చంద్రబాబు రాయలసీమ ద్రోహి

క‌ర్నూలు గ‌ర్జ‌న స‌భ‌లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 

క‌ర్నూలు: చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి మండిప‌డ్డారు.  చంద్రబాబు 14 ఏళ్ళు సీఎంగా ఉండి హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి చేశారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే సీఎం వైయ‌స్ జగన్ మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారని పేర్కొన్నారు.  మూడు రాజధానులు తీసుకురావాలని సీఎం వైయ‌స్ జగన్ పట్టుదలతో ఉన్నారని.. వైయ‌స్ఆర్‌ సీపీ ప్రభుత్వం మాత్రమే కర్నూలులో హైకోర్టు తీసుకురాగలదన్నారు. చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతిలో రాజధాని ఏర్పాటు చేశారని మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి మండిపడ్డారు. క‌ర్నూలులో నిర్వ‌హించిన రాయ‌ల‌సీమ గ‌ర్జ‌న కార్య‌క్ర‌మంలో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడారు. 

రాష్ట్రం విడిపోకముందు మన రాయలసీమ నుంచి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు అభివృద్ధి అంతా హైదరాబాద్‌లోనే చేశారు. మన నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలని వికేంద్రీకరణ సిద్ధాంతాన్ని తీసుకువచ్చారు. అందులో భాగంగానే కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని మనం కోరుతున్నాం. అమరావతిలో కూడా రాజధాని ఉంటుందని, పరిపాలన రాజధాని విశాఖలో ఉంటుందని, ఆ విధంగా మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని సీఎం వైయస్‌ జగన్‌ భావిస్తున్నారు. న్యాయ రాజధాని కర్నూలుకు ఇవ్వడం సబబే. గతంలో ఇక్కడ ఉన్న రాజధానిని హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. మళ్లీ ఈ ప్రాంతానికి న్యాయం జరగాలంటే కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాల్సిందే. చంద్రబాబు రాయలసీమ ద్రోహిగా పరిగణించాలి. మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలని సీఎం వైయస్‌ జగన్‌ ముందుకు వెళ్తున్నారు. కర్నూలులో జరిగిన గర్జన చాలా గొప్పగా జరిగింది. ఈ ప్రభుత్వం మాత్రమే కర్నూలులో న్యాయ రాజధాని, విశాఖలో పరిపాలన రాజధాని, అమరావతిలో శాసన రాజధాని ఏర్పాటు చేయగలదు. చంద్రబాబు వస్తే మళ్లీ అమరావతిలోనే రాజధాని పెడతారు. ఆ ప్రాంతంపై కూడా చంద్రబాబుకు పూర్తి ప్రేమ లేదు. ఆయన బంధుగణం, మిత్రగణం, ఆ పార్టీ నాయకులు కొన్న వేల ఎకరాల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకునేందుకు అక్కడ రాజధాని పెట్టారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు.
 

 

Back to Top