తాడేపల్లి: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఇవాళ గుంటూరు కోర్టు బెయిల్ ఇవ్వడాన్ని, పోలీసుల కస్టడీ పిటిషన్ ను తోసిపుచ్చడాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, పార్టీ లీగల్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ జల్లా సుదర్శన్ రెడ్డి స్వాగతించారు. అంబటిపై కక్షసాధింపులకు దిగిన ప్రభుత్వ తీరుకు ఇది చెంపపెట్టు అని వారు తెలిపారు. అంబటి మాట్లాడిన ఒక్క మాటకు 36 కేసులు పెట్టడం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు విరుద్దమన్నారు. ఈ వ్యవహారంలో అంబటి రాంబాబును ఇబ్బందిపెట్టిన ఎవరినీ వదిలిపెట్టబోమని వెల్లడించారు. ప్రెస్ మీట్ లో ఇంకా ఏమన్నారంటే.. ● పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అనాగరిక పాలన జరుగుతోంది. ఇంత అరాచకం జరుగుతున్నా అడ్డుకట్ట వేయలేకపోతున్నామని అనుకుంటున్న పరిస్ధితుల్లో అంబటి రాంబాబు కేసులో మేం చెప్పిందే నిజమైంది. లోపల ఉండాల్సిన వారు బయట ఉన్నారు, బయట ఉన్నవారు లోపల ఉన్నారని గతంలో చెప్పాం. ఇప్పుడు అదే విషయాన్ని కోర్టులు కూడా అంగీకరించి అంబటి రాంబాబుకు బెయిల్ ఇచ్చాయి. పోలీసుల కస్టడీ పిటిషన్ ను తోసిపుచ్చాయి. కేంద్రమంత్రి పెమ్మసాని ప్రోద్బలంతో, ఎమ్మెల్యే గళ్లా మాధవి, ఆమె భర్త తమ వందలాది అనుచరులతో చేసిన అరాచకానికి కోర్టుల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. - ఒక్క వ్యాఖ్య చేసినందుకు 36 కేసులా ? అంబటి రాంబాబు ఇల్లు ధ్వంసం చేస్తుంటే ప్రేక్షక పాత్ర పోషించిన పోలీసుల పాలన ఎక్కడైనా ఉంటుందా ? తొమ్మిది గంటల పాటు గుంటూరు నడిబొడ్డున అంబటి ఇంట్లో విధ్వంసం జరుగుతుంటే పోలీసులు నిద్రపోతున్నారా ? కేవలం నలుగురిని పంపి ఊరుకుంటారా ?, ఇమ్రాన్ ప్రతాప్ గడి కేసులో సుప్రీంకోర్టు ప్రాధమిక దర్యాప్తు లేకుండా ఎఫ్ఐఆర్ కట్టొద్దని చెప్పిన విషయాన్ని మేం వాదించినా కోర్టు అంగీకరించకుండా రిమాండ్ కు పంపారు. ఆ తర్వాత ఎక్కడా లేని విధంగా రెండు రోజుల్లో అంబటి రాంబాబుపై 36 కేసులు నమోదు చేశారు. ఇందులో వాళ్ల రాక్షసత్వం, ఒక వ్యక్తిమీద కక్ష, పగ కనిపిస్తున్నాయి. నల్లపాడు పీఎస్ లో నమోదు చేసిన కేసులో ఒక్క నేరాన్ని ఆధారంగా చేసుకుని ఈ 36 కేసులు పెట్టారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్ లు 2022లో ఇచ్చిన తీర్పు ప్రకారం ఓ కాగ్నిజబుల్ అఫెన్స్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే.. ఇక ఎక్కడా అలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయొద్దని చెప్పింది. ఈ ఫిర్యాదులపై ఎఫ్ఐఆర్ ను నమోదు చేయకుండా ఫిర్యాదుదారుల్ని సాక్షులుగా పేర్కొనవచ్చని చెప్పింది. టీటీ ఆంథోనీ కేసులోనూ ఆర్టికల్ 141 ప్రకారం సుప్రీంకోర్టు.. ఓ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత అదే కేసులో మరో ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడదని చెప్పినా ఆ తీర్పును గాలికొదిలేసి, రాష్ట్రంలో అమలు చేయడం లేదు. ఈ ప్రభుత్వం ఆర్టికల్ 141, సుప్రీంకోర్టు తీర్పుల్ని లెక్కచేయట్లేదు. అయినా ఈ అరాచకాల్ని, రాష్ట్ర ప్రేరేపిత ఉగ్రవాదాన్నీ ఎదుర్కొంటాం. ప్రతీ వైయస్ఆర్‌సీపీ కార్యకర్త చివరి రక్తపు బొట్టు వరకూ పోరాడతారు. - అంబటి కేసులో ఎవర్నీ వదిలిపెట్టం అంబటి రాంబాబు ఇల్లు, కార్లు తగులబెట్టి, ఆయనపై హత్యాయత్నంచేస్తే పెట్టాల్సిన సెక్షన్లు పెట్టకుండా, బెయిలబుల్ నేరం కింద పెట్టి, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేస్తారా ? సీఆర్పీసీ 210 ప్రకారం దర్యాప్తు చేసే హక్కు మీకుంటే.. మాకూ ప్రైవేటు ఫిర్యాదు చేసే హక్కుంటుంది. మీరు సరైన సెక్షన్లు పెట్టకపోతే,మేము ప్రైవేటు ఫిర్యాదు ఇస్తాం, మీరు వదిలేసిన వారిని ముద్దాయిలుగా నిలబెడతాం, చట్టప్రకారం పోరాడతాం. న్యాయస్థానాలే లేకపోతే సామాన్యుడిని రాచి రంపాన పెట్టి వీళ్లు బూటుకాలితో నలిపేస్తారు. కాబట్టి న్యాయవ్యవస్ధకు హ్యాట్సాఫ్ చెబుతున్నాం. పోలీసు వ్యవస్థ చట్టాల్ని గాలికొదిలేసి అధికార పార్టీ కొమ్ము కాయడం ఇక్కడే చూస్తున్నాం. ఇరాన్ లో రివల్యూషనరీ గార్డ్స్ ఖమేనీకి మాత్రమే బద్దులు, ప్రజలకు కాదు. ఇక్కడ కూడా పోలీసులు పాలకులకు మాత్రమే బద్దులై, మిగతా వారిని లెక్కచేయడం లేదు. మీ తాబేదారుల సాయంతో 36 కేసుల్ని పెట్టించాలంటే జుబేర్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును పూర్తిగా ఉల్లంఘించారు. అంబటిపై నల్లపాడు పీఎస్ లో నమోదు చేసిన కేసులో బెయిల్ ఇస్తూ,పోలీసుల కస్టడీ పిటిషన్ తిరస్కరిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పు మాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. రాష్ట్రంలో జంగిల్ రాజ్ కావాలా, జగన్ రాజ్ కావాలా ప్రజలే నిర్ణయించుకోవాలి. ● వైయస్ఆర్‌సీపీ లీగల్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ జల్లా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. ఇవాళ హైకోర్టు చారిత్రాత్మకమైన తీర్పునిచ్చింది. గత 20 రోజులుగా ప్రభుత్వం ఏం చేసిందో అంతా చూశారు. పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని మందీ మార్బలంతో అంబటి రాంబాబు ఇంటి మీదకు వెళ్లి దౌర్జన్యం చేశారు. ఎమ్మెల్యేలు పంపిన జనం దశల వారీగా అంబటి ఇంటికి వెళ్లి విధ్వంసం సృష్టించారు. అధికారంలో ఉన్న వాళ్లకు ఓ న్యాయం, విపక్షంలో ఉన్న వారికి మరో న్యాయం. రాష్ట్రమంతా ఇదే పరిస్ధితి. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఓ వ్యవస్థను తయారు చేసుకుని విపక్ష నాయకులపై దాడులు చేయిస్తున్నారు. ఒక్క ఘటనకు 36 తప్పుడు కేసులు పెట్టించడమే ఇందుకు నిదర్శనం. రాష్ట్రంలోని 10 కోర్టుల్లో పీటీ వారెంట్లు వేశారు. కోర్టుకు సెలవు ఉన్నా మెజిస్ట్రేట్ల ఇళ్లకు వెళ్లి పీటీ వారెంట్లు తీసుకున్నారు. ఈ అన్ని కేసుల్లో రిమాండ్ చేస్తే ఆరు నెలలో, ఏడాదో అంబటిని జైల్లో ఉంచాలని కుట్ర పన్నారు. ఒకే విషయం మీద 36 కేసులు పెట్టొచ్చా లేదా అనేది హోంమంత్రికి పరిజ్ఞానం లేదా ? అని జల్లా సుదర్శన్ రెడ్డి ప్రశ్నించారు.