పవన్‌ కొత్త సినిమా టైటిల్‌ తాళి-ఎగతాళి.. 

మంత్రి అంబ‌టి రాంబాబు ఎద్దేవా

బ్రో సినిమా అట్టర్‌ ప్లాప్‌.. అద్భుతమని చెబుతున్నారు

బ్రో సినిమా కలెక్షన్లు రోజు రోజుకు దారుణంగా పడిపోతున్నాయి

కాంట్రావర్సీ చేసి కాసులు రాల్చుకునేందుకు కక్కుర్తి

పవన్‌కు ఇచ్చిన రెమ్యూనరేషన్‌ కూడా బ్రో సినిమాకు రాలేదు

పవన్‌ కొత్త సినిమా నిర్మాత టీడీపీకి చెందిన విశ్వప్రసాద్‌

పవన్‌కు ఇవ్వాల్సిన ప్యాకేజీని విశ్వప్రసాద్‌ ద్వారా అందజేశారు

తాడేప‌ల్లి: పవన్ క‌ళ్యాణ్‌ వ్యక్తిగత తీరుపై కథ రెడీ అవుతోందని.. ఈ సినిమాకు అనేక టైటిల్స్‌ పరిశీలనలో ఉన్నాయని మంత్రి అంబటి తెలిపారు. నిత్య పెళ్లికొడుకు, తాళి-ఎగతాళి, బహుభార్యా ప్రవీణుడు.. మూడు ముళ్లు-ఆరు పెళ్లిళ్లు టైటిల్స్‌ పరిశీలనలో ఉన్నాయని ఎద్దేవా చేశారు. తన శత్రువులను తిట్టాలని అనుకున్న క్రమంలో పవన్‌ కల్యాణ్‌ ‘బ్రో’ సినిమా తీశాడని, అందుకే అది అట్టర్‌ ప్లాప్‌ అయ్యిందని ఏపీ మంత్రి అంబటి రాంబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అంతేకాదు బ్లాక్‌ మనీని వైట్‌ మనీగా మార్చే కుట్రలో భాగంగానే పవన్‌ సినిమాలు వస్తున్నాయని, బ్రో సినిమాలో చంద్రబాబు హస్తం కూడా ఉందని సంచలన ఆరోపణలు చేశారు.  మంగళవారం తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర‌ కార్యాలయంలో మంత్రి అంబ‌టి రాంబాబు  మీడియాతో మాట్లాడారు..  

కలెక్షన్లు తగ్గుతున్నాయనే కాంట్రవర్సీ..
వినోదయా సీతం అనే తమిళ ఓటీటీ చిత్రాన్ని తీసుకుని తెలుగులో బ్రో పేరుతో భారీ బడ్జెట్‌తో ఒక చిత్రాన్ని నిర్మించారు. దీనిలో పవన్‌ కళ్యాణ్, సాయి ధర్మతేజ్ నటించగా సముద్రఖని దర్శకత్వం చేశారు. ఈ సినిమాకి త్రివిక్రమ్‌ మాటలు రాశారు. విశ్వ ప్రసాద్‌ దీనికి నిర్మాతగా వ్యవహరించారు. సినిమాల గురించి నేను పెద్దగా మాట్లాడను కానీ మాట్లాడాల్సిన అనివార్య పరిస్థితిని ఆ సినిమా తీసిన వాళ్లు కల్పించారు. ఈ సినిమాలో ఒక పాత్ర పేరు శ్యాంబాబు అని పెట్టి.. ఆ పాత్రను పవన్‌ కళ్యాణ్‌ దూషించి,కించపరిచేలా సృష్టించారని నేను భావిస్తున్నాను. అంతటితో ఆగకుండా దానిలో నటించిన నటులు మళ్లీ మళ్లీ మాట్లాడుతున్నారు. కలెక్షన్లు తగ్గిపోతున్నాయి కాబట్టి, దానిని కాంట్రవర్సీ చేయడం ద్వారా కలెక్షన్లు పెంచుకోడానికి ప్రయత్నం చేస్తున్నారనిపిస్తోంది. పవన్‌ కళ్యాణ్‌ నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద అద్భుతంగా ఉందని, సూపర్‌ హిట్‌ అని ప్రచారం చేసుకుంటున్నారు. సక్సెస్‌ మీట్లు కూడా పెడుతున్నారు కానీ, వాస్తవంగా ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. అదొక డిజాస్టర్ మూవీ. 

దాని కలెక్షన్లు చూస్తే నిన్నటి వరకు రూ.  55.26 కోట్ల షేర్‌ కలెక్ట్‌ చేసింది. నిన్న అయితే 2.40 కోట్లు మాత్రమే కలెక్ట్‌ చేసింది. ఈ సినిమా అట్టర్‌ ఫ్లాఫ్‌ కావడానికి రెండు కారణాలున్నాయి. ఒకటి సినిమాను సినిమాగా తీయాలి. ఎవరో నిర్మాత డబ్బులు పెడితే..  దానిలో తన శతృవుల పేర్లు పెట్టి దూషించి పైశాచిక ఆనందం పొందాలనుకున్నప్పుడు ఆ సినిమా మీద దృష్టి పోతుంది. అటువంటిది కమర్షియల్‌గా హిట్‌ కాదు.. ప్రజలకు చేరదు. త్రివిక్రమ్, పవన్‌ కళ్యాణ్‌ కూర్చుని ఒక సన్నివేశాన్ని క్రియేట్‌ చేసి దానికి మాటలు రాసి దానిలో నన్ను ఇమిడ్చి ఒక ఆనందాన్ని పొందాలనే ప్రయత్నం చేశారు. ఈ సినిమాకు  మొత్తం కలెక్షన్లు రూ.60 నుంచి రూ.70 కోట్లు వస్తాయనుకుంటుంటే హీరో పవన్‌ కల్యాణ్‌ రెమ్యునరేషన్ రూ.50 కోట్లు పైనే ఉంది. చివరికి పవన్‌ కల్యాణ్‌ రెమ్యునరేషన్‌ కూడా వచ్చే పరిస్థితులు లేకుండా ఈ చిత్రం ఆడుతోంది. కారణం సినిమా దృష్టి సరిగాలేకపోవడం..శతృవులను ఇందులో ఇమిడ్చి శునకానందం పొందాలనుకోవడమే. 

పవన్ కు అమ్మవారి శాపం
పవన్‌ కల్యాణ్‌ చిత్రాలు ఇక ఆడవు. ఒక సారి వెనక్కి వెళ్లి చూసుకోండి. వారాహి అనే ఒక పవిత్రమైన అమ్మవారిని తన కాళ్ల కింద పెట్టుకుని వాహనంగా నామకరణం చేశాడో, దానిపై నుంచి అవాకులు చెవాకులు, బూతులు మాట్లాడే ప్రయత్నం చేశాడో ఆనాడే అమ్మవారి శాపం తగిలింది. రాజకీయంగా అతనికి ఇక భవిష్యత్తు ఉండదు..మూల్యం చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఆయన సినిమాలు కూడా ఆడవు అని నిర్మాతలు తెలుసుకుంటే మంచిది. నిర్మాత విశ్వప్రసాద్‌ పెట్టుబడి పెట్టేటప్పుడు ఇది పొలిటికల్‌ మూవీనా అనేది చూసుకోవాలి. పొలిటికల్‌  మూవీలు కూడా అనేకం వచ్చాయి. 
- కానీ ఒక సినిమాలో ఒక వేషాన్ని క్రియేట్‌ చేసి తన కక్ష తీర్చుకోవాలని తాపత్రయ పడుతున్నప్పుడు నిర్మాతలు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. సినిమా ఫ్లాఫ్‌ కాలేదు..సక్సెస్‌ అయిందంటే కలెక్షన్లు ఎంతో లెక్కలు చెప్పండి. 

టీజీ విశ్వప్రసాద్‌కు అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలున్నాయి.. టీడీపీకి చెందిన చంద్రబాబు అండ్‌ ముఠా అమెరికాలో డబ్బులు కలెక్ట్‌ చేసి, ఆ డబ్బును విశ్వప్రసాద్‌కి ఇస్తే.. బాబు ఇచ్చే ప్యాకేజీని జమ చేయడం కోసం పవన్‌ కళ్యాణ్‌కి ఈ విధంగా ఇస్తున్నారు. చంద్రబాబు ఇవ్వాల్సిన ప్యాకేజీని విశ్వప్రసాద్‌ ద్వారా అందించే కార్యక్రమం చేశారు. ఈ విషయంలో సక్సెస్‌ అయ్యారు. పవన్ కల్యాణ్.. రూ.66 కోట్లు తీసుకున్నారా..? లేక రూ.80 కోట్లు తీసుకున్నారా..? మీరు తీసుకున్న పూర్తి నగదును ఇన్‌కం టాక్స్‌ వారికి చూపించారా.. లేదా..? నీతి, నిజాయితీపరుడునని, చట్ట ప్రకారం నడుచుకునే సైనికుడు అని పదే పదే చెప్పే పవన్‌ కల్యాణ్‌ దీనిలో ఎంత రెమ్యునరేషన్‌ తీసుకున్నారు..? అనేది చెప్పాలి. దీనికి ఎంత కలెక్షన్లు వచ్చాయి..ఈ చిత్రం ఫ్లాఫ్‌ కావడానికి కారణాలేమిటి అని చిత్రసీమలో ఉన్న ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అంశం. రోజుకు రెండు కోట్లు రూపాయలు తీసుకున్నాడు. 40 రోజులు చేశాడని ఒకరు.. 23 రోజులు చేశాడని మరొకరు అన్నారు. 40 రోజులైతే రూ.80 కోట్లు తీసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. 

విశ్వప్రసాద్‌ బ్లాక్‌ మనీని వైట్‌గా చేసి సినిమా ద్వారా పవన్‌ కల్యాణ్‌కు ప్యాకేజీ రూపంలో ఇవ్వడానికి కుట్రపూరితమైన ఆలోచనలు ఉన్నాయి. ఇది ఒక స్కామ్‌. రాజకీయాల్లో ఉండి సినిమాలు తీయోచ్చు కానీ...సినిమాల్లో ఉండి రాజకీయాలు చేస్తూ సినిమాలు వదలకపోతే రెండూ నాశనం అవుతాయి. ఎన్టీఆర్‌ వంటి వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చాక ఒకటీ రెండు సినిమాలు తీశాడేమో కానీ సినిమాలను అయితే వదిలేశాడు. చిరంజీవి కూడా రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్నాళ్లు సినిమాలు తీయలేదు. ఈయనకు సినిమాలు కావాలి..రాజకీయాలు కావాలని.. రెండింటికీ న్యాయం చేయలేని ఒక సందిగ్ధ అవస్థలో ఉన్నాడనేది స్పష్టంగా అర్ధం అవుతుంది. 

క్లైమాక్స్‌లో మహిళా లోకం మెచ్చుకునేలా గుణపాఠం
మేం కూడా ఒక సినిమా తీయాలి అనుకుంటున్నాం. ఆ కథా వస్తువేమిటో ఈ సందర్భంగా వివరిస్తున్నాను. ఒక మంచి కుటుంబ నేపథ్యం.. ఒక చిన్న ఫ్యామిలీలో పుట్టినప్పటికీ అన్నదమ్ములు ఒక రంగంలో అద్భుతమైన విజయాలు సాధించి పెద్ద సెలబ్రిటీలు అవుతారు. ఆ కుటుంబంలోని ఒక వ్యక్తి యుక్త వయసు వచ్చి..చదువు సరిగ్గా అబ్బక.. బజార్ల వెంట చిల్లరగా తిరిగితూ ఏం చేయాలో అర్ధం కాకపోతే అన్నయ్యల వద్ద పెట్టారు. నేను అన్నయ్యల వద్ద ఉండను.. అన్నల్లో కలిసిపోతాను.. రౌడీయిజం చేస్తాను.. అంటూ మరోవైపు అక్కడా ఇక్కడా గోకుతాను అనేవాడు. ఇక లాభం లేదని తన అన్నలు తమ సినిమా రంగంలోకే అతన్ని తీసుకొస్తారు. అనూహ్యంగా ఆ రంగంలో అద్భుతమైన విజయాలు సాధించి అన్నయ్యల కంటే పెద్ద సెలబ్రిటీగా అతను మారిపోతాడు. ఎక్కడికెళ్లినా ఊగిపోతూ ఉపన్యాసాలు చెప్పడం.. దానికి అమాయక జనం ఈలలు వేస్తుంటారు. దేశం, సమాజం, మానవత్వం, సాంప్రదాయాల గురించి అద్భుతంగా వల్లెవేస్తుంటాడు. ఇది బయటకు కనిపించే కథ. 

మేడిపండు చందంగా అతని నిత్య జీవితంలోకి వస్తే అతనికి పెళ్లి చేస్తారు. ఆ పెళ్లి పట్టుమని రెండు ఏళ్లు కూడా ఉండదు.. మళ్ళీ మరో పెళ్ళి.. పిల్లల్ని కంటాడు.. భార్యతో విభేదిస్తాడు. సంసారం చేస్తూనే మరో స్త్రీతో సంబంధం పెట్టుకుంటాడు. ఆ స్త్రీ నన్ను పెళ్లిచేసుకుంటావా లేదా అంటే మొదటి భార్యతో సెటిల్‌ చేసుకుని రెండో భార్యను పెళ్లిచేసుకుంటాడు. ఇంతటితో ఆగదు..రెండో భార్యకూ అదే జరుగుతుంది. రెండో భార్యకు ఏం జరిగిందో మూడో భార్యకూ అదే జరుగుతుంది. మూడో భార్యకు ఏం జరుగుతుందో.. నాలుగో భార్యకూ అదే జరుగుతుంది. బయటకు మాత్రం అద్భుతమైన మేకప్‌తో సంఘసంస్కర్తలా ఫోజులు పెడుతుంటాడు. క్లైమాక్స్‌ మాత్రం అందరు పిల్లలు, అందరు భార్యలు కలిసి మహిళా లోకం మెచ్చుకునే తగిన గుణపాఠం నేర్పుతారు. ఈ కథపై సినిమా తీయడానికి ప్రయత్నం చేస్తున్నాం. పేర్లు ఏం పెట్టాలి అని ఆలోచిస్తున్నాం. ఒకరు నిత్య పెళ్లి కొడుకు అని సూచించారు..మరొకరు పెళ్లిళ్లు–పెటాకులు సూచించారు. తాళి–ఎగతాళి అనేది కూడా పరిశీలనలో ఉంది. మూడు ముళ్లు...ఆరు పెళ్లిళ్లు కూడా పరిశీలిస్తున్నాం. 

`బ్రో` సినిమాలా `మ్రో`.. మ్యారేజెస్‌- రిలేషన్స్‌-అఫెండర్‌.. ఆఖరుగా అయిన పెళ్లిళ్లు ఎన్నో.. పోయిన చెప్పులెన్నో...అనే టైటిల్  కూడా పరిశీలిస్తున్నాం. పేర్లు, కథలో మార్పులు ఏమైనా ఉన్నా, సలహాలు సూచనలు ఎవరైనా చేయవచ్చు.. ఎందుకంటే.. బ్రోలా అట్టర్‌ ప్లాప్‌ అయితే కష్టం. 

శ్యాంబాబు ఎందుకు...నేరుగా రాంబాబు అనే పెట్టుకో..
కథ సారాంశం ఏంటంటే సినిమాల్లో ఎవరిని పడితే వారిని గోకితే సినిమాలు సక్సెస్‌ కావని నిర్మాతలు, నటులు తెలుసుకోవాలి. దమ్ముంటే పూర్తి పొలిటికల్‌ సినిమాలు తీసుకోవచ్చు..శ్యాంబాబు ఎందుకు..రాంబాబే అని నేరుగా పెట్టుకోవచ్చు. నా డ్యాన్స్‌ సింక్‌ కాలేదంటున్నారు. నేనేమన్నా డాన్స్‌ మాస్టర్‌నా.. మా అన్నయ్య డాన్స్‌లో ప్రావీణ్యుడా..? ఇవన్నీ ప్రజలు ఆలోచించాలి..అనవసరంగా ఎవరిని పడితే వారిని కెలకడం సమంజసం కాదని తెలుగు చలనచిత్రసీమలో ఉన్న నిర్మాతలు, నటులు, దర్శకులు, త్రివిక్రమ్‌లాంటి రచయితలకు చెప్తున్నా. ఇలా మళ్లీ మళ్లీ చేస్తే మీరు గుణపాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం, మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. 

కొత్త సినిమాలో నాకు ఏ పాత్ర ఉండదు. నా డ్యాన్స్‌ కూడా ఉండదు. మహిళలందరూ మెచ్చుకునేలా క్లైమాక్స్‌ ఉంటుంది. అది చూడటానికే తండోపతండాలుగా ప్రజలు వస్తారు. మాది లో బడ్జెట్‌ సినిమా... మా సినిమాలో హీరో రూ.60 కోట్లు తీసుకోడు. రాంగోపాల్‌ వర్మ లాంటి వాళ్లు కూడా సినిమాలు తీసుకోవచ్చు. ఎవరు తీసినా..  పూర్తి పొలిటికల్‌ సెటైర్‌ తీసుకోవచ్చు. లేదంటే నా పేరు పెట్టుకునే సినిమా తీసుకో...ఎవరు వద్దంటారు. ఎక్కడో ఒక బిట్‌లో పెట్టుకుని నిర్మాతను మోసం చేయడం తప్పు.  నా పేరు పెట్టుకున్నందుకు నేను డబ్బులు కూడా అడగను.. సంబరాల రాంబాబు అని పెట్టుకోమను. 

అనవసరంగా చాటుచాటున గోకవద్దు... డైరెక్టుగా గోకు..చూసుకుందాం. దమ్ముంటే, ధైర్యం ఉంటే తడాకా ఏంటో చూసుకుందాం. చంద్రబాబు.. పవన్‌ కల్యాణ్‌కి ప్యాకేజీ సినిమా రూపంలో ఇచ్చాడని అంతర్జాతీయ నిఘా సంస్థల్లోని ముఖ్యమైన వ్యక్తులు నాతో మాట్లాడారు. నన్ను పిలిచి చెప్పారు.. ప్రజలకు తెలియజేయండి అని నాతో పర్సనల్‌ గా చెప్పారు. అవసరమైన సమయంలో వారెవరో చెప్తా. ఒక క్యారెక్టర్‌ను పెట్టి ఆయన్ను కాదండి అంటూ నాటకాలు వద్దు. 50- 50 నాటకాలు అడొద్దు.. డైరెక్టుగా గోకండి. డైరెక్టుగా సెటైర్‌ కొట్టండి చూద్దాం. శ్యాంబాబు, రాంబాబు అంటూ నా డ్రస్‌ వేసి ఇలాంటి డ్రామాలు వేయవద్దు. మేము తీయబోయే సినిమాకు సూటబుల్‌ టైటిల్‌ పెడితే వెయ్యి నూటపదహార్లు కూడా బహుమతిగా ఇస్తాం.

 
 

తాజా వీడియోలు

Back to Top