మార్షల్స్‌పై దాడి చేసిన వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలి

రవాణా శాఖ మంత్రి పేర్ని నాని డిమాండ్‌
 

 

అసెంబ్లీ: మార్షల్స్‌పై దాడికి దిగిన టీడీపీ సభ్యులపై తక్షణమే క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని డిమాండ్‌ చేశారు. అసెంబ్లీలో శీతాకాల సమావేశాలు ఐదో రోజు ప్రారంభమయ్యాయి. సభలో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. నిన్న సభా ప్రారంభం అవుతూనే స్పీకర్‌ చైర్‌ మీదకు దాడికి అన్నట్లుగా ప్రతిపక్షం ప్రవర్తించింది. ఇంతకంటే ఘోరంగా అసెంబ్లీ ప్రాంగణంలో దౌర్జన్యంగా అధికారుల మీద బాధ్యత గల సభ సభ్యులుగా ప్రవర్తించాల్సిన తీరులో కాకుండా భిన్నమైన తీరులో సమాజంలో నేరప్రవృత్తే వృత్తిగా ఉండే వ్యక్తి తీరుకంటే ఘోరంగా వ్యవహరించారు. ప్రతిపక్ష నేత అయినా వారించాల్సిందిపోయారు.

అసెంబ్లీ జరుగుతున్న సమయంలో సభ్యులు తప్పించి మిగతావారు లోపలికి రావడానికి వీల్లేదు. కానీ 50, 60 మంది ఊరేగింపుగా వస్తుంటే సహజంగా సభ భద్రతాధికారులు గేటు మూసి ఎవరు సభ్యులు అయితే వారిని లోనికి తీసుకుంటారు. గేటు వేసినందుకు కొంతమంది టీడీపీ సభ్యులు రాస్‌కెల్, ఇడియట్, యూస్‌లెస్‌ఫెల్‌ అని మార్షల్స్‌ను దుర్భాషలాడారు. ఎవరికి వారు చంద్రబాబు దగ్గర మార్కులు కొట్టేయాలన్నట్లుగా అధికారులపై దాడికి యత్నించారు. దీపక్‌రెడ్డి అనే కౌన్సిల్‌ సభ్యుడు, రామానాయుడు, భావి ముఖ్యమంత్రి అని తెలుగుదేశం పార్టీ సభ్యులు భావించే లోకేష్‌ మార్షల్స్‌పై దాడి చేశారు.

కరణం బలరాం బయట దూకుడుగా ఉంటాడని విన్నాం. వారు నిన్న బతిమిలాడుతున్నారు. దీపక్‌రెడ్డి అనే వ్యక్తి ఒకసారి కొట్టడమే కాకుండా.. రెండోసారి చీఫ్‌ మార్షల్‌ మీద చేయి చేసుకోవడానికి వెళ్తుండడం, నారా లోకేష్‌ మార్షల్‌ను పీక పట్టుకున్నాడు. కొందరు గోళ్లతో రక్కారు. మరికొందరు మార్షల్స్‌ నుదిటిపై పిడిగుద్దులు కురిపించారు. వీరిపై తక్షణమే క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలనేది మా డిమాండ్‌. అసెంబ్లీలో గుక్కెడు మంచినీరు కూడా దొరక్కుండా నిర్మాణం చేసిన పెద్దలు.. మంచినీరు కూడా దొరకని పరిస్థితుల్లో ఉద్యోగాలు చేస్తుంటే వారిపై దాడి చేస్తే చర్య తీసుకోకుండా ఉండడం ధర్మం కాదు. కచ్చితంగా వీరిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్ని నాని కోరారు. 

   

Read Also: చంద్రబాబు ఈనాడు ఉద్యోగి

Back to Top