కబ్జా భూమిలో గీతం వర్సిటీ పనులు తక్షణమే ఆపండి

విశాఖ జిల్లా కలెక్టర్‌కు వైయస్ఆర్‌సీపీ నేతల విజ్ఞప్తి
 

విశాఖపట్నం: నారా లోకేష్‌ తోడల్లుడు, విశాఖ ఎంపీ భరత్‌కు చెందిన గీతమ్‌ యూనివర్సిటీ, అక్రమంగా ఆక్రమించిన భూమిని చదును చేస్తూ, నిర్మాణ పనులు మొదలు పెడురతోందని వైయస్ఆర్‌సీపీ విశాఖ జిల్లా నేతలు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే జోక్యం చేసుకుని, ఆ పనులన్నీ ఆపేయించాలని వారు డిమాండ్‌ చేశారు.
    గీతమ్‌ యూనివర్సిటీ 54 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేయగా, దాన్ని జీవీఎంసీ (గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌) సమావేశంలో ఏకగ్రీవ తీర్మానంతో క్రమబద్ధీకరించారు. ఆరోజు విపక్ష వైయస్ఆర్‌సీపీ సభ్యులను ఆ సమావేశానికి రానివ్వలేదు. దీంతో గీతమ్‌ యూనివర్సిటీ భూకబ్జా వ్యవహారం ఇప్పుడు కోర్టు విచారణ పరిధిలో ఉండగా, ఆ భూమిలో అధికారులు హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. అయితే అధికార దుర్వినియోగంతో, ఆ బోర్డులు తొలగించిన గీతం వర్సిటీ యాజమాన్యం, ఆ భూమిని చదును చేస్తూ, నిర్మాణ పనులు మొదలుపెట్టింది.
    దీంతో వైయస్ఆర్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కెకె రాజు, విశాఖ సౌత్‌ నియోజకవర్గం వైయస్ఆర్‌సీపీ ఇంఛార్జ్‌ వాసుపల్లి గణేష్‌కుమార్‌ నేతృత్వంలో వందలాది మంది గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదుకు బయలు దేరడంతో, వారిని కలెక్టరేట్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఎట్టకేలకు కేవలం 200 మందిని మాత్రమే అనుమతించి, లోపలికి పంపారు. అయితే అంత మంది నుంచి ఫిర్యాదు స్వీకరించలేమని, గ్రీవెన్స్‌ సెల్‌లో కలెక్టర్‌ చెప్పడంతో, వైయస్ఆర్‌సీపీ నాయకులు గట్టిగా నిలదీశారు. అయినా పరిమిత సంఖ్యలోనే జిల్లా అధికారులు వారి నుంచి ఫిర్యాదు స్వీకరించారు.
    అనంతరం మీడియాతో మాట్లాడిన కెకె రాజు.. గీతమ్‌ వర్సిటీ భూముల ఆక్రమణను అడ్డుకోవాలని ఈరోజు కలెక్టర్‌ వద్దకు వస్తే, సాంకేతిక కారణాలు చూపి, కలెక్టరేట్లో వినతిపత్రాలు తీసుకోలేదని వెల్లడించారు. వందలాది మంది తరలివస్తే, పోలీసులు అడ్డుకున్నారని, ఇంకా బెదిరించారని చెప్పారు. ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ, «అధికారులు తమ బాధ్యత నిర్వర్తించడం లేదని, వారు ఇప్పటికైనా న్యాయబద్దంగా, చట్టబద్ధంగా వ్యవహరించాలని కోరారు. అధికారులు వెంటనే ఆ భూమిలో గీతం వర్సిటీ పనులన్నీ ఆపేయించాలని డిమాండ్‌ చేశారు. దాదాపు రూ.5 వేల కోట్ల విలువైన భూమిని కాపాడడం కోసం ప్రజా సంఘాలను కలుపుకుని పోరాడుతామని కెకె రాజు వెల్లడించారు.
    విశాఖ సౌత్‌ నియోజకవర్గం వైయస్ఆర్‌సీపీ ఇంఛార్జ్‌ వాసుపల్లి గణేష్‌కుమార్‌ మాట్లాడుతూ.. అధికారులు ఇకనైనా జోక్యం చేసుకుని, గీతం వర్సిటీ కబ్జా భూమిలో చేస్తున్న పనులను ఆపేయించాలని కోరారు. తాము అధికారంలోకి రాగానే, ఆ భూములన్నీ తిరిగి స్వాధీనం చేసుకుంటామని, అక్రమ నిర్మాణాలను కూల్చేస్తామని ఆయన చెప్పారు.

Back to Top