గుంటూరు: ఈ నెల 10వ తేదీ(మంగళవారం) గుంటూరు నగరంలోని శ్రీ కన్వెన్షన్ వేదికగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు హాజరుకానున్న నేపథ్యంలో ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, పార్టీ నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ షేక్ నూరి ఫాతిమా పార్టీ ముఖ్య నాయకులతో కలిసి కార్యక్రమ ప్రదేశాన్ని సందర్శించి ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇఫ్తార్ విందు విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై నిర్వాహకులతో చర్చించి పలు సూచనలు చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఇఫ్తార్ దావత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. కార్యక్రమానికి ముస్లిం మత పెద్దలు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, మాజీ ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్, మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ ఖాదర్ బాషా, కదిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మక్బూల్, ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా, తెనాలి నియోజకవర్గ అబ్జర్వర్ గులాం రసూల్ తదితరులు పాల్గొన్నారు.