రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తాం

పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
 

గుడివాడ: రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాలని సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. గుడివాడ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి కొడాలి నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ప్రజలకు తినడానికి పనికిరాని బియ్యం సరఫరా చేశారన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ నాణ్యమైన బియ్యాన్ని అందిస్తామని మాట ఇచ్చారన్నారు. సీఎం ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి సివిల్‌ సప్లయిస్‌ డిపార్టుమెంట్‌ ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లర్లకు పంపుతున్నామన్నారు. అయితే ఈ ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమిస్తున్నామని చెప్పారు. 17 శాతం కన్నా తేమ ఎక్కవగా ఉంటే ఆరబెట్టుకోవాలన్నారు. రైతులు తెచ్చే శాంపిల్స్‌లో ఏవైనా సమస్యలుంటే అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
 
గుడివాడ వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కొడాలి నాని కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలతో ఉన్న ట్రాక్టర్‌ను ఐదు కిలోమీటర్లు నడుపుకుంటూ గుడివాడ – కంకిపాడు రోడ్డులో ఉన్న శ్రీరామా రైస్‌మిల్లుకు చేర్చారు.  రైస్‌ మిల్లులో జరుగుతున్న నాణ్యమైన బియ్యం తయారీ ప్రక్రియను పరిశీలించారు.  

Read Also: మహిళా రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది

Back to Top