భోగాపురం ఎయిర్‌పోర్ట్ జగనన్న విజన్..

క్రెడిట్ చోరీకి టీడీపీ ప్రయత్నం సిగ్గుచేటు

 విజయనగరం జిల్లా అధ్యక్షుడు మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు(చిన్న శ్రీను)

విజయనగరం : భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తిగా వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజన్‌ ఫలితమని, ఈ ప్రాజెక్టు క్రెడిట్‌ను దొంగిలించేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు సిగ్గుచేటని వైయ‌స్ఆర్‌సీపీ  విజయనగరం జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్‌, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు(చిన్న శ్రీను) తీవ్రంగా విమర్శించారు. మంగళవారం ధర్మపురిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు.

జగనన్న కృషితోనే రన్‌వేపై విమానం ల్యాండ్‌ 
చంద్రబాబు నాయుడు లక్ష్యం అభివృద్ధి కాదని, భూదందానేనని చిన్న శ్రీను ఆరోపించారు. గతంలో ఎయిర్‌పోర్ట్ పేరుతో వేలాది ఎకరాల భూములు కొట్టేయాలని ప్రయత్నించి రైతులను ఇబ్బంది పెట్టారని, అమరావతి, హైటెక్ సిటీ తరహాలోనే భోగాపురంలోనూ 15 వేల ఎకరాలు సేకరించాలన్న యత్నం చేశారని తెలిపారు. అప్పట్లో రైతుల పక్షాన నిలబడి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోరాడటంతోనే చంద్రబాబు వెనక్కి తగ్గాల్సి వచ్చిందన్నారు. వైయ‌స్‌ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను కేవలం 2,200 ఎకరాల్లో నిర్మించాలనే స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. భూసేకరణ, అనుమతులు, కోర్టు కేసులు, పరిహారం వంటి అన్ని అడ్డంకులను తొలగించి ప్రాజెక్టును పట్టాలెక్కించారని గుర్తు చేశారు. జగనన్న కృషితోనే ఈ రోజు రన్‌వేపై విమానం ల్యాండ్‌ అయ్యే స్థాయికి ప్రాజెక్టు చేరిందని, ఇది ఉత్తరాంధ్ర ప్రజలందరికీ గర్వకారణమని పేర్కొన్నారు.

క‌ల సాకారం చేసిన వైయ‌స్‌ జగన్‌

2019 ఎన్నికల ముందు టెంకాయలు కొట్టి శిలాఫలకాలు వేయడం తప్ప టీడీపీకి ఎలాంటి అభివృద్ధి దృష్టి లేదని చిన్న శ్రీను ఎద్దేవా చేశారు. వైయ‌స్‌ జగన్ చేసిన కృషిని తమ ఖాతాలో వేసుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోందని, అయితే వైయ‌స్ఆర్‌సీపీ సోషల్ మీడియా దాటికి వారి క్రెడిట్ చోరీ ప్రయత్నాలు విఫలమయ్యాయని అన్నారు. GMR సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని 2026 నాటికి భోగాపురం ఎయిర్‌పోర్ట్ పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో వైయ‌స్‌ జగన్ ప్రణాళికాబద్ధంగా వ్యవహరించారని తెలిపారు. ఈ విషయాన్ని స్వయంగా GMR సంస్థ అధినేత కూడా స్పష్టం చేశారని గుర్తు చేశారు. ఉత్తరాంధ్ర తలరాతను మార్చే ఈ మహత్తర ప్రాజెక్టును సాకారం చేసిన వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తశుద్ధిని అభినందిస్తూ, పనులను వేగంగా, సకాలంలో చేపడుతున్న GMR సంస్థకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.  సమావేశంలో వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు కెవి సూర్యనారాయణ రాజు, నెక్కల నాయుడు బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహమూర్తి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు జైహింద్ కుమార్, మండల పార్టీ అధ్యక్షులు ఉప్పాడ సూర్యనారాయణ, పతివాడ అప్పలనాయుడు, మాజీ జెడ్పిటిసి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top