గోతులు పూడ్చటానికొచ్చి.. గోతులు తీస్తే ఎలా పవన్ కల్యాణ్..!?

వ్యవసాయ శాఖా మంత్రి  కురసాల కన్నబాబు 

 గాంధీ జయంతి నాడు పవన్ కల్యాణ్ గాడ్సే మాటలు 

 ఏ ఫిలాసఫీ లేకపోవడమే పవన్ పొలిటికల్ ఫిలాసఫీ 

  దేనికోసం వైయస్ఆర్సీపీపై యుద్ధం ప్రకటిస్తున్నావ్ పవన్ కల్యాణ్ 

 కులమే ప్రాతిపదికగా, కులాల్ని రెచ్చగొట్టేలా, కులాల ఎజెండాగా మాట్లాడటం సభ్యతా..? 

  వైయ‌స్‌ ముఖ్యమంత్రి అయితే రాజకీయాలు వదిలేస్తానన్న మీ మాట ఏమైంది పవన్ కల్యాణ్? 

 ప్రజాస్వామ్యంలో వర్గ శత్రువులు ఉంటారా..?  

  ఓటుపైన పవన్ కు అసలు నమ్మకం ఉందా.. లేదు కాబట్టే ఉగ్రవాదిలా మాట్లాడుతున్నాడు 

 ఒకసారి లెఫ్ట్ తో.. మరోసారి రైట్(బీజేపీ) తో ప్రయాణించడం పవన్ కే సాధ్యం 

   సమాజాన్ని కులాలు, మతాలుగా విడగొట్టాలనేదే పవన్ లక్ష్యంగా కనిపిస్తోంది 

  కోపాన్ని దాచుకోవాలని చెప్పే పవన్ కల్యాణ్.. ఎప్పుడైనా పాటించారా? 

 తాడేప‌ల్లి: గోతులు పూడ్చటానికొచ్చి.. గోతులు తీస్తే ఎలా పవన్ కల్యాణ్..? అంటూ వ్యవసాయ శాఖా మంత్రి  కురసాల కన్నబాబు జ‌న‌సేన అధినేత‌ను ప్ర‌శ్నించారు.  అహింసను బోధించి, సత్యాగ్రహం మార్గంలో ఏ విధంగా నడుచుకోవాలో.. దేశానికే కాదు, మొత్తం ప్రపంచానికే సందేశం ఇచ్చిన మహాత్మా గాంధీ జయంతి ఈరోజు. అటువంటి రోజున పవన్ కల్యాణ్ రోడ్లు బాగు చేస్తానని రాజమండ్రిలో శ్రమదానం అని ప్రకటించి ఒక నిమిషం 8 సెకండ్ల పాటు పార పట్టి ఫోటోలు, వీడియోల్లో పడేలా శ్రమదానం చేసి, ఆ తర్వాత నేరుగా రాజకీయ ప్రసంగం చేస్తే.. దాన్ని ఎవరైనా శ్రమదానం అంటారా..? అని నిల‌దీశారు.  పవన్ కల్యాణ్ చేసింది శ్రమదానం కాదు.. క్లాప్-కెమెరా-యాక్షన్..  ఒక నిమిషం  పార పని.. మిగతాదంతా నోటికి పని. కేవలం రెచ్చగొట్టే పని అని త‌ప్పుప‌ట్టారు.  బహుశా, ఇలా శ్రమదానం చేయడం అనేది, పవన్ కల్యాణే ఒక కొత్త ట్రెండ్ సృష్టించాడేమో. స్టార్ట్ కెమెరా.. యాక్షన్ అన్నట్టుగా శ్రమదానం చేశాడు. గాంధీ జయంతినాడు ఆయన మాటలు చూస్తే ఆశ్చర్యం వేసింది. వైయస్ఆర్ సీపీ మీద యుద్ధం ప్రకటిస్తున్నాన్న ఆయన మాటలు.. గాంధీజీ మాటలు లా లేవు.. అవి గాంధీజీని పొట్టన పెట్టుకున్న గాడ్సే మాటల్లా ఉన్నాయి. 

 వైయస్ఆర్ సీపీ మీద యుద్ధం ప్రకటిస్తున్నానని.. ఏ సైజు యుద్ధమో.. మమ్మల్నే తేల్చుకోమంటున్నాడు. యుద్ధానికి సైజులు ఎలా ఉంటాయో మాకైతే తెలియదు. దేనికోసం జగన్ మోహన్ రెడ్డిగారి మీద ఈ రాజకీయ పార్టీ యుద్ధం  ప్రకటించిందని అడుగుతున్నాను. 
- ఏ స్థాయి యుద్ధం కావాలో తేల్చుకోండి అంటే.. అది బాధ్యతారాహిత్యం కాదా..? మీకు యుద్ధాలు సరదాగా ఉన్నట్టు ఉన్నాయి. 12 ఏళ్ళలో ఒక్కసారి అయినా ఎమ్మెల్యే గా కూడా గెలవలేదన్న బాధ మీ కళ్ళల్లో కనిపిస్తుంది. అంతకుమించి, జగన్ మోహన్ రెడ్డిగారి మీద ఈర్ష్య, ద్వేషం, అసూయ మీ మాటల్లో కనిపిస్తుంది. 
- డెమోక్రసీపైన మీకు అసలు నమ్మకం ఉందా.. ఏ సైజు యుద్ధం కావాలని అడుగుతున్నారు. యుద్ధం అంటే ఏమిటి.. ఎన్నికల యుద్ధమా..? అదే అయితే, పార్లమెంటు, అసెంబ్లీ, జిల్లా పరిషత్, మండలాలు, మున్సిపల్, పంచాయతీలు... అన్నీ చూశాం. వేరే యుద్ధమైతే మీరే స్పష్టంగా చెప్పండి. 
- ప్రజా స్వామ్యంలో యుద్ధాలు ఎక్కడ ఉంటాయి. రాచరికాల్లో మాత్రమే ఉంటాయి. ఎన్నికల్లో గెలవకపోవడమే మీ ఫ్రస్ట్రేషన్ కు కారణమైతే.. ఒక కులం భుజాల మీదో తుపాకీ పెట్టి కాలుస్తామంటే ఎలా..?

వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిగారు పేదరికం మీద యుద్ధాన్ని ప్రకటించారు. జగన్ మోహన్ రెడ్డిగారు వ్యవస్థలను బాగు చేయడం కోసం, సమస్యలను పరిష్కరించడం కోసం యుద్ధం ప్రకటించారు. అన్నింటికీ మించి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కోసం ఎన్ని యుద్ధాలైనా చేస్తారు. 
- కోవిడ్ లాంటి కష్టకాలంలో నేరుగా ప్రజల అకౌంట్లలో లక్ష కోట్ల రూపాయల ధనాన్ని వారికి ఇచ్చినందుకు మీరు యుద్ధం ప్రకటించారా..? తింటానికి తిండికి లేక, వైద్యానికి కష్టమైన పరిస్థితుల్లో పేదల కడుపు నింపి, ఆరోగ్యానికి భరోసా కల్పిస్తే... ఆ వర్గాలు బాగుంటాయని నమ్మి జగన్ గారు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ఒక స్థోమత కలిగిన ధనిక కుటుంబాలు మాదిరిగానే, ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల  పిల్లలకు కూడా ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీషు మీడియం బోధించాలి, నాడు- నేడు కార్యక్రమం ద్వారా కార్పొరేట్ తరహాలో ప్రభుత్వ స్కూళ్ళు ఉండాలి, పేదవాళ్ళు పెద్ద చదువులు చదవాలి, ప్రభుత్వ వైద్య శాలలు బాగుచేసి.. ప్రతి ఒక్కరికీ ఉచితంగా వైద్యం అందిస్తుండటంపై మీరు యుద్ధం ప్రకటించారా..?

  2009లో ఆనాడే దివంగత నేత వైయస్ రాజశేఖరరెడ్డిగారి మీద మీరు ఏం మాట్లాడారో చూశాం. 2014లో తెలుగుదేశానికి మద్దతుగా రాజకీయాలు నడిపిన మీ యుద్ధమేమిటో చూశాం. 2019లో చెట్టు చాటు నుంచి సాయం చేసిన విధంగా మీరు చేసిన యుద్ధమేమిటో చూశాం. 
- 12 ఏళ్ళ మీ రాజకీయంలో మీరు మాట్లాడేటటువంటి భాష,మీ హావభావాలు,  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు ఎప్పుడైనా మాట్లాడారా..?
- ప్రజల్ని రెచ్చగొట్టేలా మీరు మాట్లాడుతున్నారు.. ప్రజల దృష్టిలో మీ పట్ల ఎలాంటి చులకన  భావం ఉందో మీఅంతట మీరే ఒక్కసారి ఆలోచన చేసుకోండి.
-  ఇక అన్నీ అయిపోయాయి, కులాల పట్ల మీకు దృష్టి మారింది. కులాన్ని ప్రాతిపదికగా చేసుకుని రాజకీయం చేద్దామనేది మీ ప్రసంగంలో అందరికీ అర్థమైంది. తెలుగుదేశం పార్టీకి అంత శక్తి లేదు.. అందుకే నేను చేయాలని అనుకుంటున్నాను అంటున్నారు, టీడీపీకి జవజీవాలు ఇవ్వడానికే కదా మీరు ప్రతి సందర్భంలో వారికి మద్దతు ఇస్తున్నారు. మీవన్నీ ఉమ్మడి రాజకీయాలు, ఉమ్మడి వ్యవహారాలే కదా.. ?
- సినిమాకు, సినిమాకు మధ్య షూటింగ్ గ్యాప్ లో వచ్చి మాట్లాడి వెళ్ళిపోవడం.. కులాల్ని రెచ్చగొడితే, కులాల కుంపట్ల మధ్య ప్రజల్లో అస్థిరత రావాలి, అప్పుడు మీరు అధికారంలోకి రావాలని కుట్రలు చేస్తున్నారు. 

 ఈరోజు రాష్ట్ర ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి జగన్ గారిని గుండెల్లో పెట్టుకుంటున్నారు కాబట్టి, ఏ ఎన్నికల్లో అయినా జగన్ గారికి ప్రజలు మద్దతు పలుకుతూ ముందుకు తీసుకువెళుతున్నారు. 2019 సాధారణ ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలు, 22 పార్లమెంటు స్థానాలు గెలిపించి, ఆ తర్వాత వచ్చిన ప్రతి ఎన్నికల్లోనూ అంతకుమించి అత్యధికంగా ఓట్ల శాతం ఇచ్చి.. జగన్ మోహన్ రెడ్డిగారికి వెన్నుదన్నుగా నిలవడంతో ప్రతిపక్ష పార్టీలకు కడుపు మంటగా ఉందా..?

 రోడ్లు బాగు చేయాలి, వర్షాకాలం వెళ్ళినవెంటనే రూ. 2200 కోట్లతో రోడ్లు బాగు చేస్తాం అని చెబితే.. ఎలాగూ రోడ్లు వేస్తారు కాబట్టి, మీ పోరాటం వల్లే రోడ్లు వేశారు అని చెప్పుకోవడానికి చీప్ ట్రిక్స్ ఎందుకు చేస్తున్నారు..? ఎంతకాలం ఈ డ్రామా పాలిటిక్స్ చేస్తారు. ఎంతకాలం ప్రజలను మభ్యపెట్టాలని చూస్తారు..? మీరేంటే ఈ పాటికే ప్రజలకు తెలుసు. 

 2014లో పార్టీ పెట్టినప్పుడు కుల, మత ప్రస్తావన లేని రాజకీయం చేస్తామని చెప్పారు. అప్పటి నుంచీ ఈరోజు వరకు కులాన్ని, మతాన్ని ప్రస్తావించకుండా పవన్ కల్యాణ్ ఏరోజైనా మాట్లాడారా..?
- ఈరోజు కులం చుట్టూనే పవన్ కల్యాణ్ మాట్లాడాడు. కులమే ప్రాతిపదికగా మాట్లాడాడు. కులాల్ని రెచ్చగొట్టేలా, కులాల ఎజెండాగా మాట్లాడటం సభ్యతా..?
-కులాన్ని రెచ్చగొట్టి, కులం ఎజెండాగా భవిష్యత్తులో రాజకీయం చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పినట్టు అర్థమైంది. 

 పార్టీ పెట్టినప్పుడు పవన్ కల్యాణ్ మాట్లాడిన మొట్టమొదటి సభలో కాపులు తనను ఓన్ చేసుకోమని అడిగానా అని మాట్లాడాడు. ఈరోజు కాపుల ఉద్యమం చేస్తున్న నాయకుడ్ని అణగదొక్కారు అని మాట్లాడుతున్నాడు.  ఆ నాయకుడు ఉద్యమం చేస్తున్నప్పుడు అసలు మీరు ఎక్కడ ఉన్నారు..?. ఆయన మీద, ఆయన కుటుంబం మీద అప్పటి టీడీపీ ప్రభుత్వం అత్యంత అవమానకర రీతిలో వ్యవహరిస్తుంటే.. ఇది తప్పు అని ఆరోజు చెప్పగలిగారా..? దీక్ష చేస్తున్న పద్మనాభం గారి కుటుంబ సభ్యుల్ని, మహిళల్ని అవమానించి,  జైల్లో బంధించినట్టుగా ఆసుపత్రిలో బంధిస్తే.. చూడటానికి వస్తున్న రాజ్యసభ సభ్యుడు చిరంజీవి గారిని రాజమండ్రి ఎయిర్  పోర్టులోనే నిర్బంధించి, ఆయనపై కేసు పెడితే మీరు ఎక్కడున్నారు, ఏమైపోయారు, ఏమైపోయింది మీ చిత్తశుద్ధి.. ఏమైపోయింది కాపుల పట్ల మీ ప్రేమ.. ? ఈరోజు కాపులను అణగదొక్కేస్తున్నట్లు మాట్లాడితే అయిపోతుందా..?

 వచ్చిందేమో గోతులు పూడ్చేందుకు చేపట్టిన నిరసన కార్యక్రమానికి.. అక్కడ ప్రసంగం చేసిందేమో కులాల ప్రస్తావన, కులాలను ఎగదోసే కార్యక్రమం, గోదావరి జిల్లాల నుంచే ఈ మార్పు రావాలని కాపుల్ని రెచ్చగొట్టే కార్యక్రమం. కాపులు ముందు ఉండాలని చెప్పడం అంటే.. మీ భవిష్యత్తు రాజకీయాన్ని ఒక కులాన్ని ముందు పెట్టి నడిపించాలని కాదా..
- కాపు, తెలగ, బలిజ, ఒంటరి అందరూ కలిసి ముందుకు వచ్చి, పెద్దన్న పాత్ర  పోషించాలని అంటున్నారు.  ఎవరు మాట్లాడిస్తే మాట్లాడుతున్న మాటలు ఇవి..?
- గోతులు పూడ్చే వంకతో.. కులాల్ని రెచ్చగొట్టడమే మీ పనా.. గోతులు పూడుస్తున్నారా.. లేక గోతులు తీస్తున్నారా..?
- విజ్ఞత ఉన్నవాళ్ళు ఎవరైనా.. కులాల అంతరం గురించి, మతాల గురించి మాట్లాడతారా.. రెడ్లు, కమ్మలే పాలించాలా అని మాట్లాడతారా.. అంటే మీరు సమాజాన్ని ఎటు తీసుకువెళుతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు..?
- ఏదో కమ్మ సామాజిక వర్గాన్ని వైయస్ఆర్సీపీ వర్గ శత్రువుగా చూస్తుందని మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వంలో కమ్మ సామాజికవర్గం భాగస్వామ్యం లేదా.. ? 

  బీజేపీతో కలిసి ఉన్నా..  చంద్రబాబు మీద ప్రేమను వదులుకోవడం లేదు అని పవన్ కల్యాణ్ చెప్పకనే చెప్పినట్టుగా ఆయన మాటలు ఉన్నాయి.  అసలు చంద్రబాబు- పవన్ కళ్యాణ్ విడిపోయారని ఎవరూ అనుకోవడం లేదు. 2014లో బహిరంగంగా, 2019లో చాటుమాటుగా రాజకీయం చేశారు, నిన్నగాక మొన్న జరిగిన ఎంపీటీసీ, జెడ్పీ టీసీ ఎన్నికల్లోనూ పదవులను పంచుకున్నప్పుడు కూడా ప్రజలకు మరోసారి అర్థమైంది మీరు ఇంకా లోపాయికారిగా రాజకీయం చేస్తున్నారని. 

  సింహం సింగిల్ గానే వస్తుందన్నట్టుగా.. జగన్ మోహన్ రెడ్డిగారు రాజకీయాల్లో ఇంతవరకూ సింగిల్ గానే వచ్చారు, వస్తారు. 
- చంద్రబాబుకు నీ తోడు.. నీకు చంద్రబాబు తోడు లేకుండా రాజకీయం చేయలేరని మీ మాటలే చెబుతున్నాయి.
- ఒకసారి లెఫ్ట్ తో.. ఇంకోపక్క రైట్ తో మీ ప్రయాణం.. మీ పొలిటికల్ ఫిలాసఫీ అంటే ఏ ఫిలాసఫీ లేకపోవడమేనా? 
- ఒకసారి లెఫ్ట్  పార్టీలతో కలిసి ప్రయాణించి.. ఇంకోసారి బీజేపీతో కలిసి ప్రయాణిస్తున్న మిమ్మల్ని, పైగా జనం అర్థం చేసుకోలేదంటారా..? మిమ్మల్ని అసలు ఎలా అర్థం చేసుకోవాలి..? 

 వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిగారు ముఖ్యమంత్రి అయితే రాజకీయాలు వదిలేస్తానని మీరు చెప్పిన మాటలు విన్నాం. ఏమైంది మీ మాట..?  
- మీ మీటింగ్ ల్లో.. అప్పుడే సీఎం.. సీఎం అని అరవాలి అంటారు.. అప్పుడే మీరు అరవద్దు అంటారు.. ఏం చేయాలో తెలియక మీ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. 

వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిగారి మీద విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన దాడి విషయంలో  కోడి కత్తి అంటూ హేళన చేయడం.. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు గురించి పదే పదే ప్రస్తావించడం చేస్తున్నారు.  మీరు మద్దతు ఇచ్చిన బీజేపీ ప్రభుత్వమే కేంద్రంలో అధికారంలో ఉంది. ఈ రెండింటిలో వివేకానంద రెడ్డిగారి హత్య కేసును సీబీఐ విచారిస్తుంది, కోడి కత్తి అంటూ మీరు హేళనగా మాట్లాడిన కేసు ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది, ఈ కేసులు ఎందుకు తేలడం లేదని కేంద్రాన్ని అడగండి.
- ఈ ప్రభుత్వం అన్ని అంశాల్లో పారదర్శకంగా నడుస్తుంది. అంతర్వేదిలో రథం తగలబడితే.. 48 గంటలు తిరక్క ముందే  సీబీఐ దర్యాప్తు చేయమని చెప్పాం. పదే పదే ఆ రెండు కేసులు ప్రస్తావిస్తూ.. రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని ఎంతకాలం మాట్లాడతారు..?

 ప్రజాస్వామ్యంలో అసలు వర్గ శత్రువులు ఉంటారా..?  ప్రజాస్వామ్యం మీద నమ్మకమున్నవారు ఎవరైనా యుద్ధాల గురించి మాట్లాడతారా..? అసలు ఓటుపైన మీకు నమ్మకం లేనట్టు ఉంది. ప్రజాస్వామ్యాన్ని నమ్మేవారు ఎవరైనా ఓటు రాజకీయాలనే నమ్ముతారు. మీకు నమ్మకం లేదు కాబట్టి ఒక ఉగ్రవాదిలా మాట్లాడుతున్నారు.  ఇలా మాట్లాడటం ప్రజాస్వామ్యంలో సబబేనా..?

 కులం, మతం,  ప్రాంతం చూడం... అని జగన్ మోహన్ రెడ్డిగారు రాజకీయం చేస్తున్నారు. ఎంత అంతరం ఉందో చూడండి. కుల ప్రాతిపదికన రాజకీయం చేద్దామని  పాత వ్యూహాలు వేస్తే.. ఆ స్థాయి దాటి సమాజం ఎప్పుడో ముందుకు వచ్చింది. కాపులు, శెట్టి బలిజలు, యాదవులు, కొప్పుల వెలమలు, దళితులు.. అందరూ అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటున్నారు. బీసీలకు 56 కార్పొరేషన్లు, 131 కూలాల్ని గుర్తించి.. అందరికీ న్యాయం చేస్తున్న మా ముఖ్యమంత్రి జగన్ గారు, బీసీలంటే బ్యాక్ బోన్ క్లాస్ అని ఎన్నికల ముందే జగన్ మోహన్ రెడ్డిగారు  ప్రకటించారని ఆ వర్గాలన్నీ అండగా ఉన్నాయి. 

  మిమ్మల్ని మానసిక అత్యాచారం చేశాం అంటున్నారు, మానసిక అత్యాచారం ఏం చేశారు..?  మంత్రుల్ని సన్నాసులు అని మాట్లాడి వెళ్ళింది మీరే కదా.. మీరే రెచ్చగొడతారు, మీరే బాధపడతారు. మీరు ఎవరినైనా ఏదైనా అనొచ్చు. తిరిగి మిమ్మల్ని అనకూడదనేది మీ ఫిలాసఫీనా..?

  కులం కార్డుతో సక్సెస్ అయినవారు ఈ రాష్ట్ర చరిత్రలో ఎవరూ లేరన్నది ప్రతి ఒక్కరికీ తెలుసు. 
- జగన్ మోహన్ రెడ్డిగారు అందరివాడు.. కొందరివాడుగా చేసేందుకు మీరు చేస్తున్న కుట్రల్లో మీరు సఫలీకృతం కాలేరు. పరిపాలన ద్వారా ప్రజల గుండెల్లో జగన్ మోహన్ రెడ్డిగారు చిరస్థాయిగా నిలిచిపోతున్నారు. 
- పరిపాలన వ్యవస్థను లబ్ధి దారుడి ఇంటి వద్దకు తీసుకెళ్ళిన మొట్టమొదటి నాయకుడు జగన్ మోహన్ రెడ్డిగారు. పెన్షన్ ను తెల్లవారుజామునే 5 గంటలకే వాలంటీర్లు వారి చేతుల్లో పెడుతున్న పరిస్థితి. ఇలాంటి నాయకుడు పది కాలాలపాటు ఉండిపోతే.. రాజకీయంగా పుట్టగతులు ఉండవని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భయపడుతున్నారు. 

 పవన్ కల్యాణ్ హైదరాబాద్ లో ఎక్కువ ఉంటున్నాడు కాబట్టి, ఇక్కడ ఏం జరుగుతుందో ఆయనకు సమాచారం లేదేమో. మీరు గోతులు పూడ్చటం వల్లే,  జగన్ మోహన్ రెడ్డిగారు పూడుస్తారని, మీరు నిరసనలు తెలియజేస్తేనే పింఛన్లు నుంచి ఆసరా, చేయూత వరకు సంక్షేమ పథకాలు అమలు చేస్తారాని మీరు అనుకుంటున్నారేమోగానీ ప్రజలు మాత్రం అనుకోరు.
- కోవిడ్ సమయంలో నేరుగా సంక్షేమ పథకాల ద్వారా పేదల ఇంటి గుమ్మం వద్దకే జగన్ మోహన్ రెడ్డిగారు అందిస్తే.. వారి ఆకలి బాధలుగానీ, వారి ఆరోగ్య బాధలు గానీ మీరు ఎప్పుడైనా పట్టించుకున్నారు... మీకు తెలిసిందల్లా.. రోడ్లు, గోతులు, ఫోటోలేనా..?

 పవన్ కల్యాణ్ బాడీ లాంగ్వేజీ ఏమిటో, ఆయన ఆవేశం ఏమిటో, ఆ ఊగిపోవడం ఎందుకో.. ప్రజలకు ఎవరికీ అర్థం కావడం లేదు.  
- నేను మాట ఇస్తున్నాను. నా కడ శ్వాస వరకు రాజకీయాల్లో ఉంటాను.. అని కులాలకు, మతాలకు మాట ఇవ్వడం ఏమిటో.. ? పవన్ కల్యాణే చెప్పాలి. 
- సమాజాన్ని కులాలు, మతాలుగా విడగొట్టాలనే లక్ష్యంగా మీ మాటలు కనిపిస్తున్నాయి. ఇటువంటి మాటలు మాట్లాడటం రాజకీయాల్లో ఫస్ట్ టైం చూస్తున్నాం. 

  గోదావరి జిల్లా వాళ్ళకు రాయలసీమ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారా..  కోపాన్ని దాచుకోవాలని చెప్పే మీరు.. అసలు ఎప్పుడైనా మీరు పాటించారా.. ఆ లక్షణం మీకు ఉందా.. మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి మీరు ఇచ్చిన స్పీచ్ లు మీరే ఒకసారి చూసుకోండి.  ఏ తరహా మాటలు ఇవి...?
- ప్రాంతాలు, కులాలు, మతాలు.. వీటన్నింటినీ వాడుకునే కార్యక్రమం చేస్తున్నారు. మీరు ఎన్నిరకాలుగా రెచ్చగొట్టినా, ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు. కుల, మత రహితంగా అభివృద్ధి- సంక్షేమం ఈ రాష్ట్రంలో జరుగుతుంది. 
- టీడీపీ 5 ఏళ్ళ పాలనలో రోడ్లకు ఎంత ఖర్చు పెట్టారు, 7 ఏళ్లు నుంచీ రోడ్లు సక్రమంగా వేయని పాపానికే ఇప్పుడు ఈ పరిస్థితి. అప్పుడు ఎందుకు మీరు మాట్లాడలేదు. 
- వర్షాల్లోనే రోడ్లు వేసేస్తే.. కోట్ల రూపాయలు వృథా అవుతాయి కదా.. రోడ్లు వేయడానికి ప్రభుత్వం సర్వం సన్నద్ధంగా ఉన్నాం. ఇక పనులు  ప్రారంభిస్తారు అనగా మీరు వచ్చి డ్రామాలు, యాక్షన్లు చేస్తుంటే ప్రజలకు అర్థమవుతున్నాయి. ఇటువంటివి చంద్రబాబే ఎక్కువ చేస్తుంటాడు. ఈమధ్య ఎండిపోయిన గడ్డి కోసం చంద్రబాబు పిలుపునిస్తే.. ఆ గడ్డి కూడా ఎక్కడా దొరకలేదట. ఎందుకంటే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా వర్షాలు, వరదలే.

  రాజకీయం చాలా కష్టమైన ప్రక్రియ అని మాత్రం పవన్ కల్యాణ్ ఒప్పుకున్నాడు. అంత కష్టమైన ప్రక్రియలో ఢిల్లీతో తలపడి, ఎన్ని కష్టాలు వచ్చినా పోరాడతానని పదేళ్ళపాటు పోరాటం చేసి ఈరోజు  ప్రజల గుండెల్లో చిరస్థాయిగా జగన్ మోహన్ రెడ్డిగారు నిలిచారు. 
- ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, కులాలకు, మతాలకు అతీతంగా ఈ రాష్ట్రంలో న్యాయం జరుగుతుంది. పవన్ ట్రాప్ లో పడటానికి ఎవరూ సిద్ధంగా లేరు. 
- మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ...కావాలంటే, వైయస్ఆర్సీపీ మేనిఫెస్టో కాపీ పంపిస్తాం.. దశల వారీగా మద్య నిషేధం చేస్తామని, మద్యం ముట్టుకుంటే ధరలు షాక్ కొట్టేలా చేస్తాం అని చెప్పాం. అందులో భాగంగానే క్రమక్రమంగా తగ్గిస్తున్నాం. ఎన్టీఆర్ తెచ్చిన మద్య పాన నిషేధానికి తూట్లు పొడిచింది ఎవరనేది చిన్న పిల్లాడిని అడిగినా చంద్రబాబు అని చెబుతార‌ని క‌న్న‌బాబు పేర్కొన్నారు.

తాజా వీడియోలు

Back to Top