డిమాండ్ల ప‌రిష్కారానికి చొర‌వ తీసుకుంటాను

అంగ‌న్ వాడీలకు మంత్రి ధర్మాన ప్ర‌సాద‌రావు హామీ

శ్రీ‌కాకుళం: గ‌త కొద్ది రోజులుగా స‌మ్మె బాట‌లో ఉన్న అంగ‌న్ వాడీలు ఇవాళ రెవెన్యూ శాఖామాత్యులు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావును క‌లిసి విన‌తి ప‌త్రం అందించారు. వారి స‌మ‌స్య‌లు చెప్పారు. త‌మకు ఉద్యోగ భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని అలానే వేత‌న పెంపుపై సానుకూల నిర్ణ‌యం తీసుకోవాల‌ని కోరారు. వీటన్నింటిపై మంత్రి ధ‌ర్మాన స్పందించారు. డిమాండ్ల ప‌రిష్కారానికి తన వంతు చొర‌వ త‌ప్ప‌క ఉంటుందని అన్నారు. ఈ ప్ర‌భుత్వం కింది వ‌ర్గాల ఉన్న‌తి కోసం ప‌నిచేస్తుంద‌ని పున‌రుద్ఘాటించారు. 

మీరెందుకు స‌మ్మె చేస్తున్నారో ఆ వివ‌రాల‌న్నీ మీ సంఘ నాయ‌కులు నాతో చెప్పారు. అవ‌న్నీ నేను విన్నాను. ఈ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌రువాత ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్ని వ‌ర్గాల క్షేమం కోరి ప‌నిచేస్తున్నారు. స్వాతంత్ర్యానంత‌రం మా అవ‌స‌రాలు ఏమీ తీర‌లేదు. స్వాతంత్ర్యం వ‌స్తే ఇంతేనా..అని నిరాశలో ఉన్న నిస్పృహ‌లో ఉన్న అన్ని వ‌ర్గాల ప్ర‌యోజ‌నాలూ కోరి,వారికి తృప్తి క‌లిగించే విధంగా నిధులు కేటాయించి చేసిన‌టువంటి ప‌ని మీరు కాద‌న‌లేరు. ఈనాడు రాష్ట్రంలో ఉన్న ధ‌న‌వంతులు, ఇంకా మ‌రికొన్ని సదుపాయాలు కావాలి అని అనుకుంటున్న వర్గాలు,మేం చెల్లించిన ప‌న్నులు మా అవ‌స‌రాల‌కు తీర్చేందుకు ఖ‌ర్చు పెట్టాలే త‌ప్ప అట్ట‌డుగు వ‌ర్గాల సంక్షేమం కోసం ఖ‌ర్చు పెట్ట కూడ‌దు అని వాదన చేస్తున్న‌టువంటి కొంత మంది ఉన్నారు. వారితో మేం ప్ర‌తిరోజూ ప్ర‌జాస్వామ్య ప‌ద్ధతిలో మా వాద‌న వినిపిస్తున్నాం.

గ‌డిచిన 75 ఏళ్ల‌లో ఎన్న‌డూ లేని విధంగా కింది వ‌ర్గాల‌కు ఎలాంటి ఆత్మాభిమానం దెబ్బ‌తిన‌కుండా ప్ర‌భుత్వ సాయం సంక్షేమ ప‌థ‌కాల రూపంలో మేం పొందుతున్నాం అన్న భావ‌న క‌లిగింది. ఈ రాజ్యాంగంలో క‌ల్పించిన హ‌క్కులు ఆదేశిక సూత్రాల అమ‌లు ద్వారా మేం పొందుతున్నాం అన్న అభిప్రాయం ఆయా వ‌ర్గాల‌లో నెల‌కొని ఉంది. అంత మాత్రం చేత మీరు చెప్పిన డిమాండ్లు అస‌మంజ‌సం అయిన‌వ‌ని నేను అన‌డం లేదు. త‌ప్ప‌కుండా చేసిన ప‌నికి త‌గిన వేత‌నం రావాలి. అన్ని భ‌ద్ర‌త‌లూ కోరాలి. మీరు అవి కోరుతున్నారు. తెలంగాణ క‌న్నా అద‌నంగా వేత‌నం ఇస్తాం అన్న మాట ఆ రోజు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇచ్చిన త‌రువాత,సీఎం ఆదేశాల‌తో ఈ ప్ర‌భుత్వ వ‌ర్గాలు అమ‌లు చేశాయి. అటుపై తెలంగాణ ప్ర‌భుత్వం వాళ్లు మ‌ళ్లీ పెంచారు.

ఇప్పుడు ప్ర‌భుత్వం ఏర్పాట‌య్యే కాలం వ‌చ్చింది. ఈనాడు మీకు సంబంధించిన కొన్ని అంశాలు చూస్తే.. ప‌దోన్న‌తులు ఆగిపోయాయి అన్నారే కానీ రాష్ట్రం మొత్తం అంతా అంద‌రికీ ప్ర‌మోష‌న్లు ఇచ్చి గ్రేడ్ 2 వాళ్లు కూడా గ్రేడ్ 1 కు వ‌చ్చి సీడీపీఓలుగా ప‌దోన్న‌తులు పొందారు. ఆ అవ‌కాశం కూడా ఈ ప్ర‌భుత్వ‌మే ఇచ్చింది. 62 సంవత్స‌రాల‌కు స‌ర్వీస్ చేయ‌డం జ‌రిగింది. చాలా చోట్లు అంగ‌న్ వాడీ కేంద్రాలు ప్ర‌యివేట్ ఇంటిలో ఉండి స‌రైన స‌దుపాయాలు లేకుండా అవ‌స్థ ప‌డుతున్న సంద‌ర్భాన నాడు - నేడు కింద పెద్ద ఎత్తున కొత్త కేంద్రాల‌ను నిర్మించిన వైనం మీరు కాద‌న‌లేరు. అలానే నాణ్య‌త‌తో కూడిన పౌష్టికాహారం అందించేందుకు చ‌ర్య‌లు తీసుకున్నాం. మీరు డిమాండ్లు చేయ‌వ‌ద్దు అని అన‌ను. అందుచేత మ‌ళ్లీ జరిగే చ‌ర్చ‌ల‌లో కాస్త వెసులుబాటుతో పాల్గొనాలి.

మీ స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వ ప్ర‌తినిధుల దృష్టికి తీసుకు వెళ్తాను. మీరు బాగా ప‌నిచేస్తున్నారు. మీరు బాగా ప‌ని చేయ‌డం లేదు అని అన‌డం లేదు. మీ సేవ‌లు బాగున్నాయి. పిల్ల‌ల మానసిక వికాసంతో పాటు శారీర‌క ఎదుగుద‌ల కూడా బాగుంది. చాలా మార్పు వ‌చ్చింద‌ని నేను విన్నాను. ఇదే ప‌ద్ధ‌తిలో రాష్ట్ర వ్యాప్తంగా ప‌నిచేస్తున్నందుకు మీకు అభినంద‌న‌లు. మీ అంద‌రి డిమాండ్ల ప‌రిష్కారానికి చొరవ తీసుకుంటాను..అని మంత్రి ధర్మాన పేర్కొన్నారు.

Back to Top