సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

మున్సిప‌ల్‌, వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు మంత్రి ఆళ్ల నాని ఆదేశం

గుంటూరు: సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు. రాష్ట్రంలో సీజనల్‌ వ్యాధుల నివారణకు ముందస్తు ప్రణాళికలో భాగంలో గుంటూరు జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా యంత్రాంగం, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి ఆళ్ల నాని సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డెంగ్యూ, మలేరియా వ్యాధులు ఉన్న చోట ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యేక శానిటైజేషన్‌ డ్రైవ్‌ నిర్వహించాలని, జ్వరాలపై సర్వే చేయాలని సూచించారు. జ్వరాలకు సంబంధించి నిర్ధారణ పరీక్షల శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. మురికివాడలు, ఏజెన్సీల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సీజనల్‌ వ్యాధులపై మానిటరింగ్‌ కోసం ప్రత్యేక అధికారి నియమించాలన్నారు. ఆరోగ్య, మున్సిపల్‌ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. 

ప్రైవేట్‌ ఆస్పత్రులు అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. థర్డ్‌ వేవ్‌ ఉంటుందని కేంద్రం స్పష్టంగా చెప్పలేదని థర్డ్‌ వేవ్‌ వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కరోనా నియంత్రణ చర్యలపై సీఎం వైయస్‌ జగన్‌ ప్రతివారం సమీక్ష నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారని గుర్తుచేశారు. ఇప్పటికే చిన్న పిల్లలకు సంబంధించిన వార్డులు ఏర్పాటు చేశామన్నారు. 

 

Back to Top