తాడేపల్లి: ఎంపీపీ ఉప ఎన్నికల్లో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేశారని, అరాచక పాలనకు వింజమూరు, బొమ్మనహళ్లి ఉప ఎన్నికలే నిదర్శనమని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ మండిపడ్డారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ ఇంకా ఏమన్నారంటే..: రాష్ట్రంలో ప్రస్తుతం అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా ‘రెడ్‌బుక్ రాజ్యాంగం’ అమలవుతోంది. శాంతిభద్రతల నుంచి ఎన్నికల నిర్వహణ వరకూ అన్నీ అధికార మదంతో, అప్రజాస్వామికంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుంది. ఎన్నికలే అవసరం లేదన్నట్టుగా, తాము చెప్పిందే రాజ్యాంగమన్న భావనతో టీడీపీ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా ఇవాళ (సోమవారం) జరిగిన వింజమూరు, బొమ్మనహళ్లి ఎంపీపీ ఉప ఎన్నికలు. వింజమూరులో 12 ఎంపీటీసీ స్థానాలకు గాను 9 మంది వైయస్ఆర్‌సీపీ సభ్యులు కాగా, మిగిలిన ముగ్గురు ఇండిపెండెంట్లు. అక్కడ టీడీపీకి ఒక్క సభ్యుడూ లేని పరిస్థితిలోనూ రౌడీయిజానికి దిగారు. ఇంత జరుగుతున్నా పోలీసులు చూస్తూ నిలబడ్డారు తప్ప, టీడీపీ గుండాలను నిలువరించే ప్రయత్నం చేయలేదు. కనీస సంఖ్యాబలం లేకపోయినా అడ్డదారిలో పదవులు దక్కించుకోవడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు. ఎంపీటీసీ సభ్యురాలు రత్నమ్మను మహిళ అని కూడా చూడకుండా గాయపరిచిన ఘటన, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా చెప్పాలి. రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహళ్లీలో 15 ఎంపీటీసీ స్థానాల్లో 12 స్థానాలు వైయస్ఆర్‌సీపీకి వచ్చినప్పటికీ, అక్కడ కూడా టీడీపీ ఒక్క స్థానంలో కూడా గెలవకపోయినా, పైనుంచి వచ్చిన ఆదేశాలతో అధికారులు టీడీపీ గెలిచినట్లు ప్రకటించారు. ఇది అతి దారుణం. అందుకే వింజమూరు, బొమ్మనహళ్లి ఎంపీపీ ఉప ఎన్నికలను వెంటనే రద్దు చేసి, ప్రశాంత వాతావరణంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం.