తాడేపల్లి: రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ సోమవారం వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు పార్టీ శ్రేణులు, ప్రజలు రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత ఆందోళనలు నిర్వహించారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు, వినూత్న నిరసనలు చేపట్టి.. అధికారులకు డిమాండ్ పత్రాలు అందజేశారు. పెరిగిన ఇంధన ధరల వల్ల సామాన్యులు, రైతులు, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర భారం పడుతోందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు: గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌లోనే పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయని విమర్శించారు. అధికారంలోకి రాకముందు ట్యాక్సులు తగ్గించి ధరలు తగ్గిస్తామని చెప్పిన నారా లోకేష్ ఇప్పుడు మాట మార్చారని మండిపడ్డారు. “లోకేష్ కాదు.. ఆయన పేరు లవ్ క్యాష్” అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ధరలు తగ్గించకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. విజయవాడ పశ్చిమలో వెలంపల్లి నిరసన విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. విద్యాధరపురం తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆటోను తాళ్లతో లాగుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ మర్చిపోయారని విమర్శించారు. విజయవాడలో దేవినేని అవినాష్ వినూత్న నిరసన ఎన్నికల సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్య ప్రజలపై భారాలు మోపుతున్న కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు, తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జ్ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో వినూత్న నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో భారీ సంఖ్యలో వైయస్ఆర్‌సీపీ శ్రేణులు, ఆటో కార్మికులు, ప్రజలు పాల్గొన్నారు. ఎడ్లబండిపై బైక్‌లను ఎక్కించి నిరసన వ్యక్తం చేసిన దేవినేని అవినాష్.. ఎడ్లబండి లాగుతూ “ప్రజలకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి” అంటూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పెట్రోల్, డీజిల్ ధరల్లో అగ్రస్థానంలో నిలిపిన కూటమి ప్రభుత్వం వెంటనే ధరల మంటను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. అనంతరం పటమట వీఎంసీ సర్కిల్-3 కార్యాలయంలో ఎంఆర్ఓకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, సోషల్ మీడియా ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ దొడ్డా అంజిరెడ్డి, వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, డివిజన్ స్థాయి నాయకులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కార్యకర్తలు, సోషల్ మీడియా నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లాలో దేవభక్తుని చక్రవర్తి పాదయాత్ర కృష్ణాజిల్లాలో దేవభక్తుని చక్రవర్తి ఆధ్వర్యంలో తాడిగడప నుంచి మున్సిపాలిటీ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించి, మున్సిపల్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ప్రజలకు ఇంధనం వాడకం తగ్గించుకోవాలని సలహాలు ఇవ్వడం చేతకాని ప్రభుత్వ లక్షణమని విమర్శించారు. నెల్లూరులో కాకాణి, చంద్రశేఖర్ రెడ్డి రిక్షా ర్యాలీ నెల్లూరులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో రిక్షాపై నిరసన ర్యాలీ నిర్వహించారు. బారకాసు సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ సాగింది. “పెట్రోల్ బంక్ దగ్గర సెల్ఫీలు దిగిన లోకేష్.. ఇప్పుడు ప్రజల బాధలు చూడాలి” అంటూ కాకాణి విమర్శించారు. బొబ్బిలి, విజయనగరంలో వినతిపత్రాలు విజయనగరం జిల్లా బొబ్బిలి, విజయనగరం నియోజకవర్గాల్లో వైయస్ఆర్‌సీపీ నాయకులు స్థానిక ఎమ్మార్వోలకు వినతిపత్రాలు అందజేశారు. పెంచిన ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కైకలూరులో దూలం నాగేశ్వరరావు నిరసన ఏలూరు జిల్లా కైకలూరులో మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, రాష్ట్ర ప్రజలపై భారీ భారం మోపుతున్నారని విమర్శించారు. తాడేపల్లిగూడెంలో వడ్డీ రఘురామ్ ఆధ్వర్యంలో ఆందోళన తాడేపల్లిగూడెంలో వైయస్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్ వడ్డీ రఘురామ్ నాయుడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించి, ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. పెందుర్తిలో అన్నంరెడ్డి అదీప్ రాజ్ వినూత్న నిరసన విశాఖ జిల్లా పెందుర్తిలో మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం వద్ద వినతిపత్రం సమర్పించారు. గుడివాడలో పోలీసుల అడ్డంకులు గుడివాడలో వైయస్ఆర్‌సీపీ నాయకులు ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సామాన్యుడి నడుము విరిగిపోయిందని నేతలు మండిపడ్డారు. అనంతపురంలో భారీ ర్యాలీ అనంతపురంలో లలిత కళాపరిషత్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పెరిగిన ధరలతో రాష్ట్ర ప్రజలపై ఏటా రూ.3,600 కోట్ల అదనపు భారం పడుతోందని నేతలు ఆరోపించారు. రైల్వే కోడూరులో దున్నపోతుతో నిరసన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కోడూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ నిరసన చేపట్టారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి టోల్‌గేట్ వద్ద ఉన్న వైయస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటోలను ఎనుములకు కట్టేసి లాగిస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. వామపక్ష నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కొరముట్ల శ్రీనివాసులు.. “ఆంధ్రప్రదేశ్‌లోనే పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధికంగా ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం మరో ‘బాదుడే బాదుడు’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎన్నికల ముందు పెట్రోల్ ధరలు తగ్గిస్తామని మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేసింది” అని విమర్శించారు. “గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో అమలైన సంక్షేమ, అభివృద్ధి పథకాలను రద్దు చేయడమే కాకుండా ఇప్పుడు పెట్రో ధరల పెంపుతో సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారు. తాజా పెంపుతో రాష్ట్రంలో లీటర్ పెట్రోల్ ధర రూ.113.62, డీజిల్ ధర రూ.101.24కు చేరింది” అని తెలిపారు. “మన రాష్ట్రంలో లీటర్ పెట్రోల్‌పై 31 శాతం వ్యాట్‌తో పాటు రూ.4 అదనపు పన్ను, మరో రూపాయి రోడ్ డెవలప్‌మెంట్ సెస్ వసూలు చేస్తున్నారు. డీజిల్‌పై 22.25 శాతం వ్యాట్‌తో పాటు అదనపు భారం వేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వ్యాట్ తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలి” అని కొరముట్ల శ్రీనివాసులు డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. కొత్తపేటలో వినూత్న నిరసన పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో కొత్తపేట నియోజకవర్గంలో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. కొత్తపేట గ్రామంలో గొల్లపల్లి డేవిడ్ రాజు ఇంటి ఎదురుగా ఉన్న పెట్రోల్ బంక్ వద్ద చేపట్టిన ఈ నిరసనలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోతూ సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతోందని ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం అక్కడి నుంచి కొత్తపేట ఆర్‌డీవో కార్యాలయం వరకు ఒక రిక్షాపై మోటార్ సైకిల్‌ను ఎక్కించి, స్వయంగా రిక్షా తొక్కుతూ వినూత్న ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని కోరుతూ ఆర్‌డీవోకు వినతిపత్రం అందజేశారు. ప్రజల సమస్యలపై వైయస్ఆర్‌సీపీ ఎప్పటికీ పోరాటం చేస్తూనే ఉంటుందని చిర్ల జగ్గిరెడ్డి స్పష్టం చేశారు. పాణ్యంలో కాటసాని రాంభూపాల్‌రెడ్డి నిరసన పాణ్యం నియోజకవర్గంలో కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎద్దుల బండ్లు, ఆటోలను తాడుతో లాగుతూ నిరసన తెలిపారు. నంద్యాల జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, స్టేట్ యూత్ వైస్ ప్రెసిడెంట్ కాటసాని శివనరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఈ భారీ ర్యాలీ చేపట్టారు. కల్లూరులోని కాటసాని రాంభూపాల్‌రెడ్డి స్వగృహం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించిన వైయస్ఆర్‌సీపీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైయస్ఆర్‌సీపీ నేతలు మాట్లాడుతూ.. “అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించి నిత్యావసర సరుకులను ప్రజలకు అందుబాటులో ఉంచుతామని చెప్పిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు ప్రజలపై భారాలు మోపుతోంది” అంటూ మండిపడ్డారు. అనంతరం పెంచిన ఇంధన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ పార్లమెంటరీ కమిటీ కార్యదర్శి, నంద్యాల అసెంబ్లీ పరిశీలకులు సద్దల సూర్యనారాయణరెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, పెద్దపాడు శ్రీధర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, వైయస్ఆర్‌సీపీ అనుబంధ విభాగాల రాష్ట్ర, జిల్లా, మండల కమిటీల అధ్యక్షులు, కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నంద్యాలలో వైయస్ఆర్‌సీపీ భారీ ర్యాలీ.. రాష్ట్రంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ నంద్యాలలో వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. వైయస్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి, మాజీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల నూనెపల్లి నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వైయస్ఆర్‌సీపీ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైయస్ఆర్‌సీపీ నేతలు మాట్లాడుతూ.. “అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించి నిత్యావసర సరుకులను ప్రజలకు అందుబాటులో ఉంచుతామని చెప్పిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు ప్రజలపై భారాలు మోపుతోంది” అంటూ మండిపడ్డారు. “దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లోనే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి ప్రజలకు తీవ్ర భారం మోపుతున్నారు” అని ఆరోపించారు. అనంతరం పెంచిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి, మాజీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, మాజీ స్టేట్ మార్క్‌ఫెడ్ చైర్మన్ పీపీ నాగిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు అమీర్, మాజీ మున్సిపల్ చైర్మన్ మాబున్నిసా తదితరులు పాల్గొన్నారు. ఉదయగిరిలో వినూత్న నిరసన మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ ఉదయగిరి నియోజకవర్గ కేంద్రంలో వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. వైయస్ఆర్‌సీపీ ఉదయగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ మేకపాటి రాజగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన స్వయంగా ఎద్దుల బండి నడుపుతూ నిరసన తెలిపారు. భారీ సంఖ్యలో వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారీ ర్యాలీ అనంతరం స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందజేశారు. సైకిల్ తొక్కుతూ పేర్ని కిట్టు వినూత్న నిరసన రాష్ట్రంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. మచిలీపట్నం నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్, సమన్వయకర్త పేర్ని కిట్టు ఆధ్వర్యంలో ఈ ఆందోళన చేపట్టారు. మచిలీపట్నం లక్ష్మీ టాకీస్ సెంటర్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం రిక్షా తొక్కుతూ, ఎడ్ల బండిపై కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీకి వినతిపత్రం అందజేశారు. కాకినాడలో వైయస్ఆర్‌సీపీ ధర్నా రాష్ట్రంలో పెంచిన ఇంధన ధరలను నిరసిస్తూ కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ పరిధిలోని సర్పవరం జంక్షన్ వద్ద వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి విశాఖ, విజయనగరం జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు పాల్గొన్నారు. అనంతరం సర్పవరం నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. “చంద్రబాబుకు ప్రచారం తప్ప పరిపాలన చేతకాదు. ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని టీడీపీ తన మేనిఫెస్టోలో పెట్టింది. ఇప్పుడు ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేశారా?” అంటూ మండిపడ్డారు. ఒంగోలులో శాంతియుత నిరసన రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరగడాన్ని నిరసిస్తూ ఒంగోలు నగరంలో వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ భవన్ వద్ద నుంచి ఆర్‌డీవో కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వెళ్లిన వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పెంచిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆర్‌డీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు అసెంబ్లీ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు, వెంకటేశ్వర్లు నాయుడు, కసుకుర్తి అదెన్న, కటారి శంకర్, డివిజన్ అధ్యక్షులు, మహిళా అధ్యక్షులు, మహిళా కార్యకర్తలు, సీనియర్ నాయకులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు. గుడివాడలో ఆర్డీఓకు వినతిపత్రం రాష్ట్రంలో పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ గుడివాడలో వైయస్ఆర్‌సీపీ శ్రేణులు భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, మట్ట జాన్ విక్టర్, పేయ్యల ఆదాము, పొట్లూరు కృష్ణారావు, లోయ రాజేష్, తోట నాగరాజు, రేమల్లి నీలాకాంత్, కొంకితల ఆంజనేయ ప్రసాద్, అడబాల అప్పారావు, కలపాల కిరణ్, జోషీ, చుండూరు శేఖర్, పిన్నమనేని రాఘవేందర్‌రావు, దేశిరెడ్డి రామ్మోహన్‌రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, గంట శీను, ఆడప హర్ష, వన్నెం రెడ్డి దినేష్ తదితరులు పాల్గొన్నారు. పెనుకొండలో నిరసన ర్యాలీ పెనుకొండ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించి, ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం మరిచిపోయిందని విమర్శించారు. కోడుమూరులో డాక్టర్ ఆదిమూలపు సతీష్ పాదయాత్ర కోడుమూరులో డాక్టర్ ఆదిమూలపు సతీష్ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించి వినతిపత్రం అందజేశారు. ధరలు తగ్గించకపోతే మరింత తీవ్ర ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కడపలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా కడప నగరంలో మాజీ డిప్యూటీ సీఎం ఎస్‌బి అంజాద్‌బాషా, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి తదితరులు ఆర్డీఓ కార్యాలయం వద్ద శాంతియుత నిరసన చేపట్టారు. పత్తికొండలో తాడుతో ఆటో లాగిన శ్రీదేవి కర్నూలు జిల్లా పత్తికొండలో మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి తాడుతో ఆటోను లాగుతూ నిరసన తెలిపారు. రైతులు పాత వ్యవసాయ పద్ధతులకు వెళ్లే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. బండి ఆత్మకూరులో ఎద్దుల బండ్లతో ర్యాలీ నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో ఎద్దుల బండ్లపై ర్యాలీ నిర్వహించారు. మోటార్ బైక్‌లను తాళ్లతో లాగుతూ వినూత్న నిరసన తెలిపారు. ధర్మవరం, పుట్టపర్తి, కదిరిలో నిరసనలు శ్రీ సత్యసాయి జిల్లాలో ధర్మవరం, పుట్టపర్తి, కదిరి ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించి ఆర్డీఓలు, తహశీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు. వాల్మీకిపురంలో చింతల రామచంద్రారెడ్డి ర్యాలీ అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో గాంధీ సర్కిల్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తిరుపతిలో భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తిరుపతిలో భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి పెరిగిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. విశాఖలో ఎడ్లబండిపై కేకే రాజు విశాఖలో జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఎడ్లబండిపై ప్రయాణిస్తూ తహశీల్దార్ కార్యాలయం వరకు నిరసన తెలిపారు. పులివెందులలో బొలెరోకు తాళ్లు కట్టి నిరసన పులివెందులలో వైయస్ఆర్‌సీపీ నాయకులు బొలెరో వాహనానికి తాళ్లు కట్టి లాగుతూ ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. జమ్మలమడుగులో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ర్యాలీ జమ్మలమడుగులో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి ర్యాలీ రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి వినతిపత్రం అందజేశారు. అమలాపురంలో వైయస్ఆర్‌సీపీ నిరసన రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో అమలాపురంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో అమలాపురం మాజీ ఎంపీ చింతా అనురాధ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైయస్ఆర్‌సీపీ నాయకులు మాట్లాడుతూ.. పెంచిన ఇంధన ధరలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇంధన ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణ, బొమ్మి ఇజ్రాయిల్, అమలాపురం అసెంబ్లీ కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్, జున్నూరి రామారావు, కటకంశెట్టి ఆదిత్య, కుడిపూడి బాబు, మట్టపర్తి నాగేంద్ర, వంగా గిరిజాకుమారి, రెడ్డి సత్య నాగేంద్రమణి, కుడిపూడి భరత్, కొనుకు బాపూజీ, ఇళ్ల శేషారావు, ఖాదర్, సత్యం కాపు, అంబికా శ్రీను, జానా గణేష్, కేత భానుతేజ తదితరులు పాల్గొన్నారు.