తూర్పుగోదావరి: చెల్లని నాణాన్ని నందమూరి తారక రామారావు పేరు మీద విడుదల చేశారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ నాణెం ప్రజల్లో చలామణి అయ్యేలా ఉండాలని చెప్పారు. మంగళవారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో దొంగ ఓట్లను పుట్టించిందే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అని విమర్శించారు. ఆధార్ కార్డుతో లింక్ తర్వాత దొంగ ఓట్లు బయటికి వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన కుటుంబ సభ్యులు మళ్ళీ నిన్న కలిసినట్లుగా ఉంది అని మంత్రి వ్యాఖ్యనించారు. నిన్న జరిగిన కార్యక్రమానికి ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతిని ఎందుకు పిలువలేదని మంత్రి ప్రశ్నించారు. తూనికలు, కొలతల్లో మోసాలకు పాల్పడుతున్న పలు దుకాణాలపై కేసులు నమోదు చేశామని మంత్రి అన్నారు. నిబంధనలు పాటించని వ్యాపార సంస్థలపై టీడీపీ హయాంలో కేవలం 21 కోట్ల రూపాయల జరిమానా విదిస్తే.. వైయస్ఆర్ సీపీ పాలనలో 40 కోట్ల రూపాయల ఫైన్ వేశామని కారుమూరి తెలిపారు. నిబంధనలు పాటించని వ్యాపార సంస్థలపై 1162కు పైగా కేసులు నమోదు చేసినట్లు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చెప్పారు. 2014, 2019 ఎన్నికల్లో టైమ్స్ నౌ చెప్పినట్లుగానే వైయస్ఆర్ సీపీకి సీట్లు వచ్చాయని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. టైమ్స్ నౌ సర్వే ఈసారి మాకు 24 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పింది.. వచ్చే ఎన్నికల్లో వైయస్ఆర్ సీపీకీ 165 సీట్లు ఖాయం అంటూ ఆయన జోస్యం చెప్పారు. ఇండియా టుడే సర్వే వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసు.. సీఎం వైయస్ జగన్ కు వ్యతిరేక ఓటు లేదు.. టీడీపీ హయాంలో ఉచిత ఇసుక ఎవరికైనా అందేదా అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రశ్నించారు.