డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా: డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గ్యాస్ లీక్ ఘటన తీవ్ర కలకలం రేపింది. మలికిపురం మండలం ఇరుసుమండ ప్రాంతంలో ఉన్న ఓఎన్‌జీసీ డ్రిల్ సైట్ నుంచి సోమవారం మధ్యాహ్నం భారీగా గ్యాస్ లీక్ అయ్యింది. దాదాపు రెండు గంటల పాటు గ్యాస్ పైకి చిమ్మడంతో పాటు మంటలు ఎగసిపడటంతో చుట్టుపక్కల గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ సంఘటనపై స్పందించిన వైయస్ఆర్‌సీపీ నేతలు చెల్లుబోయిన శ్రీనివాసరావు, చిర్ల జగ్గిరెడ్డి, జిల్లా కో-ఆర్డినేటర్లు, ఎమ్మెల్సీ బొమ్మి ఇశ్రాయేలు గారితో కలిసి ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. గ్యాస్ లీక్ కారణంగా స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని గుర్తించిన వారు, సహాయక చర్యలను వెంటనే వేగవంతం చేయాలని అధికారులను కోరారు. వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి, అమలాపురం అసెంబ్లీ కో-ఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ మాట్లాడుతూ, గ్రామస్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ఓఎన్‌జీసీ అధికారులతో నిరంతర సమన్వయం కొనసాగిస్తూ పరిస్థితిపై ఎప్పటికప్పుడు గ్రామవాసులకు స్పష్టమైన సమాచారం అందించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు బొమ్మి ఇశ్రాయేలు, కుడుపూడి సూర్యనారాయణరావు, గన్నవరం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు, కే.ఎస్.ఎన్ రాజు, రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, కటకంశెట్టి ఆదిత్య, పాటి శివ, రాజోలు నియోజకవర్గ పరిశీలకులు కర్రి పాపరాయుడు, జిల్లా సోషల్ మీడియా అధ్యక్షులు దొమ్మేటి సత్యమోహన్ తదితర వైయస్ఆర్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.