వైయస్‌ఆర్‌సీపీలో మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నాం

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

హిందూపురంలో బాలకృష్ణ రెండుసార్లు గెలిచినా అభివృద్ధి శూన్యం

ఈసారి హిందూపురంలో వైయస్‌ఆర్‌సీపీ గెలవడం ఖాయం

శ్రీసత్యసాయి జిల్లా:  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో మహిళలకు సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సీఎం వైయస్‌ జగన్‌ పాలనలో జనం సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. మా ప్రభుత్వంలో 99 శాతం లబ్ధిదారులకు పథకాలు అందజేశామన్నారు. బుధవారం హిందూపురంలో మంత్రి మీడియాతో మాట్లాడారు.
అన్ని సర్వేల్లో కూడా వైయస్‌ఆర్‌సీపీ వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలుస్తుందని స్పష్టమైందన్నారు. అందుకే చంద్రబాబు మరో నియోజకవర్గాన్ని వెతుక్కునే పనిలో ఉన్నారన్నారు. చంద్రబాబు కుప్పంలో పోటీ చేసే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు ఎన్నికల హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. హిందూపురంలో బాలకృష్ణ రెండుసార్లు గెలిచినా అభివృద్ధి చేయలేకపోయారన్నారు. హిందూపురంలో గెలవాలనే తపన, తాపత్రయంతో పని చేస్తున్నామన్నారు. ఇందులో ప్రత్యేక అజెండాలు ఏమీ లేవన్నారు.మా పార్టీ తరఫున బీసీ మహిళా పోటీ చేస్తుందని, ఈసారి హిందూపురంలో వైయస్‌ఆర్‌సీపీ గెలవడం ఖాయమన్నారు.  సర్వసాధారణంగా అధికార పార్టీలో టికెట్ల కోసం పోటీ ఉంటుంది..దానికి తోడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి లాంటి నాయకుడు ఉన్న పార్టీలో ప్రతి ఒక్కరికీ కూడా ఆశ ఉంటుందన్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులను అధిగమించి ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీకి అభ్యర్థులే లేరని, మా వద్ద నుంచి క్యాండిడేట్లను చంద్రబాబు తీసుకుంటున్నారని విమర్శించారు. టీడీపీకి అభ్యర్థులు ఉంటే ఎందుకు ఇంతవరకు ప్రకటించకుండా తాత్కారం చేస్తున్నారని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. జనసేన పార్టీకి కూడా ఇంతవరకు అభ్యర్థులు లేరని, ఆయన ఒక్కరు మాత్రమే ఇప్పటి వరకు పోటీ చేస్తానని చెబుతున్నారు. మిగతా అభ్యర్థుల సంగతేంటని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజా నాయకుడని, ఆయనపై నమ్మకంతో ఒక స్థానానికి 20 మంది చొప్పున పోటీ పడుతున్నారని, ఈ కారణంగా కొంత గందరగోళం ఏర్పడవచ్చని, అవన్నీ అధిగమిస్తామని మంత్రి పెద్దిరెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. హిందూపురం నియోజకవర్గంలో వర్గవిభేదాలు ఎక్కడా లేరని, ఇక్కడి పరిస్థితుల దృష్ట్యా కొత్త అభ్యర్థిని తీసుకువచ్చామని మంత్రి తెలిపారు.

 

Back to Top