వైయ‌స్ జగన్‌ గెలుపును ఆపలేరు 

మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ 
 

విజ‌య‌న‌గ‌రం: ఎవ‌రూ ఎందులో కలిసినా  వైయ‌స్ జ‌గ‌న్ విజ‌యాన్ని ఆప‌లేర‌ని మంత్రి బొత్స‌స‌త్య‌నారాయ‌ణ ధీమా వ్య‌క్తం చేశారు.  విజ‌య‌న‌గ‌రంలో మంత్రి మీడియాతో మాట్లాడారు.  టీడీపీ-జనసేన పార్టీల మధ్య జరిగిన తొలి జాబితా సీట్ల సర్దుబాట్ల విషయం తమకు అనవసరమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వాళ్లకి అజెండా ఏమీ లేదని చెప్పారు. తాము చేసిన అభివృద్ధి, సంక్షేమం చూసి ఓటేయాలన్న అజెండాతో వైయ‌స్ఆర్‌ సీపీ ముందుకు వెళ్తుందని చెప్పారు. జనసేన 24 సీట్లకే పరిమితమైందంటే పవన్‌ సామర్థ్యం అర్థం చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు. వాళ్లు అమిత్‌షాను కలిసినా, అమితాబ్‌ బచ్చన్‌ను కలిసినా వైయ‌స్ఆర్‌ సీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. వైయ‌స్ఆర్‌ సీపీ లిస్ట్‌లలో ఎలాంటి గందరగోళం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్ర‌తిప‌క్షాల‌కు విధి విధానాలు ఏమీ లేవని వెల్లడించారు. మళ్లీ దోచుకు తినడానికి ప్రయత్నిస్తున్నారని, వైయ‌స్ జగన్‌ను ఓడిస్తామంటూ చెప్పుకొస్తున్నారని అన్నారు. ఎవ‌రూ ఎందులో కలిసినా జ‌గ‌న్ విజ‌యాన్ని ఆప‌లేర‌న్నారు. 
 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రజలకు ఏం చేశారని వారు ఓట్లు అడుగుతారని బొత్స సత్యనారాయణ నిలదీశారు. గతంలో వారు చేసిన మోసాలను చూసి ఓట్లు వేయాలని ప్రజలను అడుగుతారా అని ప్రశ్నించారు. జనసేనకు కేవలం 24 సీట్లు ఇచ్చారంటే ఆ పార్టీ నాయకుడికి ప్రజల్లో ఎంత విలువ ఉందో అర్థమవుతుందని అన్నారు. జనసేన పార్టీ తమకు అవసరమా? అన్న అంశాన్ని ప్రజలే తేల్చుతారని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

Back to Top