పూర్తి విచార‌ణ జ‌రిగాకే.. నారాయ‌ణ అరెస్టు

త‌ప్పు చేసిన‌వారిని అరెస్టు చేస్తే క‌క్ష‌సాధింపా..?

టీడీపీ వ్యాఖ్య‌ల‌పై మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి మండిపాటు

స‌చివాల‌యం: వాస్త‌వాల ఆధారంగానే పోలీసులు నారాయ‌ణ‌ను అరెస్టు చేశార‌ని, ఇందులో ఎలాంటి క‌క్ష‌సాధింపు లేద‌ని, విచార‌ణ‌లో అంతా తేలింద‌ని మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి అన్నారు. టెన్త్ పేప‌ర్ లీకేజీ సంబంధించి మాజీ మంత్రి నారాయ‌ణ అరెస్టుపై చంద్రబాబు చేస్తున్న విమర్శలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి స్పందించారు. స‌చివాల‌యంలో మీడియాతో మాట్లాడారు. మొత్తం నారాయణ విద్యాసంస్థల్లోనే టెన్త్‌ ప్రశ్నపత్రాల మాల్ ప్రాక్టీస్ జరిగిందన్నారు. ఇప్పటికే పేప‌ర్ లీకేజీకి సంబంధించిన‌ కేసులో 60 మందిని అరెస్ట్ చేసినట్లు మంత్రి పెద్దిరెడ్డి గుర్తుచేశారు. పూర్తి విచారణ జరిగాకే.. నారాయణను పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పారు. 

పొత్తులపై చంద్రబాబు చేస్తున్న ప్రకటనలపై మంత్రి పెద్దిరెడ్డి స్పందించారు. చంద్రబాబుకు మతిమరుపు వచ్చి రోజుకో మాట మాట్లాడుతున్నాడ‌ని ఎద్దేవా చేశారు. పొత్తులపై మాట్లాడింది ఆయనే, మాట మార్చింది ఆయనేన‌ని, జనం ఎలాగూ బాబును గెలిపించరని తెలిసి పొత్తుల కోసం రోజుకో మాట మాట్లాడుతున్నాడ‌న్నారు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసి మళ్లీ గెలిచి తీరుతుందని ధీమా వ్య‌క్తం చేశారు. 

Back to Top