విశాఖపట్నం: భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణ ఘనత ముమ్మాటికీ వైయస్.జగన్ దేనని, అయితే దాన్ని కూడా టీడీపీ నేతలు సిగ్గు లేకుండా తమ ఖాతాలో వేసుకుంటున్నారని వైయస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ మండిపడ్డారు. విశాఖపట్నంలో వైయస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... ఫస్ట్ టెస్ట్ ప్లైట్ ల్యాండింగ్ నేపధ్యంలో ఈ ఘనత తమదేనని చెప్పుకుంటున్న టీడీపీ నేతలు.. ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో వారి కంట్రిబ్యూషన్ ఏముందని ప్రశ్నించారు. క్రెడిట్ చోరీకి పాల్పడ్డం వారికి వెన్నతో పెట్టిన విద్య అని తేల్చి చెప్పారు. కేవలం ఉత్తరాంధ్ర ప్రజలను మభ్యపెట్టడానికే 2019 ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు అప్పటి సీఎం చంద్రబాబు హడావుడిగా ఎయిర్ పోర్ట్ పనులకు శంకుస్థాపన చేశారన్న అమర్నాధ్.. భూసేకరణ, అనుమతులు, ఆర్ధిక వనరులు లేకుండా ఏ రకంగా నిర్మాణం చేస్తారని నిలదీశారు. 2019లో వైయస్.జగన్ ప్రభుత్వ హయాంలోనే ఎయిర్ పోర్టు కోసం భూసేకరణతో పాటు అన్ని రకాల అనుమతులు సాధించిన తర్వాతే 2023 మే 3 న నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారని స్పష్టం చేశారు. అదే రోజు జూన్ 2026 నాటికి ఎయిర్ పోర్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న ఉత్తరాంధ్రా వాసుల ఆకాంక్షను వైయస్.జగన్ వెలిబుచ్చారన్న అమర్నాధ్... అందులో భాగమే నిన్నటి టెస్ట్ ప్లైట్ ల్యాండింగ్ అని స్పష్టం చేశారు. ఇదే వైయస్.జగన్ విజన్ కి తార్కాణమన్న అమర్నాధ్... విజన్ అంటే జగన్ - భజన అంటే బాబు తేల్చి చెప్పారు. నిర్వాసితులకు సైతం వైయస్సార్సీపీ హయాంలో న్యాయం చేస్తూ... నాలుగు గ్రామాల ప్రజలకు పరిహారం, మౌలిక సదుపాయల కల్పన కోసం సుమారు రూ.500 కోట్లు ఖర్చు పెట్టి రెండు చోట్ల కాలనీలు నిర్మించిన విషయాన్ని గుర్తు చేశారు. అయినా టీటీడీ నేతలు నిస్సిగ్గుగా ఆ విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవడంతోపాటు ఎయిర్ పోర్టు విషయంలో కట్ పేస్ట్ వీడియోలతో వైయస్.జగన్ పై చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఇంకా ఆయన ఏమన్నారంటే.. ● వైయస్.జగన్ హాయంలో అన్ని రకాల అనుమతులు.. ఏ ప్రాజెక్టుకైనా శంకుస్థాపనలు చేయడంలో చంద్రబాబు దిట్ట. ఇందులో ఆయన్ను మించిన నాయకుడు దేశ చరిత్రలో మరొక్కరు లేరు. ఎవరికో పుట్టిన బిడ్డకు తమ పేరు పెట్టుకోవడం వారికి అలవాటు. ఇప్పటికైనా వారి తీరు మారుతుంది.. వారి చేసుకున్న కార్యక్రమాలు పేరు పెట్టుకుంటారనుకుంటే వారు చేసిన కార్యక్రమాలు, సాధించిన ఘనత కూడా ఏమీ లేదు. 2019లో వైయస్.జగన్ సీఎం అయ్యేనాటికి భూసేకరణకు సంబంధించి 139 రిట్ పిటిషన్లు తగిన పరిహారం ఇవ్వాలనో, అసైన్డ్ ల్యాండ్ యజమానులకు తగిన పరిహారం ఇవ్వలేదనో రకరకాల కారణాలతో .. కోర్టులో పెండింగ్ లో ఉన్నాయి.ఆ తర్వాత జీఎమ్మార్ సంస్థతో 2020లో నిర్మాణ ఒప్పందం జరిగింది. 2021 మే నుంచి నిర్మాణ పనులు మొదలుపెట్టాం. మరోవైపు కోర్టుల్లో ఉన్న కేసులన్నింటినీ వైయస్.జగన్ ప్రభుత్వం నంవబరు 2022 నాటికి పరిష్కరించింది. ఆ తర్వాత జనవరి 2023 నాటికి పూర్తిగా ఎయిర్ పోర్టుకు అవసరమైన భూమని సేకరించాం. అనంతరం మే 3 2023 నాడు నాటి ముఖ్యమంత్రి వైయస్.జగన్, నిర్మాణ సంస్థ అధిపతి జీఎమ్మార్ తో కలిసి ఎయిర్ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. ఆ రోడు ప్రారంభమైన పనులు నిర్విరామంగా చేస్తూ.. జూన్ 2026 నాటికి అన్ని పనులు పూర్తి చేసుకుని కమర్షియల్ ఆపరేషన్స్ మొదలుపెట్టాలని వైయస్.జగన్ ఆరోజు ప్రజల ఆకాంక్షలను వెలిబుచ్చారు. అందులో భాగంగానే డిసెంబరు 2025 మేం ఇచ్చిన లక్ష్యానికి అనుగుణంగానే మొదటి టెస్ట్ ఫ్లైట్ ల్యాండింగ్ అయింంది. మరోవైపు నిర్వాసితులుకు సైతం అన్ని రకాల పరిహారం చెల్లించి, వారికి ఇళ్లు నిర్మించి ఇచ్చింది. దానికోసం సుమారు రూ.400- రూ.500 కోట్లు మా ప్రభుత్వ హయాంలో ఖర్చు పెట్టాం. 4 గ్రామాల ప్రజలకు రెండు ప్రాంతాల్లో ఆర్ అండ్ ఆర్ కాలనీలు నిర్మించి వారికి పునరావాసం కల్పించాం. అలా పునరావాసంగా నిర్మించిన బొల్లింకల పాలెం, మరడపాలెం గ్రామాలను చూస్తే... ఎంత పక్కగా ఆర్ అండ్ ఆర్ అందించామో అర్ధం అవుతుంది. ఇవన్నీ వైయస్.జగన్ ప్రభుత్వ హయాంలో చేస్తే.. మీరు క్లెయిమ్ చేసుకోవడానికి మీకు ఏం హక్కు ఉంది? ఎయిర్ పోర్టు నిర్మాణానికి అవసరమైన 2203 ఎకరాలను నిర్మాణ సంస్థకు అప్పగించిన తర్వాత ఆ సంస్థ పెట్టుబడి తప్ప రాష్ట్ర ప్రభుత్వం రూపాయి పెట్టుబడి పెట్టాల్సిన పనిలేదు. మొత్తం ప్రాజెక్టులో ప్రభుత్వం పాత్ర కేవలం 2203 ఎకరాల భూమే ప్రభుత్వ ఈక్విటిగా ఉంటుంది. మా హయాంలో అన్ని అనుమతులు వచ్చి, కాంట్రాక్ట్ కు పనులు అప్పగించిన నాటి నుంచి పనులు నిర్విరామంగా జరుగుతున్నాయి. అది నిరంతరాయంగా పని జరుగుతుంటే అదేదో మీ ఘనతలా చెప్పుకుంటున్నారు. ● నిస్సిగ్గుగా తప్పుడు ప్రచారం.. ఇవాళ కేవలం మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి... ప్రచార మాధ్యమాల్లో వైయస్.జగన్ మీద తప్పుడు ప్రచారం చేస్తూ వీడియోలు సర్క్యూలేట్ చేస్తున్నారు. మీకు దమ్మూ ధైర్యం ఉంటే, సిగ్గూ శరం ఉంటే మొత్తం వీడియో ప్రజల మందు ఉంచండి. కానీ మీ బ్రతుకుల వలే కట్ కాపీ పేస్ట్ లా... మీకు కావాల్సింది పోస్ట్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దు. వైస్.జగన్ భోగాపురం ఎయిర్ పోర్ట్ ని వ్యతిరేకించారని దుష్ప్రచారం చేశారు. వాస్తవానికి ఆ రోజు బోగాపురం రైతులు వైయస్.జగన్ వద్ద చంద్రబాబు ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ పేరిట మాకు అన్యాయం చేస్తున్నారు. ఎయిర్ పోర్టుకు కావాల్సిన భూములు 2-3 వేల ఎకరాలు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 15వేల ఎకరాలు కావాలి అంటూ.. మా పొట్ట కొడుతున్నాడని స్థానిక ప్రజలు వైయస్.జగన్ తో మొరపెట్టుకున్నారు. 15వేల ఎకరాలు తీసుకుని రియల్ ఎస్టేట్ చేసుకోవాలనుకుంటే అది తప్పని వైస్.జగన్ చెప్పారు. అదే రోజు రైతులకు వైయస్.జగన్ హామీ ఇస్తూ మీకు వైయస్సార్సీపీ అండగా ఉంటుంది, ఎయిర్ పోర్టుకు కావాల్సిన భూమి కంటే అధికంగా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది.. దానికి వ్యతిరేకంగా మీ పక్షాన నిలబడతామని చెప్పారు. ఆ మాటలను తీసుకొచ్చి అసలు వైయస్.జగన్ ఎయిర్ పోర్టే వద్దన్నారని దుష్ప్రచారం చేస్తున్నారు. ● కుప్పంలో ఎయిర్ పోర్టు మాటేమిటి? ఇవాళ అమరావతిలో కొత్తగా ఎయిర్ పోర్టు, రైల్వే స్టేషన్ నిర్మిస్తామంటున్నారు. ఇంకా వింటే పోర్టు కూడా కడతామని చెబుతారు. భోగాపురం విమానాశ్రయం మీరే నిర్మించామని చెప్పుకుంటున్న మీరు... మీ సొంత నియోజకవర్గం కుప్పంలో ఎయిర్ స్ట్రిప్ కి సంబంధించి 2019 జనవరి లో శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఏం జరిగింది. ఆ ఎయిర్ పోర్టు ప్రారంభమైందా? కుప్పంలో చంద్రబాబు ప్లైట్ దిగుతున్నాడా? లేనిపోని గొప్పలని చెప్పుకుంటూ దాన్ని విజన్ అని ప్రచారం చేసుకుంటారు. చివరకి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి మంచి రోడ్ కనెక్టివిటీ ఉండాలని వైజాగ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కి హాజరైన కేంద్రమంత్రి గడ్కరీతో గారిని ఒప్పించి ప్రకటన చేయించాం. ఇందుకోసం అవసరమైన భూమి వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని ఆయనతో చెప్పి.. మిగిలిన ప్రాజెక్టు వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని భరించమని చెప్పి వేదిక మీద విజ్ఞప్తి చేసి, వారితో ప్రకటింపజేసిన ఘనత వైయస్.జగన్ కే దక్కుతుంది. బోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆరులైన్ల జాతీయ రహదారి ఏమైపోయింది. రెండేళ్లలో ఏం సాధించారు? చంద్రబాబు అధికారంలోకి రాగానే మెట్రో, పోర్టు, ఎయిర్ పోర్టు అని చెప్పడం పరిపాటిగా మారింది. విశాఖ మెట్రో గురించి తాజాగా కేంద్ర ప్రభుత్వం ఫీజబులిటీ రిపోర్ట్ లేదు, మరోసారి పంపించమని చెప్పింది. దీన్నే చంద్రబాబు 2029 ఎన్నికల వరకు తిప్పి.. ఎన్నికల ముందు ఫిబ్రవరిలోనే ఒక టెంకాయ కొడతారు. అమరావతిలో మాత్రం ఆవకాయ్ అంటారు. ఏ ప్రాజెక్టుకైనా ముందు టెంకాయ్ నాదే అనడం అలవాడు. మంగళగిరిలో పప్పు, అమరావతిలో ఆవకాయ్.. ఆంధ్రాకు అప్పులు, చంద్రబాబు గొప్పలు తప్ప ఇంతకుమించి ఈ రెండేళ్లలో సాధించిందేమీ లేదు. ● విజన్ అంటే జగన్- భజన అంటే బాబు.. విజన్ అంటే జగన్, భజన అంటే చంద్రబాబు అన్న విషయం ఈ రెండేళ్లలో రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారు. పబ్లిసిటీ తప్ప మరోకటి లేదు. ఏం సాధించకుండా, చేయకుండా నేనే చేశానని చెప్పుకోవడంలో ప్రపంచంలో చంద్రబాబుని మించిన నాయకుడు లేడు. వీటికి తోడు సాయంత్రమైతే చాలు ఎల్లో మీడియాలో విపరీతమైన భజన. ఏ ఛానెల్ పెట్టినా జాకీర్ హుస్సేన్ ని మించి తబలా కొట్టేవాళ్లు తయారు అయ్యారు. ఇంత డబ్బు కొట్టినా.. రాష్ట్రం మాత్రం అప్పులపాలైంది. రెండేళ్లలో రూ.3 లక్షల కోట్లు అప్పు చేశారు. మనం భూసేకరణ చేయలేదు, అనుమతులు తేలేదు, మౌలిక వసతులు మనం కల్పించలేదు, నిర్మాణాన్ని కూడా మనం ప్రారంభించలేదు ఈ కార్యక్రమానికి మనం వెళితే బాగుండదేమో అనుకుని... కాస్తా సిగ్గుపడి తండ్రీ కొడుకులిద్దరూ రాలేదు. రీల్స్ రామ్మోహన్ గారిని పంపిస్తే ఆయనేమో తన ఘనతగా తాను సాధించినట్లుగా ఫీలవుతున్నాడు. విజయవాడ విమానాశ్రాయాన్ని ఏళ్లతరబడి కడుతున్నారు. మరి దాని గురించి ఎందుకు రామ్మోహన్ నాయుడు పూర్తి చేయలేకపోతున్నారు. రెండేళ్లలో అది ఎందుకు పనులు పూర్తి చేసుకోలేదు. భోగాపురం ఎందుకు అయిందంటే.. కేవలం వైయస్.జగన్ హయాంలో అన్ని రకాల అనుమతులు తీసుకొచ్చి, ఎలాంటి కోర్టు కేసులు లేకుండా క్లియర్ చేయడంతో పాటు, నిర్మాణ సంస్థ యజమాని జిఎమ్మార్ గారు ఉత్తరాంధ్రా ప్రాంతం మీదున్న ప్రేమతో ఈ ప్రాజెక్టును సకాలంలో పూర్తయ్యేలా పనిచేస్తున్నారు. ఈ ప్రాంత భవిష్యత్ బాగుండాలన్న లక్ష్యంలో పనిచేస్తున్నారు. ఇవాళ శంషాబాద్ ఎయిర్ పోర్టు వల్ల ఏ విధంగా హైదరాబాద్ రూపురేఖలు మారాయో అదే విధంగా వైయస్.జగన్ తీసుకొచ్చిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వల్ల ఉత్తరాంధ్రా రూపురేఖలు మారబోతున్నాయన్న విషయం ఆనాడే జీఎమ్మార్ చెప్పారు.ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేస్తుంటే కడుపు మంటతో రగిలిపోతున్నారు. ● జిఎమ్మార్ కు ధన్యవాదాలు.. మీరు అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా ఇంకా మా హయాంలో చేపట్టిన కార్యక్రమాలు చెప్పుకోవడం మినహా మీరేమి సాధించారు? వైయస్.జగన్ ని మీరు ప్రశంసించాల్సిన పనిలేదు కానీ.. వాస్తవాలు ప్రజలకు చెప్పే క్రమంలో కొద్దిగానైనా నిజాయితీతో ఉండాలి. కాస్తా సిగ్గూ శరంతో ప్రవర్తించాలని ప్రభుత్వ పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరి బిడ్డకో తండ్రిగా మీ పేరు రాయించుకోవడం మానుకోవాలి. మీ ప్రచార ఆర్భాటాలను, లేనిదాన్ని ఉన్నట్టు చెప్పే మీ గొప్పలను రానున్న బోగి మంటల్లో కాల్చండి. కనీసం సంక్రాంతి నుంచైనా ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు చేయాలని ప్రభుత్వ పెద్దలకు గుడివాడ అమర్నాధ్ విజ్ఞప్తి చేశారు. ఆదే విధంగా ఆ రోజు వైయస్.జగన్ గారికి ఇచ్చిన మాట ప్రకారం జీఎమ్మార్ సంస్ద ఈ ప్రాంత ప్రజల ఆశలను, ఆలోచనలను నిజం చేస్తున్నందుకు మరొక్కసారి మల్లిఖార్జునరావు గారికి వైయస్సార్సీపీ తరపున ధన్యవాదాలు చెబుతూ.. ఉత్తరాంధ్రా ప్రజలకు బృహత్తరమైన ఈ ప్రాజెక్టును సాకార చేసినందుకు వైయస్.జగన్ కు కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ● అనంతరం పాత్రికేయుల ప్రశ్నలకు బదులిస్తూ... చంద్రబాబు నాయుడే ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన చేశాడన్న టీడీపీ నేతల ప్రచారంపై స్పందిస్తూ... 2019 సాధారణ ఎన్నికలకు నోటిఫికేషన్ రావడానికి కేవలం 20 రోజుల ముందు చంద్రబాబు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అప్పటికి భూ సేకరణ జరగలేదు. కోర్టులో ఉన్న 139 రిట్ పిటిషన్లు ఉన్నాయి. కాంట్రాక్టర్ తో ఒప్పందం లేదు. పునరావాసం లేదు. ఇవేవీ చేయకుండా ఎలా ఎయిర్ పోర్టు ఎలా నిర్మిస్తారో చంద్రబాబే చెప్పాలి. వాస్తవానికి వైయస్.జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే పూర్తిస్ధాయిలో భూసేకరణ చేశాం. అన్ని అనుమతులు తీసుకొచ్చాం. ఎలాంటి ఆటంకాలు లేకుండా చేసి శంకుస్థాపన చేశాం కాబట్టి ఇది మా ఘనతగా చెప్పుకుంటున్నాం. భోగాపురం ఎయిర్ పోర్టుకు 15వేల ఎకరాలు భూమి సేకరించాలన్న చంద్రబాబు ఆరోజు సీఎంగా ఉన్నప్పుడు చేసిన ప్రకటనను మా పార్టీ వ్యతిరేకించింది. ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే లండన్ హీత్రూ విమానాశ్రయం కేవలం 3వేల ఎకరాల్లో ఉంది. హైదారాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టు లో ఇవాళ రోజుకి లక్షమంది ప్రయాణికుల రాకపోకలున్నాయి. ఆ నేపధ్యంలో... విశాఖ ఎయిర్ పోర్టును విస్తరించాలనుకున్నప్పుడు.. విశాఖలో రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి.. భోగాపురం విమానాశ్రయానికి అంత భూమి అవసరం లేదు అని చెప్పడమే మా పార్టీ ఉద్దేశ్యం. ఇవాళ భోగాపురం విమానాశ్రయం కూడా ఇంచుమించు 2203 ఎకరాలకు పరిమితం చేశాం. ఆ కల ఇవాళ సాకారమైందని గుడివాడ అమర్నాద్ స్పష్టం చేశారు.