సచివాలయం: రాష్ట్రంలో 40 శాతం బార్ల సంఖ్య తగ్గించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి చెప్పారు. దశలవారి మద్యపాన నిషేధంలో భాగంగా సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. దశలవారి మద్య నిషేధానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. బార్ల పాలసీపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమీక్షా సమావేశం అనంతరం సచివాలయంలో మంత్రి నారాయణస్వామి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమీక్షలో సీఎం వైయస్ జగన్ 50 శాతం తగ్గించాలని సూచించగా.. అధికారులు దశలవారి మద్య నిషేధంలో భాగంగా 40 శాతం బార్ల సంఖ్య తగ్గిద్దామని చెప్పడంతో సీఎం అధికారుల నిర్ణయాన్ని ఏకీభవించారని చెప్పారు.
ప్రస్తుతం ఉన్న బార్లను తీసేసి కొత్తగా లైసెన్స్‌లు అందజేస్తామని మంత్రి నారాయణస్వామి చెప్పారు. బార్ల లైసెన్స్ ఫీజు కూడా పెంచబోతున్నామని చెప్పారు. బార్ లైసెన్స్ కావాల్సిన వారు దరఖాస్తు చేసుకుంటే లాటరీ పద్ధతి ద్వారా మంజూరు చేస్తామని వివరించారు. జనవరి 1వ తేదీ నుంచి ఈ ప్రక్రియ అమలులోకి వస్తుందన్నారు. బార్ల టైమింగ్ కూడా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే మద్యం విక్రయించాలని రాత్రి 10 నుంచి 11 గంటల వరకు ఫుడ్ సప్లయ్ మాత్రమే చేపట్టాలన్నారు. బార్లకు సరఫరా చేసే మద్యం ధరలను కూడా పెంచే ఆలోచన ఉన్నామని, ధర ఎంత పెంచబోతున్నామనేది త్వరలో తెలియజేస్తామన్నారు.
మద్యం కల్తీ, అక్రమ సరఫరా, నాటు సారా తయారు చేసినా కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా నాన్‌బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామన్నారు. బార్లు ఏర్పాటు చేసుకున్నప్పుడు అవకతవకలు జరిగినా.. అక్రమ ఆలోచనలతో బార్లు రన్ చేస్తే లైసెన్స్ ఫీజుకు మూడు రెట్లు పెనాల్టీ వేయడమే కాకుండా బార్ల లైసెన్స్ రద్దు, ఆరు నెలల జైలు శిక్ష విధించేలా చట్టం తీసుకువస్తామన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం సరఫరా చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
మద్య నిషేధంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న ఈ విధానానికి అందరూ పూర్తి సహకారం అందించాలని మంత్రి నారాయణస్వామి కోరారు. అంటువ్యాధిలా వ్యాపిస్తున్న మద్యపాన నిర్మూలనకు అందరూ సహకరించాలన్నారు. మద్యపానాన్ని రూపుమాపుతూ పేదల కుటుంబాల్లో చిరునవ్వు నింపుతున్న సీఎం వైయస్ జగన్ ప్రజా పాలకుడిగా ప్రజల్లో శాశ్వతంగా నిలిచిపోతారన్నారు.
మద్యపాన నిషేధానికి చంద్రబాబు, లోకేష్ అనుకూలమా..? వ్యతిరేకమా..? సమాధానం చెప్పాలన్నారు. మద్య నిషేధంపై చంద్రబాబు అవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. అదే విధంగా ఇంగ్లిష్ మీడియం విద్యపై దారుణంగా విమర్శలు చేస్తున్నారని, రాజకీయ నాయకుల పిల్లలే ఇంగ్లిష్ మీడియంలో చదవాలా..? అని ప్రశ్నించారు. టీడీపీ ఇంగ్లిష్ మీడియం విద్యను స్వాగతిస్తుందా..? లేదా..? సమాధానం చెప్పాలన్నారు.
Read Also: 2024 కల్లా ఏపీలో మూడు ఏఐఐబీ ప్రాజెక్టులు పూర్తి