తాడేపల్లి: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆక్వా, నాన్ ఆక్వా జోన్ పరిధితో సంబంధం లేకుండా రైతులకు యూనిట్ రూపాయిన్నరకే కరెంట్ ఇవ్వాలని, నెలాఖరులోపు హామీని నెరవేర్చకపోతే వైయస్ఆర్‌సీపీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని వైయస్ఆర్‌సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త, ఆక్వా కల్చర్ డెవలప్‌మెంట్ బోర్డు మాజీ చైర్మన్ వడ్డి రఘురాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆక్వారంగం పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని, 20 నెలలవుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని చెప్పారు. దళారీల దోపిడీతో ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన మండిపడ్డారు. గతంలో సోయా రేట్లు పతనమైనప్పుడు ఫీడ్ ధరలు తగ్గించకపోతే వైయస్ జగన్ హెచ్చరికతో తగ్గించారని, కానీ ఇప్పుడు సోయా రేట్లు పెరిగితే మాత్రం ఎవర్నీ సంప్రదించకుండానే గతంలో తగ్గించిన రూ.4 ల ఫీడ్ ధర పెంచేశారని చెప్పారు. అమెరికా సుంకాల పేరుతో రొయ్యల ధరలు తగ్గిస్తే, ఇప్పుడు అమెరికా సుంకాలు 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గించిన రొయ్యల ధరలు పెంచలేదని విమర్శించారు. నాడు వైయస్ఆర్‌సీపీ హయాంలో రైతులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటే నేడు కూటమి ప్రభుత్వంలో దళారుల రాజ్యమే నడుస్తోందని మండిపడ్డారు. లడ్డూ విషయంలో ఎవరూ మాట్లాడవద్దని సుప్రీంకోర్టు చెప్పినా అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించి మరీ కూటమి నాయకులు దుష్ప్రపచారం చేస్తున్నారని వడ్డి రఘురాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... వైయస్ఆర్‌సీపీ హయాంలో ఆక్వారంగానికి మేలు వైయస్ఆర్‌సీపీ హయాంలో రొయ్య ఫీడ్, సీడ్, ధరల హెచ్చుతగ్గులు, ఎగుమతులు.. వంటి ప్రతిదీ రైతుల ప్రభుత్వ భాగస్వామ్యంతో జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆక్వా రంగాన్ని దళారుల చేతుల్లో పెట్టేసి రైతులను పూర్తిగా గాలికొదిలేసింది. కల్తీ సీడ్ కారణంగా రైతులు నష్టపోతే గతంలో వైయస్ జగన్ నేతృత్వంలోని వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం దగ్గరుండి ఆదుకుంది. వైయస్ఆర్‌సీపీ హయాంలోనే 3.51 లక్షల ఎకరాలను ఆక్వా జోన్ పరిధిలోకి తీసుకొచ్చి పదెకరాలున్న రైతులకు కూడా రూపాయిన్నర సబ్సిడీతో యూనిట్ విద్యుత్ అందజేయడం జరిగింది. మొత్తం 64 వేల కనెక్షన్లు ఉంటే అందులో 50,800 కనెక్షన్లను ఆక్వాజోన్ పరిధిలోకి తెచ్చి, ఐదేళ్లలో సుమారు రూ. 3,640 కోట్ల మేర రైతులకు మేలు చేయడం జరిగింది. ఆక్వా కల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ ద్వారా ఐదేళ్లలో 22 సార్లు ఆక్వా రైతులతో మీటింగ్‌లు పెట్టి ఎప్పటికప్పుడు వారి ఇబ్బందులపై సమీక్షించడం జరిగింది. ఎగుమతుల మీద మాత్రమే ఆధారపడకుండా స్థానికంగా మార్కెట్ పెంచడం కోసం ఫిష్ ఆంధ్రా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 2014-19 మధ్య గత టీడీపీ హయాంలో స్థానిక వినియోగంతో పోల్చితే 2019-24 మధ్య వైయస్ఆర్‌సీపీ హయాంలో మెరైన్ ఫిష్ వినియోగం 40 నుంచి 50 వేల టన్నులకు తీసుకెళ్లాం. గతంలో 80-90 వేల ఎకరాలుగా ఉన్న ఆక్వాజోన్ పరిధిని 4.22 లక్షల ఎకరాలకు పెంచాం. అమెరికా సుంకాలు తగ్గించినా... కూటమి ప్రభుత్వ విధానాల కారణంగా ఆక్వా రంగం మీద ఆధారపడి జీవిస్తున్న 30 లక్షల మంది జీవితాలు రోడ్డున పడ్డాయి. ఎన్నికలప్పుడు ఆక్వాజోన్ నాన్ ఆక్వాజోన్ పరిధితో సంబంధం లేకుండా ఎన్ని ఎకరాలున్నా యూనిట్‌కి రూపాయిన్నరకే విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చి 20 నెలలైనా పట్టించుకున్నపాపాన పోలేదు. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుండటంతో కొత్తగా రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని వేధిస్తున్నారు. రెండేళ్లవుతున్నా కూటమి ప్రభుత్వం రైతుకి రూపాయిన్నర విద్యుత్ సబ్సిడీయే ఇవ్వలేకపోయింది. ఆర్నెళ్ల క్రితం సోయా ధరలు భారీగా పడిపోయినా ప్రభుత్వం మాత్రం ఫీడ్ ధరలు తగ్గించలేదు. వైయస్ జగన్ గారు రైతుల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతో రూ.4 లు తగ్గించి చేతులు దులిపేసుకున్నారు. కేజీకి కనీసం రూ. 25 లు తగ్గించాల్సి ఉంటే కేవలం రూ. 4 లే తగ్గించారు. అమెరికా సుంకాలు పెంచిందనే కారణం చూపించి రొయ్యల ధరలు తగ్గించి గోడౌన్లలో స్టోర్ చేసుకుని తర్వాత ఎక్కువ ధరకు అమ్మేసుకున్నారు. ఇప్పుడు సోయా ధరలు పెరిగాయన్న కారణం చూపించి ఆ తగ్గించిన రూ.4 లు ఇప్పుడు మళ్లీ పెంచేశారు. అమెరికా ప్రస్తుతం సుంకాలు 18% తగ్గించినా ఆ మేరకు ధరలు పెంచకుండా రొయ్యలు సాగుచేసే రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఈ నెలాఖరులోపు ఆక్వా రైతులకు యూనిట్‌కి రూపాయిన్నర సబ్సిడీ ఇవ్వకపోతే వైయస్ఆర్‌సీపీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. ఆక్వా రైతులకు వైయస్ఆర్‌సీపీ అండగా ఉంటుంది. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించి లడ్డూపై దుష్ప్రచారం లడ్డూలో కల్తీ జరిగింది అంటూ తిరుమల శ్రీవారి ప్రతిష్టకు భంగం కలిగించేలా రాష్ట్ర వ్యాప్తంగా వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి దేవుడితో కూటమి నాయకులు ఆటలాడుకుంటున్నారు. సిట్ దర్యాప్తులో జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టంగా చెప్పినా తాము చేసిన ప్రచారమే నిజమని నమ్మించడానికి దేవుడిని రాజకీయాల్లోకి లాగుతున్నారు. లడ్డూ గురించి మాట్లాడొద్దని, దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం బేఖాతర్ చేస్తున్నారు. జంతువుల కొవ్వు కలవలేదని సిట్ నివేదిక ఇచ్చినా రాజకీయ లబ్ధి కోసం తిరుమలపై దుష్ప్రచారం చేస్తున్న చంద్రబాబు.. తన కుటుంబానికే చెందిన హెరిటేజ్ ఫుడ్స్‌లో జరుగుతున్న అక్రమాల గురించి దాచి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. హెరిటేజ్ డెయిరీ సంస్థపై కేంద్ర సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ చర్యలు తీసుకుంది. హెరిటేజ్ విక్రయిస్తున్న పెరుగులో కనీసంగా ఉండాల్సిన మిల్క్ ఫ్యాట్ శాతం లేదని పరీక్షల్లో తేలింది. ఆహార భద్రత ప్రమాణాలను పాటించడంలేదని తేలింది. బోలేబాబా డెయిరీకి 2018లో చంద్రబాబు ప్రభుత్వం అనుమతులిచ్చి ఇప్పుడు ఆ నెపాన్ని వైయస్ఆర్‌సీపీ మీదకు నెట్టడం సిగ్గుచేటు. అంబటి రాంబాబు మీద దాడులు చేసిన కూటమి నాయకులు.. వైయస్ జగన్ గురించి మాట్లాడిన బూతులకు క్షమాపణలు చెప్పరా?