సభలో ఈలలేసేంత గాలితనమా..?

ప్రజలు సభకు పంపింది ఈలలు వేసేందుకేనా.. మీరు ఎమ్మెల్యేలేనా..?

సభ హుందాగా నడపడానికే టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌

సమాచార, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని

 అసెంబ్లీ: శాసనసభలో తెలుగుదేశం పార్టీ సభ్యుల ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నామని, సభలో ఈలలు వేసేంత గాలితనమా.. మీరు శాసనసభ్యులేనా..? అని సమాచార, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మంత్రి పేర్ని నాని మాట్లాడారు. ప్రజలు శాసనసభ్యులుగా అవకాశం ఇచ్చి ప్రజాస్వామ్యానికి దేవాలయమైన అసెంబ్లీకి పంపించినప్పుడు హుందాగా వ్యవహరించాలనే బాధ్యత కూడా లేదా అని టీడీపీ సభ్యులను నిలదీశారు. సభలో విజిల్స్‌ వేసి టీడీపీ సభ్యులు గాలిగా ప్రవర్తించారని, వారి పద్ధతులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సభ సజావుగా నడిపించాలనే ఉద్దేశంతోనే ఘర్షణ చేస్తున్న టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేయడం జరిగిందన్నారు. సభలో ఈలలు వేసి.. బయటకు వచ్చి బొంకడం టీడీపీకే చెల్లుతుందన్నారు. భగవంతుడు కూడా కాపాడలేని స్థితిలో టీడీపీ సభ్యుల తీరు ఉందన్నారు. 

 తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి, శాసనసభలో నిస్సిగ్గుగా మేము ఈలలు వేశాము, అల్లరి చేశాం.. అని చెప్పే పరిస్థితి ఉందంటే... ఇంతకన్నా బరితెగింపు, ఇంతకన్నా గాలితనం ఎక్కడకైనా కనిపిస్తుందా..?

 వీళ్ళు అసలు శాసనసభ్యులేనా..? ఎమ్మెల్యేలుగా ఉన్న వారికి హుందాతనం ఉండొద్దా..? శాసనసభను ఏం చేద్దామని వీరు అసెంబ్లీకి వచ్చారు...?. ప్రజల్లో గెలవక ముందు మీలో ఎంత గాలితనం అయినా ఉండవచ్చు. ఒక్కసారి ప్రజల చేత ఓట్లు వేయించుకుని గెలిచి, చట్ట సభల్లోకి అడుగు పెట్టాక,  మీకు గతంలో ఎన్ని అవలక్షణాలు ఉన్నా చట్ట సభల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది. 

 ప్రజాస్వామ్యానికి దేవాలయమైన పవిత్రమైన అసెంబ్లీకి మీరు ఎమ్మెల్యేలుగా, రెండు లక్షల మంది ప్రజలకు ప్రతినిధులుగా ఇక్కడకు వచ్చినప్పుడు..  సభను దిగజార్చే ప్రయత్నం చేస్తే.. మీ నియోజకవర్గాల ప్రజలు మీ గురించి ఏమనుకుంటారో అన్న ఇంగిత జ్ఞానం కూడా ఉండక్కర్లేదా... ? శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యేల వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా వారు బుద్ధి మార్చుకోవాలి. 

 తమను రోజూ సస్పెండ్ చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. శాసనసభలో మీ అల్లరి చిల్లర రాజకీయాన్ని, మీ గాలితనాన్ని భరించలేక, గత్యంతరం లేకే... సభా నిర్వాహణ కోసమే మిమ్మల్ని బయటకు పంపిస్తుంటే.. అయినా, మీ వ్యవహార శైలిని మార్చుకోకుండా, బయటకు వచ్చి కూడా అదే గాలితనంగా మాట్లాడటం, బొంకడం టీడీపీ ఎమ్మెల్యేలకే చెల్లింది.

 
 కొత్తపల్లి సుబ్బారాయుడు నరసాపురం ఎమ్మెల్యేని గెలిపించి తప్పు చేశామని మాట్లాడటం, చెప్పుతో కొట్టుకోవడం లాంటి చర్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. 

 బాధ్యతాయుతమైన పదవులు ఎన్నో చేసి, ప్రజా జీవితంలో సుదీర్ఘకాలం పనిచేసిన కొత్తపల్లి సుబ్బారాయుడు, ఏ రకంగా ప్రవర్తించాలో, ఏం మాట్లాడాలో కూడా తెలియని వ్యక్తిలా మాట్లాడి, ఆయన విలువని ఆయనే తగ్గించుకున్నారు.

నరసాపురానికి జిల్లా కేంద్రంగా భీమవరాన్ని ప్రభుత్వం ప్రకటించింది. దానికీ, నరసాపురం ఎమ్మెల్యేకు ఏం సంబంధం..?.  భీమవరం అనేది... నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు అందుబాటులో ఉంటుందని, దాన్ని ఎంపిక చేయడం జరిగింది.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top