిన పత్రాలను జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. గుంటూరు నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్ షేక్ నూరి ఫాతిమా ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో కులాలు, మతాలకు అతీతంగా ఐక్యతను చాటుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు నల్ల దుస్తులు ధరించి కలెక్టర్ కార్యాలయం వరకు కదంతొక్కారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, ఆంజుమన్ ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వ చర్యలు మైనారిటీల హక్కులను హరించేలా ఉన్నాయని, ఈ అన్యాయంపై ప్రజలతో కలిసి వైయస్ఆర్‌సీపీ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని నాయకులు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో కర్నూలు మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర మైనారిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ హఫీజ్ ఖాన్, మంగళగిరి ఇన్‌చార్జ్ వేమారెడ్డి, తాడికొండ ఇన్‌చార్జ్ బాల వజ్రబాబు, మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ ఖాదర్ బాషా, తెనాలి–ప్రత్తిపాడు అబ్జర్వర్ గులాం రసూల్‌తో పాటు జిల్లా, నగర, నియోజకవర్గాల మైనారిటీ నాయకులు, కార్పొరేటర్లు, మహిళా నేతలు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.