రెడ్ బుక్ రాజ్యాంగం కనుసన్నుల్లో ఉప ఎన్నికలు 

రెండు ఎంపీపీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఖూనీ 

వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌జాప్ర‌తినిధుల‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం 

వైయ‌స్ఆర్‌సీపీ పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి 

తాడేప‌ల్లి: రాష్ట్రంలో రెండు స్థానాల్లో నిన్న నిర్వహించిన ఎంపీపీ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని వైయ‌స్ఆర్‌సీపీ పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ప్రకటనలో, ఉప ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా కాకుండా బెదిరింపులు, దాడులు, కిడ్నాప్‌ల వాతావరణంలో జరిగాయని పేర్కొన్నారు. 
ఎంపీపీ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి అధికార దుర్వినియోగమే ప్రధాన లక్ష్యమని వెన్నపూస అన్నారు. కొందరు పోలీసులు కూటమి నేతల చేతిలో కీలుబొమ్మలుగా మారి, ఎన్నికల ప్రక్రియను పూర్తిగా కూటమికి అనుకూలంగా మలిచారని విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వ్యవస్థలు ఎంతగా విఫలమయ్యాయో స్పష్టంగా చూపుతోందన్నారు.

వింజమూరు, బొమ్మనహల్ ప్రాంతాల్లో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, ఎంపీటీసీలపై దాడులు, బెదిరింపులు, నిర్బంధాలు చోటుచేసుకున్నాయని తెలిపారు. బొమ్మనహల్‌లో టీడీపీకి సంఖ్యాబలం లేకపోయినా వారి అభ్యర్థికే డిక్లరేషన్ ఇవ్వడం ప్రజాస్వామ్య హత్యకు నిదర్శనమని అన్నారు. ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అరాచకమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా పేర్కొన్నారు. వైయ‌స్ఆర్‌సీపీ నాయకులపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని వెన్నపూస స్పష్టం చేశారు. ప్రజలచే నిజంగా ఎన్నికయ్యే విజయమే అసలైన విజయమని, దొడ్డిదారున ఉప ఎన్నికల్లో గెలిచామని చెప్పుకునే విజయాలు ప్రజాస్వామ్యంలో విజయాలుగా పరిగణించబోవని ఆయన స్పష్టంగా తెలిపారు.
 

Back to Top