కర్నూలు: నందవరం మండలం కనకవీడు గ్రామానికి చెందిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇటీవల అధికార టీడీపీ నేతలతో జరిగిన దాడి ఘటనలో గాయపడి ఎమ్మిగనూరు పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో గాయపడిన కార్యకర్తలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ ఎంపీ బుట్టా రేణుక గారు పరామర్శించారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంలో గ్రామంలో ఏర్పడిన పరస్పర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కనకవీడు గ్రామానికి చెందిన కురువ వీరుపాక్షి, కురువ సూరి గాయపడగా, ప్రస్తుతం వారు ప్రభుత్వ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. పరామర్శ సందర్భంగా బుట్టా రేణుక గాయపడిన కార్యకర్తల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వారికి అవసరమైన అన్ని వైద్య సౌకర్యాలు సముచితంగా అందేలా చూడాలని వైద్య అధికారులను కోరారు. అలాగే పార్టీ ఎల్లప్పుడూ కార్యకర్తల వెంటే ఉంటుందని భరోసా కల్పిస్తూ, ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాజకీయ భేదాభిప్రాయాలకు అతీతంగా గ్రామాల్లో శాంతి, సౌహార్ద వాతావరణం కొనసాగాలని ఆకాంక్షించారు. ఇటువంటి దురదృష్టకర సంఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా అన్ని వర్గాలు సంయమనం పాటించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు శ్రీ బుట్టా శివనీలకంఠ గారు, రాష్ట్ర మేధావుల ఫోరం సంయుక్త కార్యదర్శి కె.ఆర్. లక్ష్మీకాంత్ రెడ్డి గారు, రాష్ట్ర బీసీ సెల్ సంయుక్త కార్యదర్శి ముగతి వీరుపాక్షి రెడ్డి గారు, నందవరం మండల కన్వీనర్ జె. శివారెడ్డి గారు, పార్టీ సీనియర్ నాయకులు కె.ఆర్. రామకోటేశ్వర్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.