ఓట్ల కోసం ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదు

తెలంగాణ సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలకు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కౌంటర్‌

ఏపీ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది

సీఎం వైయస్‌ జగన్‌ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు

అమ‌రావ‌తి: ఓట్ల కోసం తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాద‌ని ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర‌రావు పేర్కొన్నారు. తెలంగాణ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఏపీ రోడ్ల గురించి మాట్లాడిన మాటల‌కు మంత్రి కారుమూరి నాగేశ్వ‌రరావు కౌంట‌ర్ ఇచ్చారు. శుక్ర‌వారం స‌చివాల‌యంలో మీడియాతో మంత్రి మాట్లాడారు.మొత్తం దేశమంతా ఆంధ్రప్రదేశ్‌ వైపు తిరిగి చూసేలా వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం పాలన సాగిస్తుందని చెప్పారు. ఏపీ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, ఓట్ల కోసం ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని కేసీఆర్‌కు హితవు పలికారు. హైదరాబాద్‌లో వర్షం పడితే నాలాల్లో పిల్లలు కొట్టుకుపోతున్నారని గుర్తు చేశారు. ఈసారి ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్‌ వర్కౌట్‌ కాదని మంత్రి కారుమూరి అభిప్రాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్‌ పేద రాష్ట్రమని, అప్పటికప్పుడు విడదీస్తే చెట్టు కిందకు వచ్చిన వారమన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా సీఎం వైయస్‌ జగన్‌ దేశం మొత్తం ఏపీ వైపు తొంగి చూసేలా పరిపాలన సాగిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేస్తామని చెప్పారు. అన్నిసార్లు సీఎం వైయస్‌ జగన్‌ పాలనను తెలంగాణ సీఎం, మంత్రులు పొగుడుతూనే ఉన్నారు..కొన్నిసార్లు మాత్రం ఏదోవిధంగా మాట్లాడుతున్నారని తప్పుపట్టారు. ఏపీకి, తెలంగాణకు ఉన్న వ్యత్యాసం చూసి మాట్లాడాలన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పండుతున్న సన్నబియ్యమే హైదరాబాద్, చుట్టుపక్కల ప్రజలు తింటున్నారని గుర్తు చేశారు. తెలంగాణలో పండించే బియ్యం తినగలిగేవి కాదన్నారు. అందులో నూకశాతం ఎక్కువగా ఉంటుందన్నారు. ధాన్యం కొనుగోలు డబ్బులు వేగంగా రైతుల ఖాతాల్లో జమచేస్తున్నామని మంత్రి కారుమూరి తెలిపారు.  
 

Back to Top