కూటమి పాలనలో రైతులు విలవిల‌

మాజీ మంత్రి  కాకాణి గోవర్ధన్ రెడ్డి ధ్వ‌జం

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా : కూటమి ప్రభుత్వ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి విమర్శించారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం ఈదూరు గ్రామంలో ఆయన పర్యటించి స్థానికులతో మాట్లాడారు.

ఈ సందర్భంగా కాకాణి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని అన్నారు. గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు ప్రజలు తమ సమస్యలను వచ్చి చెప్పుకుంటున్నారని తెలిపారు. ఎప్పుడైతే చంద్ర‌బాబు అధికారంలో ఉంటారో అప్పుడల్లా రైతులకు కష్టాలే మిగులుతాయని విమర్శించారు. రైతులకు ఎకరాకు మూడు బస్తాల యూరియా ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు యూరియా కార్డులు జారీ చేసి పరిమితులు విధించిందని ఆరోపించారు. సరిపడా ఎరువులు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రస్తుతం వరి కోతలు ప్రారంభమయ్యాయని, పుట్టి వడ్ల ధర రూ.20,300 ఉండాల్సి ఉండగా సుమారు రూ.19,000కే పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.

తిరుమల లడ్డూ వ్యవహారాన్ని కూడా కాకాణి ప్రస్తావిస్తూ, కూటమి నాయకుల స్వార్థ రాజకీయాల కోసం దేవాలయ విషయాలను రాజకీయాల్లోకి లాగారని విమర్శించారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని ప్రచారం చేయడం డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగమని ఆరోపించారు. కోట్లాది మంది భక్తులు దర్శించుకునే తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం తగదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కూడా దెబ్బతిన్నాయని, మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని అన్నారు. గంజాయి, మద్యం విచ్చలవిడిగా లభిస్తున్నాయని విమర్శించారు. వరిగొండలో మైనర్ బాలికపై జరిగిన దాడి సభ్య సమాజం తలదించుకునే ఘటనగా అభివర్ణించారు. ఆ బాలిక కుటుంబాన్ని త్వరలో పరామర్శించి వారికి అండగా నిలుస్తామని చెప్పారు.

ప‌రామ‌ర్శ‌
ఇటీవల మృతి చెందిన వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తూపిలి సుబ్బ రామిరెడ్డి కుటుంబ సభ్యులను కాకాణి పరామర్శించారు. జిల్లాలో పోలీస్ అధికారులు శాంతిభద్రతలను పట్టించుకోకుండా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడంలో మక్కువ చూపుతున్నారని ఆరోపించారు. కృష్ణపట్నం పోర్ట్ సీఐ రవి నాయక్‌పై పూర్తిస్థాయి విచారణ జరిపి, తప్పులు రుజువైతే విధుల నుండి శాశ్వతంగా తొలగించాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో ఎక్కడ పర్యటించినా స్వర్గీయ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి, వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హయాంలో చేసిన అభివృద్ధి పనులే ప్రజలకు గుర్తుకు వస్తున్నాయని కాకాణి అన్నారు. సిమెంట్ రోడ్లు, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌ల వంటి అనేక అభివృద్ధి పనులు అప్పుడే జరిగాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కుంటుపడ్డాయని విమర్శించారు. ప్రజల సమస్యలను పట్టించుకునే పరిస్థితి లేదని, రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో మళ్లీ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నాయకత్వంలో ప్రజల ప్రభుత్వం రావాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు.

Back to Top