నెలరోజుల ముందే సాగునీరు విడుద‌ల‌

కృష్ణా డెల్టాకు సాగునీటిని విడుదల చేసిన మంత్రి అంబటి
 

విజయవాడ: ఖ‌రీఫ్‌కు నెలరోజుల ముందే సాగునీటిని ప్రభుత్వం విడుదల చేసింది. కృష్ణా డెల్టాకు సాగునీరు విడుదలైంది. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సాగునీటిని విడుదల చేశారు. ఖరీఫ్‌ పంట కోసం కృష్ణా డెల్టాలోని ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. కృష్ణా తూర్పు డెల్టాకి 1500 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకి 500 క్యూసెక్కులు సాగునీరు విడుదలైంది. కృష్ణా డెల్టా చరిత్రలో ముందుగానే సాగునీటిని విడుదల చేయడం రికార్డు. 

కృష్ణా డెల్టా పరిధిలో 13 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కృష్ణా డెల్టా పరిధిలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాలు ఉన్నాయి. పులిచింతలలో పుష్కలంగా నీరు ఉండటంతో 35 టీఎంసీల సాగునీరు అందుబాటులోకి వచ్చింది. మరో రెండు రోజులలో ఏపీలో రుతు పవనాలు ప్రవేశించనున్నాయి. రుతు పవనాల రాకతో సాగునీటికి ఇబ్బంది ఉండదని రైతులు అంటున్నారు. ఇప్పటికే జూన్ ఒకటి నుంచి గోదావరి డెల్టా పరిధిలోనూ సాగునీటిని ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. సాగునీటిని ముందుగా విడుదల చేయడంతో నవంబర్‌లో ఖరీఫ్‌ ‌పూర్తి కానుంది. రెండో పంటని కూడా డిసెంబర్ నెలలోనే వేసుకునే అవకాశం ఉంది. కృష్ణా డెల్టాకి 155 టీఎంసీల సాగునీరు అవసరమవుతుందని సాగునీటి అధికారులు అంచనా వేస్తున్నారు. నీటి విడుద‌ల కార్య‌క్ర‌మంలో మంత్రి జోగి ర‌మేష్‌, ఎమ్మెల్యేలు మ‌ల్లాదివిష్ణు, సామినేని ఉద‌య‌భాను, ఏపీ అగ్రి మిష‌న్ వైస్ చైర్మ‌న్ ఎంవీఎస్ నాగిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

Back to Top