అమలాపురం కుట్ర వెనుక చంద్రబాబు, పవన్  

మంత్రి బొత్స సత్యనారాయణ

ఎవరు తప్పు చేసినా వదిలే ప్రసక్తే లేదు

పోలీసులు సంయమనంతో ప్రాణనష్టం తప్పింది

విజయవాడ: అమ‌లాపురం కుట్ర వెనుక ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉన్నార‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్నారు. ఎవరు తప్పు చేసినా వదిలే ప్రసక్తే లేదని ఆయ‌న‌ హెచ్చరించారు. అమలాపురం ఘటన దురదృష్టకరమని మంత్రి ఖండించారు. మంత్రి, ఎమ్మెల్యే ఇంటికి నిప్పు పెట్టడం హేయమైన చర్యగా అభివర్ణించారు. ఇలాంటి పరిణామాలు మంచిది కాదని హితవు పలికారు. మంత్రి  బొత్స సత్యనారాయణ బుధవారం మీడియాతో మాట్లాడారు.

పచ్చని కోనసీమలో చిచ్చు పెట్టారని, అమలాపురం ఘటన వెనుక కుట్ర దాగి ఉందని మంత్రి అనుమానం వ్యక్తం చేశారు. దీని వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసు అన్నారు. అంబేద్కర్‌ ఒక కులానికో, ప్రాంతానికో చెందిన వ్యక్తి కాదన్నారు. స్వార్థ రాజకీయాల కోసం విపక్షాల కుట్రను ప్రజలు గమనించాలని సూచించారు. రాజకీయ లబ్ధి పొందాలని చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ఆలోచన అన్నారు. అంబేద్కర్‌ పేరు పెట్టాలన్న నేతలు ఇప్పుడు ఎందుకు ముందుకు రావడం లేదని నిలదీశారు. కాల్పులు జరిగితే లబ్ధి పొందాలని పవన్‌ చూస్తున్నారని ధ్వజమెత్తారు. పోలీసులు సంయమనంతో ప్రాణనష్టం లేకుండా నివారించారని తెలిపారు.
 

Back to Top